Wimbledon Semifinals: స్వియటెక్ అదుర్స్
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:09 AM
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో ఎనిమిదో సీడ్ ఇగా స్వియటెక్ మొదటిసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫైనల్లో చోటు కోసం అన్‌సీడెడ్ బెలిండా బెన్సిక్‌తో ఈ పోలెండ్ భామ...
తొలిసారి సెమీస్‌లో ప్రవేశంఫ బెన్సిక్‌తో అమీతుమీ
పురుషుల సెమీస్‌లో సినర్, జొకోవిచ్
లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో ఎనిమిదో సీడ్ ఇగా స్వియటెక్ మొదటిసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫైనల్లో చోటు కోసం అన్‌సీడెడ్ బెలిండా బెన్సిక్‌తో ఈ పోలెండ్ భామ గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో స్వియటెక్ 6-2, 7-5తో వరుస సెట్లలో 19వ సీడ్ లుడ్మిలా సంసనోవా (రష్యా)పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మరో క్వార్టర్‌ఫైనల్లో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) 7-6 (3), 7-6 (2)తో ఏడో సీడ్, టీనేజర్ ఆండ్రీవా (రష్యా)కు షాకిచ్చింది. మహిళల మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ సబలెంక (బెలార్‌స)-13వ సీడ్ అమందా అనిసిమోవా (అమెరికా) తలపడనున్నారు. స్వియటెక్ ఐదు గ్రాండ్‌స్లామ్‌లు సొంతం చేసుకున్నా...అందులో నాలుగు టైటిళ్లు మట్టి కోర్టు అయిన ఫ్రెంచ్ ఓపెన్‌లో సాధించినవే. మరొకటి హార్డ్‌కోర్ట్ అయిన యూఎస్ ఓపెన్‌లో గెలిచింది. అలాగే హార్డ్ కోర్టులపై సాగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆమె రెండుసార్లు సెమీ్‌సకు చేరింది. కానీ పచ్చికపై ఆడే వింబుల్డన్‌లో స్వియటెక్ గతంలో ఐదుసార్లు తలపడినా..ఒక్కసారే క్వార్టర్‌ఫైనల్ వరకు రాగలిగింది.
సినర్‌తో జొకో ఢీ
పురుషుల టాప్ సీడ్ యానిక్ సినర్, ఆరో సీడ్ నొవాక్ జొకోవిచ్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. క్వార్టర్‌ఫైనల్లో సినర్ (ఇటలీ) 7-6 (2), 6-4 6-4తో 10వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)ను చిత్తు చేశాడు. గాయంతో బాధపడుతూ కూడా మ్యాచ్‌ను సినర్ వరుస సెట్లలో ముగించడం విశేషం. మరో క్వార్టర్‌ఫైనల్లో జొకోవిచ్ 6-7(8), 6-2, 7-5, 6-4తో 22వ సీడ్ ఫ్లావియో కొబొల్లి (ఇటలీ)పై గెలిచి వరుసగా ఏడోసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో సినర్‌తో జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంప్ అల్కారజ్, ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ పోటీపడనున్నారు.
ఇవీ చదవండి:
గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి