Smriti Mandhana Announce Cancellation of Wedding: అవును.. మా పెళ్లి రద్దయ్యింది
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:05 AM
ఊహించిందే జరిగింది. భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వివాహం రద్దయ్యింది. ఈమేరకు ఆదివారం వీరిద్దరూ వేర్వేరుగా....
ప్రకటించిన మంధాన, పలాష్
ముంబై: ఊహించిందే జరిగింది. భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వివాహం రద్దయ్యింది. ఈమేరకు ఆదివారం వీరిద్దరూ వేర్వేరుగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు. ఈ ప్రకటనలు వెలువడ్డ కాసేపటికే ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం గమనార్హం. అయితే అసలు కారణాన్ని మాత్రం వివరించలేదు. కొన్నేళ్లుగా ఈ జంట మధ్య ప్రేమాయణం సాగుతుండగా.. గత నెల 23న వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. అయితే పెళ్లి రోజు ఉదయమే మంధాన తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. దీంతో వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే అటు పలాష్ కూడా అనారోగ్యానికి గురైనట్టు కథనాలు వినిపించాయి. ఇంతలోనే మంధాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలాష్‌తో దిగిన ఫొటోలన్నీ తొలగించడం చర్చనీయాంశమైంది. అలాగేపలాష్‌కు గతంలోనే ఓ కొరియోగ్రాఫర్‌తో సంబంధం ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి.
స్మృతి ఏమందంటే..
‘గత కొద్దివారాలుగా నా జీవితం చుట్టూ ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. దీనిపై ఓ స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అవును.. నా వివాహం రద్దయ్యింది. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నా. మీరు కూడా వదిలేస్తారని భావిస్తున్నా. దయచేసి మా రెండు కుటుంబాల గోప్యతను గౌరవించి.. ముందుకు సాగేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా. వీలైనంత కాలం భారత్ తరఫున క్రికెట్ ఆడి ట్రోఫీలు గెలవాలని కోరుకుంటున్నా. ఈ సమయంలో నాకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు’ అని మంధాన పేర్కొంది.
పలాష్ ముచ్చల్ సైతం పెళ్లి రద్దు నిర్ణయాన్ని ఇన్‌స్టా స్టోరీలో వెల్లడించాడు. తన వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వచ్చి జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. ‘ఏ మాత్రం ఆధారాల్లేని వదంతులను నమ్మేస్తున్న వారిని చూస్తే బాధేస్తోంది. ఇది నా జీవితంలో ఎంతో కష్టకాలం. ఎప్పటికీ నిర్ధారించుకోలేని పుకార్లను నమ్మి అవతలి వ్యక్తులను అంచనావేసే ముందు, మన మాటలు వారిని ఎంత బాధపెడతాయో ఆలోచించుకోవాలి. నాకు పరువు నష్టం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా. ఈ కష్ట సమయంలో నాకు నా పక్షాన నిలిచినవారందరికీ ధన్యవాదాలు’ అని ముచ్చల్ పేర్కొన్నాడు.