Share News

కోచ్‌ రమేష్ పై సస్పెన్షన్‌

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:10 AM

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అంతర్జాతీయ అథ్లెట్లను తీర్చిదిద్దిన ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్‌ను ‘నాడా’ (జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ) సస్పెండ్‌ చేసింది. రమేష్‌తో పాటు సహాయ కోచ్‌లు...

కోచ్‌ రమేష్ పై సస్పెన్షన్‌

  • తెలుగు అథ్లెట్లు శ్రీనివాస్‌, ప్రత్యూష సహా ఏడుగురిపై వేటు

  • మరో ఇద్దరు సహాయ కోచ్‌లపైనా..

  • డోప్‌ టెస్టుల నుంచి అథ్లెట్లు తప్పించుకునేందుకు సహకరించారని అభియోగం

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అంతర్జాతీయ అథ్లెట్లను తీర్చిదిద్దిన ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్‌ను ‘నాడా’ (జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ) సస్పెండ్‌ చేసింది. రమేష్‌తో పాటు సహాయ కోచ్‌లు కరంవీర్‌ సింగ్‌, రాకేష్‌పై కూడా వేటు పడింది. జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ జట్టు చీఫ్‌ కోచ్‌గా హైదరాబాద్‌లోని ‘సాయ్‌’ కేంద్రంలో 2023 నుంచి రమేష్‌ విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది అక్టోబరు నుంచి ఇటీవల జరిగిన పలు జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన కొందరు క్రీడాకారులకు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు రక్త నమూనాలు ఇవ్వాల్సిందిగా ‘నాడా’ ఒక జాబితా రూపొందించింది. ఇందులోని ఏడుగురు అథ్లెట్లు ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారు. తెలుగు అథ్లెట్లు షణ్ముగ శ్రీనివాస్‌, సీహెచ్‌ ప్రత్యూషతోపాటు పరాస్‌ సింఘాల్‌, పూజా రాణి, కిరణ్‌, జ్యోతి, శుభుం మహార తమ రక్త నమూనాలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో నాడా నిబంధనల్లోని ఆర్టికల్‌ 2.3 కింద వీరిపై సస్పెన్షన్‌ విధించారు. వీరిలో పరాస్‌ గత ఏడాది ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో 2000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణం.. ఫెడరేషన్‌ కప్‌, జాతీయ అంతర్‌ జిల్లాల ఓపెన్‌ పోటీల్లో శ్రీనివాస్‌ రజతాలు నెగ్గారు. ప్రస్తుతం రమేష్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్న శ్రీనివాస్‌, ప్రత్యూషకు డోప్‌ పరీక్షలు నిర్వహించేందుకు కొద్దిరోజుల కిందట హైదరాబాద్‌లోని గచ్చిబౌలి క్రీడా సముదాయంలో గల ‘సాయ్‌’ సెంటర్‌కు నాడా వైద్యుల బృందం చేరుకుంది. ఆ సమయంలో పరీక్షల ఫారాన్ని నింపిన శ్రీనివాస్‌, ప్రత్యూష రక్త నమూనాలు ఇచ్చే సమయానికి అక్కడ నుంచి జారుకున్నట్టు తెలిసింది. దీంతో నాడా నిబంధనల్లోని ఆర్టికల్‌ 2.9 ప్రకారం కోచ్‌ రమేష్‌పై వేటు పడింది. ఈ ఆర్టికల్‌ ప్రకారం డోపింగ్‌కు సహకరించిన, ప్రోత్సహించిన, కుట్ర చేసిన, దాచిపెట్టడానికి లేదా వారిని తప్పించడానికి ప్రయత్నించిన కోచ్‌లు కూడా శిక్షార్హులే. కాగా, 2023లో కూడా శ్రీనివాస్‌ సహా మరో ఐదుగురు అథ్లెట్లు డోపింగ్‌ ఆరోపణలతో వేటుకు గురయ్యారు. నిషేధం ముగియడంతో వీరు గతేడాది నుంచి పోటీల్లో పాల్గొంటున్నారు.


సస్పెన్షన్‌ ఎంతకాలం..?

అభియోగాలు నిరూపితమైతే ‘నాడా’ నిబంధనల ప్రకారం కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా జీవితకాలం నిషేధాన్ని రమేష్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. జకర్తా ఆసియా క్రీడల పతాకధారి ద్యూతీ చంద్‌, పారిస్‌ పారాలింపిక్స్‌ మెడలిస్ట్‌ జీవాంజి దీప్తి, హాంగ్జౌ ఆసియా క్రీడల కాంస్య పతక విజేత అగసర నందిని, పారిస్‌ ఒలింపియన్‌ యర్రాజీ జ్యోతి, దండి జ్యోతికశ్రీ వంటి ఎందరో క్రీడాకారులను రమేష్‌ తీర్చిదిద్దారు.

ఏఎఫ్‌ఐ ఏమంటోంది..?

ఈ ఉదంతంపై స్పందించడానికి జాతీయ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ (ఏఎఫ్‌ఐ) నిరాకరించింది. నాడా నిబంధనల ప్రకారం పని చేస్తుందని మాత్రమే తెలిపింది.

డోపింగ్‌పై ‘నాడా’ ఉక్కుపాదం..

డోపింగ్‌ నిబంధనలను నాడా కఠినంగా అమలు చేస్తోంది. దేశంలోని అథ్లెట్లతో పాటు వారి కోచ్‌ల వివరాల నమోదు కార్యక్రమాన్ని ఏఎఫ్‌ఐ గతేడాది మొదలుపెట్టింది. సర్టిఫైడ్‌ కోచ్‌లైనా, కాకపోయినా.. అథ్లెట్లు ఎవరిని తమ కోచ్‌లుగా పేర్కొంటారో వారి వివరాలను తమకు ఇవ్వాలని ఏఎఫ్‌ఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. వివరాలివ్వకపోతే ఆ అథ్లెట్లను ఏఎఫ్‌ఐ బ్లాక్‌లిస్ట్‌లో పెడుతోంది. డోపింగ్‌ కేసులు ఎక్కువ వెలుగు చూస్తుండడంతో ఏఎఫ్‌ఐ ఢిల్లీ పోలీసు స్పెషల్‌ కమిషనర్‌ సాగర్‌ప్రీత్‌ హూడా నేతృత్వంలో హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వచ్చాక డోపింగ్‌ కేసుల విచారణలో వేగం పెరిగింది.


తప్పు చేయలేదు

నేను తప్పు చేయను. తప్పు చేసే వారిని ప్రోత్సహించను. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన పేద అథ్లెట్లను తీర్చిదిద్దడానికే నా జీవితాంతం కృషి చేశా. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధం.

నాగపురి రమేష్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2025 | 03:10 AM