Sunil Gavaskar: ఆటే ముఖ్యమని.. ప్రధానిని కూడా కలవలేదు
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:09 AM
మ్యాచ్‌కు ముందు ఓ దేశ ప్రధాని ఆటగాళ్లను కలుసుకునేందుకు వస్తే.. ఎవరైనా ఉద్వేగంతో ఎదురుచూస్తారు. కానీ భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం తనకు ఆటే ముఖ్యమంటూ మైదానంలోకి వెళ్లాడట.
గవాస్కర్‌పై కర్సన్ ఘావ్రీ ప్రశంస
న్యూఢిల్లీ: మ్యాచ్‌కు ముందు ఓ దేశ ప్రధాని ఆటగాళ్లను కలుసుకునేందుకు వస్తే.. ఎవరైనా ఉద్వేగంతో ఎదురుచూస్తారు. కానీ భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం తనకు ఆటే ముఖ్యమంటూ మైదానంలోకి వెళ్లాడట. ఈ విషయాన్ని సన్నీ సహచరుడు, మాజీ పేసర్ కర్సన్ ఘావ్రీ వెల్లడించాడు. ‘‘ఢిల్లీలో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌కు ముందు అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆటగాళ్లను కలుస్తారని సమాచారం వచ్చింది. కానీ ఆయన రావడం ఆలస్యం కాగా అప్పటికే టాస్ పూర్తయి భారత్ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమైంది.
గవాస్కర్ ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన రాజ్‌సింగ్ దుంగార్పూర్ ‘ప్రధాని వచ్చారు. మీరందరూ రండి. మూడు నిమిషాల్లో వచ్చేద్దాం’ అని చెప్పాడు. అయితే సన్నీ మాత్రం ‘మీరెళ్లండి.. నాకు నా బ్యాటింగ్, టీమ్ ముఖ్యం’ అని అన్నాడు. బరిలోకి దిగి టీ బ్రేక్ వరకు ఆడాడు. అయితే ఆ రోజు ఆట చివర్లో ప్రధాని స్వయంగా గవాస్కర్‌ను కలుసుకునేందుకు మరోసారి రావడం విశేషం’ అని ఘావ్రీ వివరించాడు.