Surekha Leads India to Triple Gold: సురేఖ డబుల్ ధమాకా
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:46 AM
జ్యోతి సురేఖ ముందుండి నడిపించడంతో.. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత కాంపౌండ్ ఆర్చర్లు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు కొల్లగొట్టారు....
‘కాంపౌండ్’లో భారత్‌కు మూడు స్వర్ణాలు
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షి్‌ప
ఢాకా: జ్యోతి సురేఖ ముందుండి నడిపించడంతో.. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత కాంపౌండ్ ఆర్చర్లు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు కొల్లగొట్టారు. సీనియర్ ఆర్చర్ సురేఖ టీమ్‌తోపాటు వ్యక్తిగత స్వర్ణంతో రాణించింది. గురువారం జరిగిన మహిళల టీమ్ ఫైనల్లో సురేఖ, దీప్షిక, ప్రతీక ప్రదీ్‌పల త్రయం 236-234తో కొరియాపై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకొంది. తొలి సెట్‌లో 59-59తో సమంగా నిలిచినా రెండో సెట్‌లో భారత్ 59-58తో కొరియాపై ఆధిక్యం సాధించింది. మూడో సెట్ 59-59తో సమం కాగా.. నాలుగో సెట్‌లో 59-58తో పైచేయి సాధించిన భారత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకొంది. ఇక, మహిళల వ్యక్తిగత విభాగంలో సహచరి, 17 ఏళ్ల ప్రతీకపై జ్యోతిసురేఖ 147-145తో గెలిచి రెండో బంగారు పతకాన్ని దక్కించుకొంది. దీంతో ప్రతీకకు రజతం లభించింది. మిక్స్‌డ్ విభాగం స్వర్ణ పోరులో దీప్షిక-అభిషేక్ వర్మ జోడీ 153-151తో బంగ్లాదేశ్ జంటపై గెలిచింది. అయితే, ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పురుషుల జట్టుకు ఫైనల్లో షాక్ తగిలింది. అభిషేక్ వర్మ, రాజేష్ జాదవ్, ప్రథమే్‌షల త్రయం 229-230 కజకిస్థాన్ బృందం చేతిలో ఓడి రజతానికే పరిమితమైంది.