Carlos Alcaraz: మిక్స్‌డ్ మజా
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:56 AM
టెన్నిస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వినూత్నంగా గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు యూఎస్ ఓపెన్ సిద్ధమైంది.
బరిలో అల్కారజ్-రదుకాను,
జొకోవిచ్-డానిలోవిచ్ జోడీలు
మొత్తం 16 జంటల మధ్య పోటీ
నేడు, రేపు యూఎస్ ఓపెన్
మిక్స్‌డ్ చాంపియన్‌షిప్
న్యూయార్క్: టెన్నిస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వినూత్నంగా గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు యూఎస్ ఓపెన్ సిద్ధమైంది. ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ సింగిల్స్, డబుల్స్ పోటీలు ఈనెల 24న ఆరంభం కానుండగా.. ఐదురోజుల ముందే 19, 20వ తేదీల్లో మిక్స్‌డ్ డబుల్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. కేవలం రెండ్రోజుల్లో మెరుపులా ముగిసే ఈ మిక్స్‌డ్ చాంపియన్‌షి్‌పలో స్టార్ క్రీడాకారులు పోటీపడుతుండడం టోర్నీకి మరింత ఆకర్షణ కానుంది. ముఖ్యంగా యువ కెరటం కార్లోస్ అల్కారజ్, బ్రిటన్ బ్యూటీ ఎమ్మా రదుకాను జోడీగా బరిలోకి దిగుతుండడంతో అభిమానుల దృష్టంతా వీళ్లపైనే నెలకొంది. తొలి రౌండ్‌లో టాప్ సీడ్ జాక్ డ్రేపర్ -జెస్సికా పెగుల జంటతో అల్కారజ్ జోడీ తలపడనుంది. సింగిల్స్ వరల్డ్ నెం.1 జానిక్ సినర్..సినియకోవాతో జత కట్టాడు. ఇగా స్వియటెక్-కాస్పర్ రూడ్, జొకోవిచ్-డానిలోవిచ్, ఒసాకా-మోన్‌ఫిల్స్ జంటలు మిక్స్‌డ్ బరిలోకి ఉన్నాయి. డిఫెండింగ్ చాంప్‌గా సారా ఎర్రాని-ఆండ్రియా వవస్సోరి జోడీ మరోసారి టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. 45 ఏళ్ల వీనస్ విలియమ్స్, ఒపెల్కాతో కలిసి పోటీపడుతోంది. మంగళవారం రౌండ్-1, క్వార్టర్స్ జరగనుండగా.. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లను బుధవారం నిర్వహిస్తారు.
ఫార్మాట్ విశేషాలు
జూమొత్తం 16 జంటలు పోటీపడుతున్నాయి. కంబైన్డ్ సింగిల్స్ ర్యాంకుల ఆధారంగా ఎనిమిది జంటలకు నేరుగా ఎంట్రీ దక్కగా, మిగతా ఎనిమిది జోడీలను వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంపిక చేశారు.
ఒక సెట్‌లో ఆరు గేమ్‌లకు బదులు నాలుగు గేమ్‌లు మాత్రమే ఉంటాయి. నాలుగు పాయింట్లు ముందుగా ఎవరు గెలుస్తారో వారిదే సెట్. మూడో సెట్ లేకుండా 10 పాయింట్ల టైబ్రేక్‌ను నిర్వహిస్తారు.
విజేత ప్రైజ్‌మనీ
రూ. 8.76 కోట్లు కాగా.. రన్నరప్ జోడీకి
రూ. 3.50 కోట్లు దక్కుతాయి.
చుట్టుముట్టిన విమర్శలు
ప్రధాన టోర్నీకి ముందు మిక్స్‌డ్ డబుల్స్‌ను ప్రత్యేకంగా నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. సింగిల్స్ టాప్ ప్లేయర్లకు పెద్ద పీట వేయడంతోపాటు టోర్నీ ప్రైజ్‌మనీని రెండు లక్షల నుంచి పది లక్షల డాలర్లకు (రూ. 1.74 కోట్ల నుంచి 8.73 కోట్లు) పెంచడంపై డిఫెండింగ్ చాంప్ ఎర్రాని తీవ్ర విమర్శలు చేసింది. కేవలం సింగిల్స్ ప్లేయర్లకు లాభం చేకూర్చేలా టోర్నీ ఫార్మాట్, షెడ్యూల్‌ను కూడా మార్చారని ఆరోపించింది. వారిలో డబుల్స్ స్పెషలిస్టులే లేరని తెలిపింది. అయితే, ఎక్కువ మంది సింగిల్స్ ప్లేయర్లను ఆకర్షించడానికే ఇలా చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. దీంతోపాటు టోర్నీ పాపులారీటీ కూడా పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.