Share News

ఐపీఎల్‌లో ‘బేబీ’ తుఫాన్‌

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:22 AM

ఐపీఎల్‌ ఆరంభమైన మూడేళ్లకు జన్మించిన ఈ పిల్లాడు... ఇప్పుడు లీగ్‌కే ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. పిన్నవయసులోనే మెగా లీగ్‌ చాన్స్‌ దక్కడమే అదృష్టం అనుకొంటే.. 14 ఏళ్ల 32 రోజుల వయసులో...

ఐపీఎల్‌లో ‘బేబీ’ తుఫాన్‌

ఐపీఎల్‌ ఆరంభమైన మూడేళ్లకు జన్మించిన ఈ పిల్లాడు... ఇప్పుడు లీగ్‌కే ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. పిన్నవయసులోనే మెగా లీగ్‌ చాన్స్‌ దక్కడమే అదృష్టం అనుకొంటే.. 14 ఏళ్ల 32 రోజుల వయసులో ఏకంగా రికార్డు సెంచరీతో ‘ఐపీఎల్‌ బేబీ’ వైభవ్‌ సూర్యవంశీ ప్రకంపనలు సృష్టించాడు. అండర్‌-19, దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్రవేసిన వైభవ్‌ను మెగా వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. కోటీ 10 లక్షలకు కొనుగోలు చేసింది. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ గాయపడడంతో వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. దీన్ని అతడు రెండు చేతులా ఒడిసిపట్టుకొన్నాడు. లీగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌కు తరలించి తన ప్రత్యేకతను చాటుకొన్నాడు. ఇక, గుజరాత్‌తో మ్యాచ్‌లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేయగా.. అందులో 11 సిక్స్‌లు ఉండడం విశేషం. ఈ క్రమంలో ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. ఎలాంటి బౌలర్‌ అయినా.. ఏమాత్రం తొణకకుండా పాలబుగ్గల చిన్నోడు సిక్స్‌లు బాదుతుంటే ప్రేక్షకులు మైమరచి చూశారు. చిన్నోడి ఆటకు ముగ్ధుడైన కోచ్‌ ద్రవిడ్‌.. వీల్‌చెయిర్‌లోంచి లేచి మరీ అభినందించాడు..


వంద కిలోమీటర్లు ప్రయాణించి..: బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్‌.. క్రికెట్‌ కోసం ఎంతో శ్రమించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే 100 కి.మీ దూరంలోని పట్నాకు వెళ్లి మరీ ప్రాక్టీస్‌ చేసేవాడు. రోజూ దాదాపు ఆరు వందల బంతులు ఎదుర్కొనేవాడు. దాదాపు నాలుగేళ్లపాటు ఇదే తరహాలో కఠినంగా సాధన చేసినట్టు వైభవ్‌ చిన్ననాటి కోచ్‌ మనీశ్‌ ఓజా చెప్పాడు. సిక్స్‌లు కొట్టగలిగిన సత్తా ఉన్నప్పుడు.. సింగిల్స్‌ ఎందుకు అని అనేవాడన్నాడు. కొడుకు సక్సెస్‌ వెనుక వైభవ్‌ తండ్రి సంజీవ్‌ పాత్ర ఎంతో ఉంది. వైభవ్‌కు మెరుగైన శిక్షణ ఇప్పించడం కోసం తన పొలాన్ని అమ్మేయడమే కాకుండా నిత్యం కొడుకు వెంటే ఉండేవాడు. ఎక్కడ మ్యాచ్‌ జరిగినా స్వయంగా తనే తీసుకువెళ్లేవాడు. అయితే, వైభవ్‌లోని ప్రతిభను తొలుత గుర్తించింది వీవీఎస్‌ లక్ష్మణ్‌. అండర్‌-19 కోచ్‌గా అతడి ఆటను విశ్లేషించిన లక్ష్మణ్‌.. ద్రవిడ్‌కు సిఫార్సు చేశాడు. దీంతో రాజస్థాన్‌ మరో ఆలోచన లేకుండానే సూర్యవంశీని అతడి కనీస ధర రూ. 30 లక్షలకు నాలుగు రెట్లు అదనంగా చెల్లించి మరీ సొంతం చేసుకొంది. చిన్నవయసులోనే మితిమీరిన పాపులారిటీ రావడంతో.. సరైన మార్గదర్శనం లేక పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు పక్కదారి పట్టారు. వైభవ్‌ అలా కాకూడదనే ఉద్దేశంతో అతడి భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యతను ద్రవిడ్‌ తీసుకొన్నాడు.

వయసు తప్పు అంటూ..: ఐపీఎల్‌లో వేలంలో వైభవ్‌ ను రాజస్థాన్‌ కొనుగోలు చేయగానే అతడి వయసుపై చర్చ రేగింది. సూర్యవంశీ జనన ధ్రువీకరణకు సంబంధించిన అవకతవకలకు పాల్పడ్డాడంటూ నెట్‌లో పుకార్లు హల్‌చల్‌ చేశాయి. కొందరైతే వైభవ్‌కు 15 ఏళ్లు అని కూడా ఆరోపించారు. ‘13 ఏళ్ల బాలుడు ఎక్కడైనా ఇలా సిక్స్‌ కొట్టగలడా?’ అని వీడియోను పోస్టు చేసిన పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ జునైద్‌ ఖాన్‌ సందేహం వ్యక్తం చేశాడు. అయితే, వీటిని అతడి తండ్రి సంజీవ్‌ తిప్పికొట్టాడు. ‘ఎనిమిదిన్నర ఏళ్ల వయసులో బీసీసీఐ నిర్వహించిన బోన్‌ టెస్ట్‌కు హాజరయ్యాడు. ఆ తర్వాత అండర్‌-19, దేశవాళీ క్రికెట్‌ ఆడాడు. మాకెలాంటి భయమూ లేదు. ఎలాంటి పరీక్షకైనా సిద్ధమేన’ని అన్నాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)


2-Spor.jpg

అమ్మ మూడు గంటలే నిద్రపోయేది

‘నేను సాధించిన ప్రతి విజయం వెనుక నా తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. నా కోసం అమ్మ తెల్లవారు జామున 2 గంటలకే లేచి వంట చేసేది. మళ్లీ రాత్రి 11 గంటలకు నిద్రపోయేది. కేవలం మూడు గంటలే ఆమెకు నిద్ర. నా కోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేయడంతో.. అన్నయ్య పనిచేయాల్సిన పరిస్థితి. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాం. అయితే, నాన్న మాత్రం ఎప్పుడూ ధైర్యం చెబుతూ నన్ను నడిపించేవారు.’

వైభవ్‌ సూర్యవంశీ

222-Spor.jpg

ఆరేళ్లప్పుడు

ఐపీఎల్‌ చూస్తూ..

14 ఏళ్ల వైభవ్‌ ఆరేళ్ల వయస్సులో అప్పటి ఐపీఎల్‌ జట్టు రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటో ఒకటి నెట్‌లో వైరల్‌ అయ్యింది. ఈ ఫొటోను లఖ్‌నవూ జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా ఎక్స్‌లో షేర్‌ చేశాడు. ‘గత రాత్రి అతడి ఇన్నింగ్స్‌ను ఆశ్చర్యంతో వీక్షించా. ఈ ఉదయం 6 ఏళ్ల వైభవ్‌ 2017లో మా జట్టే అయిన రైజింగ్‌ పుణెకు మద్దతుగా మ్యాచ్‌ను వీక్షించిన ఫొటో చూశా. ఽథ్యాంక్యూ వైభవ్‌. నీకు నా శుభాకాంక్షలు’ అని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2025 | 05:22 AM