Team India Under Pressure: ఓదార్పు దక్కేనా?
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:40 AM
కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన చేదు అనుభవాన్నే మిగిల్చింది. వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోవడంతో...
ఒత్తిడిలో టీమిండియా
స్పిన్నర్ కుల్దీ్‌పనకు చాన్స్?
ఆసీ్‌సతో మూడో వన్డే
సిడ్నీ: కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన చేదు అనుభవాన్నే మిగిల్చింది. వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోవడంతో సిరీస్ ఇప్పటికే కంగారూల వశమైంది. ఇక ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డే శనివారం సిడ్నీలో జరుగనుంది. టీమిండియా కనీసం ఇక్కడైనా విజయం దక్కించుకుని పరువు కాపాడుకోవాలనుకుంటోంది. అటు మరో రెండేళ్ల తర్వాతే భారత్ ఇక్కడ పర్యటించనుండడంతో వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఆసీస్ గడ్డపై బహుశా ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ బరిలోకి దిగకపోయినా.. పటిష్ట భారత్‌ను మట్టికరిపించిన ఆసీస్ జోష్‌లో ఉంది. అందుకే అలక్ష్యం లేకుండా ఆడి తొలిసారి భారత్‌పై 3-0తో సిరీ్‌సను క్లీన్‌స్వీప్ చేయాలనుకుంటోంది. మరోవైపు ఇక్కడి ఎస్‌సీజీ మైదానంలో ఆడిన చివరి ఐదు వన్డేల్లో భారత్ ఒక్కసారే నెగ్గింది.
కోహ్లీపైనే కళ్లన్నీ..: 300కు పైగా వన్డేలు ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలిసారిగా రెండు వరుస డకౌట్లతో నిరాశపర్చాడు. ఏ మాత్రం మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఏడు నెలల తర్వాత బరిలోకి దిగిన తనకు పరిస్థితులు కలిసిరావడం లేదు. అడిలైడ్‌లో డకౌటై వెనుదిరిగినప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో సెండాఫ్ ఇవ్వడం, కోహ్లీ కూడా వారికి తన గ్లోవ్స్‌ను చూపించడం ఆసక్తి రేపింది. ఏదిఏమైనా సిడ్నీలో తన పవర్ చూపాలని టీమ్‌తో పాటు ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. రోహిత్ మాత్రం గత వన్డేలో అదరగొట్టాడు. గిల్, రాహుల్ రాణించాల్సి ఉంది. అయితే స్పిన్నర్ కుల్దీ్‌పను బెంచీకే పరిమితం చేయడం
విమర్శలకు దారి తీస్తోంది. అడిలైడ్‌లో జంపాకు నాలుగు వికెట్లు దక్కడంతో అందరూ కుల్దీ్‌పను గుర్తుచేసుకున్నారు. జంపాను ట్రంప్‌కార్డుగా ఆస్ర్టేలియా ఉపయోగిస్తుంటే..మన ప్రధాన స్పిన్నర్ కుల్దీ్‌పకు మాత్రం జట్టులో చోటే ఇవ్వడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అతడికి బెర్త్ దక్కాలంటే సుందర్, హర్షిత్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అలాగే పేసర్ ప్రసిద్ధ్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు. ఆల్‌రౌండర్‌గా నితీశ్ బ్యాట్‌తో, బంతితో విఫలమయ్యాడు. అతడి మీడియం పేస్ ప్రత్యర్థి బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బందిపెట్టడం లేదు. అక్షర్ మాత్రం జడేజాను మరిపించి అంచనాలను అందుకున్నాడు. పేసర్లు సిరాజ్, అర్ష్‌దీప్ ఆసీస్ బ్యాటర్లపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది.
ఆత్మవిశ్వాసంతో ఆసీస్ : అద్భుత ఆటతీరుతో ఆసీస్ తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది. మాథ్యూ షార్ట్, రెన్షా, మైకేల్ ఓవెన్, కూపర్ కనోలీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలమని నిరూపించుకున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఇబ్బందిపెట్టిన స్పిన్నర్ కునేమన్.. ఈసారి జంపాకు జత కలవనుండడం ఇబ్బందే. అటు ఓపెనర్ ట్రావిస్ హెడ్ నుంచి మెరుపులు కనిపించడం లేదు. తను విజృంభిస్తే భారత్‌కు మరిన్ని కష్టాలు తప్పవు. సీనియర్ పేసర్లు స్టార్క్, హాజెల్‌వుడ్‌లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.
పిచ్
సిడ్నీ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఇక్కడ భారీ స్కోర్లు సాధించిన ఆసీస్ జట్టు తమ ప్రత్యర్థులపై వరుసగా ఆరు వన్డే విజయాలతో దూసుకెళ్తోంది. స్పిన్ కూడా కీలకం కానుంది. వర్ష సూచన లేదు.