Pro Kabaddi League Season 12: టైటాన్స్ మరో గెలుపు
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:21 AM
సొంతగడ్డపై ఆతిఽథ్య తెలుగు టైటాన్స్ జోరు పెంచింది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-12 తొలి అంచె లీగ్‌లో రెండో గెలుపును నమోదు చేసింది. ఇక్కడి పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో...
బెంగాల్ వారియర్స్ చిత్తు
ప్రొ కబడ్డీ లీగ్
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): సొంతగడ్డపై ఆతిఽథ్య తెలుగు టైటాన్స్ జోరు పెంచింది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-12 తొలి అంచె లీగ్‌లో రెండో గెలుపును నమోదు చేసింది. ఇక్కడి పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 44-34 స్కోరుతో పటిష్టమైన బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. కీలక మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన టైటాన్స్ ఆటగాళ్లు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. టైటాన్స్‌లో ఆటగాళ్లలో భరత్ 12, కెప్టెన్ విజయ్ మాలిక్ 11 పాయింట్లు రాబట్టి జట్టు విజయంలో కీలకపాత్ర వహించారు. మ్యాచ్ 11వ నిమిషంలోనే వారియర్స్‌ను ఆలౌట్ చేసి ఒత్తిడి తెచ్చారు. విజయ్ రైడ్‌లో మూడు పాయింట్లు రాబట్టి టైటాన్స్ శిబిరంలో ఉత్సాహం పెంచాడు. ప్రథమార్థాన్ని 23-14 ఆధిక్యంతో ముగించిన టైటాన్స్ ఆటగాళ్లు ద్వితీయార్ధంలోనూ అదే జోరు కొనసాగించి స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఈ దశలో వారియర్స్ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆఖర్లో వారియర్స్ ఆటగాళ్లు వరుసగా టైటాన్ డిఫెండర్లకు చిక్కడంతో మ్యాచ్ ఏకపక్షంగా మారింది. ఉత్కంఠగా సాగిన మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 36-35తో జైపూర్ పింక్‌పాంథర్స్‌పై గెలుపొందింది.