Share News

రైజర్స్‌ ఆశలపై నీళ్లు

ABN , Publish Date - May 06 , 2025 | 04:14 AM

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసులో సాంకేతికంగానే ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇప్పుడా అవకాశం కూడా లేకుండా పోయింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా...

రైజర్స్‌ ఆశలపై నీళ్లు

నేటి మ్యాచ్‌

ముంబై X గుజరాత్‌

వేదిక : ముంబై. రా.7.30 నుంచి

వర్షంతో మ్యాచ్‌ రద్దు

ప్లేఆఫ్స్‌ రేసు నుంచి హైదరాబాద్‌ అవుట్‌

ఢిల్లీ 133/7

హైదరాబాద్‌: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసులో సాంకేతికంగానే ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇప్పుడా అవకాశం కూడా లేకుండా పోయింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో కేవలం ఏడు పాయింట్లతో ఉన్న రైజర్స్‌ అధికారికంగానే నిష్క్రమించింది. మరోవైపు ఈ వర్షం ఢిల్లీ పాలిట వరంగా మారింది. ఆ జట్టు 13 పాయింట్లతో తమ చాన్స్‌ను మరింత మెరుగుపర్చుకుంది. సరిగ్గా ఢిల్లీ ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక దాదాపు గంటన్నర పాటు కురిసిన వర్షంతో మైదానం పూర్తి చిత్తడిగా మారింది. వర్షం తగ్గినా అక్కడక్కడా నీటి గుంటలు ఏర్పడడంతో ఐదు ఓవర్ల మ్యాచ్‌ కూడా వీలు పడలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ను కేటాయించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని రైజర్స్‌ బౌలర్లు వణికించారు. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసింది. అశుతోష్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41), స్టబ్స్‌ (36 బంతుల్లో 4 ఫోర్లతో 41) రాణించారు. కమిన్స్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత వర్షం కారణంగా సన్‌రైజర్స్‌ బరిలోకి దిగలేకపోయింది.


పేకమేడను తలపించేలా...

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ అనూహ్యంగా తడబడింది. గతంలో ఇదే పిచ్‌పై రైజర్స్‌ 190 రన్స్‌ చేయగా.. లఖ్‌నవూ 16 ఓవర్లలోపే బాదేసింది. ఈసారి కూడా అలవోకగా 200 పరుగులు వస్తాయని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు. కానీ రైజర్స్‌ పేసర్లు అద్భుతమే చేశారు. టపటపా వికెట్లు తీయడంతో ఒక్కో పరుగు సాధించేందుకు డీసీ అష్టకష్టాలు పడింది. స్టబ్స్‌-అశుతోష్‌ ఏడో వికెట్‌కు 66 పరుగులు జోడించడంతో కాస్త గౌరవప్రదమైన స్కోరందుకుంది. కెప్టెన్‌ కమిన్స్‌ ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ కరుణ్‌ (0)ను అవుట్‌ చేసి షాకిచ్చాడు. ఆ తర్వాత తన వరుస ఓవర్లలో డుప్లెసి (3), పోరెల్‌ (8)లను వెనక్కి పంపాడు. ఈ ముగ్గురి క్యాచ్‌లను కీపర్‌ ఇషాన్‌ పట్టేయడం విశేషం. ఇక ఆరో ఓవర్‌లో అక్షర్‌ (6)ను హర్షల్‌ దెబ్బతీయగా, పవర్‌ప్లేలో జట్టు 26/4 స్కోరుతో అత్యంత ఇబ్బందికర పరిస్థితిలో నిలిచింది. ఫామ్‌లో ఉన్న రాహుల్‌ (10) కూడా మరో మూడు పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో ఢిల్లీ కనీసం వంద పరుగులైనా చేయగలుగుతుందా? అనే సందేహం నెలకొంది. విప్రజ్‌ (18) ధాటిగా ఆడినా 13వ ఓవర్‌లో రనౌటయ్యాడు. ఈదశలో స్టబ్స్‌-అశుతోష్‌ జోడీ క్రీజులో నిలిచి పరువు కాపాడే ప్రయత్నం చేశారు. 15వ ఓవర్‌లో అశుతోష్‌ రెండు సిక్సర్లతో 14 రన్స్‌ సమకూరాయి. అలాగే హర్షల్‌ ఓవర్‌లోనూ రెండు వరుస ఫోర్లతో స్కోరును వంద దాటించాడు. అటు స్టబ్స్‌ కూడా 18వ ఓవర్‌లో రెండు ఫోర్లతో సహకరించాడు. కానీ చివరి రెండు ఓవర్లలో 18 పరుగులే చేసిన డీసీ అశుతోష్‌ వికెట్‌ను కోల్పోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది.


స్కోరుబోర్డు

ఢిల్లీ: కరుణ్‌ నాయర్‌ (సి) ఇషాన్‌ (బి) కమిన్స్‌ 0, డుప్లెసి (సి) ఇషాన్‌ (బి) కమిన్స్‌ 3, అభిషేక్‌ పోరెల్‌ (సి) ఇషాన్‌ (బి) కమిన్స్‌ 8, కేఎల్‌ రాహుల్‌ (సి) ఇషాన్‌ (బి) ఉనాద్కట్‌ 10, అక్షర్‌ (సి) కమిన్స్‌ (బి) హర్షల్‌ 6, స్టబ్స్‌ (నాటౌట్‌) 41, విప్రజ్‌ (రనౌట్‌) 18, అశుతోష్‌ (సి) మనోహర్‌ (బి) మలింగ 41, స్టార్క్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 133/7; వికెట్ల పతనం: 1-0, 2-6, 3-15, 4-26, 5-29, 6-62, 7-128; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-19-3, ఉనాద్కట్‌ 4-0-13-1, హర్షల్‌ 4-0-36-1, మలింగ 4-0-28-1, జీషన్‌ 3-0-30-0, అభిషేక్‌ శర్మ 1-0-5-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

బెంగళూరు 11 8 3 0 16 0.482

పంజాబ్‌ 11 7 3 1 15 0.376

ముంబై 11 7 4 0 14 1.274

గుజరాత్‌ 10 7 3 0 14 0.867

ఢిల్లీ 11 6 4 1 13 0.362

కోల్‌కతా 11 5 5 1 11 0.249

లఖ్‌నవూ 11 5 6 0 10 -0.469

హైదరాబాద్‌ 11 3 7 1 7 -1.192

రాజస్థాన్‌ 12 3 9 0 6 -0.718

చెన్నై 11 2 9 0 4 -1.117

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2025 | 04:14 AM