South Africa Womens Team: సఫారీల దూకుడు
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:59 AM
తమ ఆరంభ మ్యాచ్‌లో ఘోర పరాభవం తర్వాత దక్షిణాఫ్రికా మహిళల జట్టు అదరగొడుతోంది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన వన్డేలో డక్‌వర్త్ లూయిస్...
వరుసగా నాలుగో విజయం
చిత్తుగా ఓడిన శ్రీలంక
మహిళల వన్డే వరల్డ్‌కప్
కొలంబో: తమ ఆరంభ మ్యాచ్‌లో ఘోర పరాభవం తర్వాత దక్షిణాఫ్రికా మహిళల జట్టు అదరగొడుతోంది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సఫారీలు పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో వారికిది వరుసగా నాలుగో గెలుపు కాగా, పట్టికలో ఈ జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక తమ ఛేదనను ఓపెనర్లు వోల్వార్ట్ (60 నాటౌట్), బ్రిట్స్ (55 నాటౌట్) ఇద్దరే ముగించడం విశేషం. అయితే దాదాపు ఐదు గంటల పాటు వర్షంతో ఆగిన ఈ మ్యాచ్‌ను చివరకు 20 ఓవర్లకు కుదించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లను కోల్పోయి 105 పరుగులు సాధించింది. ఓపెనర్ విష్మి (34) టాప్ స్కోరర్. స్పిన్నర్ ఎంలబాకు మూడు, పేసర్ క్లాస్‌కు రెండు వికెట్లు దక్కాయి. లంక 12 ఓవర్లలో 46/2 స్కోరుతో ఉన్న సమయంలో భారీ వర్షంతో బ్రేక్ ఏర్పడింది. ఆ తర్వాత మిగిలిన 8 ఓవర్లలో వేగంగా ఆడి 59 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. అనంతరం సఫారీలకు 121 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, 14.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 125 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు వోల్వార్ట్, బ్రిట్స్ లంక బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపు కదిలారు. చక్కటి సమన్వయంతో ఆడిన ఈ జోడీ 13వ ఓవర్‌లో చెరో రెండు ఫోర్లు బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అలాగే 41 బంతుల్లో వోల్వార్ట్ హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో 4,6తో మ్యాచ్‌ను ముగించిన బ్రిట్స్ సైతం 42 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచింది.