Shubman Gills: హైహై నాయకా
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:31 AM
ఏకంగా నాలుగు సెషన్లపైగానే బ్యాటింగ్.. ఎక్కడా చెదరని ఏకాగ్రత.. షార్ట్‌పిచ్ బంతులనే అస్త్రంగా ప్రయోగిస్తున్నా తొణకలేదు, బెణకలేదు. ఆఫ్‌స్టంప్‌కు ఆవలగా బంతులేసి ఊరిస్తున్నా...
ఏకంగా నాలుగు సెషన్లపైగానే బ్యాటింగ్.. ఎక్కడా చెదరని ఏకాగ్రత.. షార్ట్‌పిచ్ బంతులనే అస్త్రంగా ప్రయోగిస్తున్నా తొణకలేదు, బెణకలేదు. ఆఫ్‌స్టంప్‌కు ఆవలగా బంతులేసి ఊరిస్తున్నా.. షాట్లను నియంత్రించుకోవడంలో క్రమశిక్షణను ప్రదర్శించాడు. తొలి రోజు జట్టు ఎంతో ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలో ఓర్పు, నేర్పుతో క్రీజులో గోడకట్టిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. రెండో రోజు తన క్లాస్ ఆటకు కొంత మాస్ జోడించి తన శతకాన్ని.. అద్భుత రీతిలో ద్విశతకంగా మార్చాడు. ట్రిపుల్ సెంచరీని కొద్దిలో చేజార్చుకొన్నా.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా నయా రికార్డు సృష్టించాడు. నాయకుడన్న వాడు జట్టు కోసం ముందుండాలి.. ఈ సూత్రాన్ని చిన్నవయసులోనే ఆకళింపు చేసుకొన్న గిల్ జట్టు కోసం ఎదురు నిలిచాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో.. ఒక్కసారిగా గందగగోళం తలెత్తినా.. ప్రశాంతంగా పరిస్థితిని చక్కదిద్డాడు. కెప్టెన్‌గా మ్యాచ్‌లో తాను దూకుడుగా ఆడకపోయినా.. మరో ఎండ్‌లోని భాగస్వాములకు సహకరిస్తూ జట్టును గిల్ ఆదుకొన్న తీరు అద్భుతం.
మైండ్‌సెట్ మారిందా..: సారథ్యాన్ని చేపట్టకముందు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో గిల్ ఇబ్బందులు పడేవాడు. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం అతడి మైండ్‌సెట్‌లో ఎంతో మార్పు కనిపించింది. రాహుల్, కరుణ్ నాయర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్.. పరిణతి చెందిన ఆటతో బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. సాంకేతికంగా ఎంతో బలమైన గిల్.. చివరి వరకు బంతిని గమనిస్తూ ప్రతర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. పటిష్టస్థితికి చేరామనిపించగానే.. గేర్ మార్చాడు. బషీర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ రివర్స్ స్వీప్ షాట్ ఆడడం విశేషం. స్పిన్నర్‌కు పెద్దగా సహకారం లేకపోవడంతో బషీర్ టార్గెట్‌గా గిల్ ఎక్కువ పరుగులు రాబట్టాడు. అయితే, నియంత్రణ మాత్రం ఎక్కడా కోల్పోకపోవడం గిల్ ఆటలో ప్రత్యేకత. టంగ్ బౌలింగ్‌లో సింగిల్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకొన్న శుభ్‌మన్.. ట్రిపుల్ దిశగా వడివడిగా కదిలాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ మార్క్‌ను త్రుటిలో చేజార్చుకొన్నా.. కెప్టెన్‌గా తన ఎంపికను ప్రశ్నించిన వారికి మాత్రం తన బ్యాట్‌తోనూ సమాధానం చెప్పాడు. రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత సంధిదశలో ఉన్న టీమిండియాను నడిపించడానికి సమర్ధుడైన నాయకుడిననిపించుకొన్నాడు. లీడ్స్ టెస్టు సమయంలో రో-కో ప్రభ గిల్‌లో లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌కు.. ఈ ఇన్నింగ్స్‌తో ‘డబుల్’ స్ట్రోక్ ఇచ్చాడు.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి