Womens Chess World Cup 2025: ఫలితం టైబ్రేక్‌కు
ABN , Publish Date - Jul 28 , 2025 | 02:47 AM
మహిళల చెస్ వరల్డ్‌కప్ విజేత ఎవరో తేలేది టైబ్రేక్‌లోనే. జీఎం కోనేరు హంపి, ఐఎం దివ్య దేశ్‌ముఖ్ మధ్య ఆదివారం జరిగిన రెండో క్లాసిక్ గేమ్ కూడా 34 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. తొలి గేమ్‌లో కూడా ఇద్దరూ పాయింట్ పంచుకొన్నారు...
రెండో గేమ్‌లోనూ హంపిని నిలువరించిన దివ్య
విజేత తేలేది నేడే
మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్
బటూమి (జార్జియా): మహిళల చెస్ వరల్డ్‌కప్ విజేత ఎవరో తేలేది టైబ్రేక్‌లోనే. జీఎం కోనేరు హంపి, ఐఎం దివ్య దేశ్‌ముఖ్ మధ్య ఆదివారం జరిగిన రెండో క్లాసిక్ గేమ్ కూడా 34 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. తొలి గేమ్‌లో కూడా ఇద్దరూ పాయింట్ పంచుకొన్నారు. హంపి, దివ్య 1-1తో సమంగా నిలవడంతో.. క్వీన్ ఎవరనేది సోమవారం జరిగే టైబ్రేక్‌లో తేలనుంది.
దూకుడు తగ్గించి..
రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడడం హంపికి లాభిస్తుందని భావించారు. కానీ, డేరింగ్‌గా ఆడే దేశ్‌ముఖ్ వీలైనంతగా డ్రా కోసం ప్రయత్నించింది. ఇద్దరూ సరికొత్త ప్రయోగాలు చేయకుండా.. సంప్రదాయ ఆటకే ప్రాధాన్యమిచ్చారు. కోనేరు ఇంగ్లిష్ ఓపెనింగ్ చేయగా.. దేశ్‌ముఖ్ అగిన్‌కోర్ట్ డిఫెన్స్‌తో ఎదుర్కొంది. మిడిల్ గేమ్‌లో బోర్డుపై ఆధిపత్యం సాధించడానికి పాన్‌ను ట్రేడ్ చేసింది. అయితే, దివ్య బిష్‌పతో ఎఫ్3లోని హంపి నైట్‌ను పిన్ చేసింది. ఈ క్రమంలో హంపి నైట్‌ను కోల్పోగా.. దివ్య బిష్‌పను చేజార్చుకొంది. 14వ ఎత్తు వేయడానికి కోనేరు కొంత సమయం తీసుకోగా.. దివ్యకు 20 నిమిషాల ఆధిక్యం దక్కింది. 16 ఎత్తుల తర్వాత ఇద్దరూ రూక్‌లను ట్రేడ్ చేసుకొన్నారు. హంపి, దివ్య సమవుజ్జీలుగా నిలవడంతో.. గేమ్ డ్రా దిశగా సాగింది. అనంతరం దేశ్‌ముఖ్ క్వీన్స్ ట్రేడ్ కోసం ప్రయత్నించినా.. తోసిపుచ్చిన హంపి గెలుపు కోసం ప్రయత్నించింది. 28వ ఎత్తులో సి7లోకి క్వీన్‌ను నడిపిన హంపి..
దివ్యను ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేసింది. దీన్ని పసిగట్టిన దేశ్‌ముఖ్ తన క్వీన్‌ను డి5లోకి నడిపి తప్పించుకొంది. ఎండ్‌గేమ్‌లో ఇద్దరూ వేగంగా ఎత్తులు వేస్తూ పాన్‌లను త్యాగం చేశారు. హంపి క్రమంగా పట్టుబిగిస్తున్న సమయంలో దివ్య డ్రా కోసం తీవ్రంగా ప్రయత్నించింది. 30వ ఎత్తు నుంచి వరుసగా మూడుసార్లు తన క్వీన్‌ను డీ1లోకి నడిపిన దేశ్‌ముఖ్.. 34 ఎత్తులో గేమ్‌ను డ్రాగా ముగించింది. కాగా, మూడో స్థానం కోసం చైనా గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన పోరులో టాన్ జోంగ్‌యి 1.5-0.5తో లి టింగ్జీపై గెలిచింది.
టైబ్రేక్ ఇలా..
టైబ్రేక్‌లో 15 నిమిషాల రెండు ర్యాపిడ్ గేమ్‌ల సెట్ జరగనుంది. ఇది డ్రా అయితే.. 10 నిమిషాల రెండు ర్యాపిడ్ గేమ్‌ల సెట్ నిర్వహిస్తారు. ఇది కూడా సమంగా ముగిస్తే.. 5 నిమిషాల రెండు బ్లిట్జ్ గేమ్‌ల సెట్ ద్వారా ఫలితం తేల్చేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ ఇది కూడా డ్రా అయితే.. చివరగా మూడు నిమిషాల గేమ్‌తో ఫలితం వచ్చే వరకు ఆడిస్తారు.
ఇవి కూడా చదవండి..
మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..