గిల్ సేన సాధించేనా
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:50 AM
టెస్టుల్లో భారత్, ఇంగ్లండ్ పోరు దశాబ్దాలనాటిది. 1932 నుంచి ఇంగ్లండ్‌లో టీమిండియా పర్యటిస్తున్నా సిరీస్ గెలిచిన సందర్భం ఒక్కటే..! అంటే పర్యాటక జట్టుకు ఎంత కష్టమో రికార్డులను చూస్తేనే..
రేపటి నుంచే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
టెస్టుల్లో భారత్, ఇంగ్లండ్ పోరు దశాబ్దాలనాటిది. 1932 నుంచి ఇంగ్లండ్‌లో టీమిండియా పర్యటిస్తున్నా సిరీస్ గెలిచిన సందర్భం ఒక్కటే..! అంటే పర్యాటక జట్టుకు ఎంత కష్టమో రికార్డులను చూస్తేనే అర్థమవుతోంది. 2007లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో మూడు టెస్టుల సిరీ్‌సను భారత్ 1-0తో దక్కించుకుంది. నాటింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో జహీర్ ఖాన్ నిప్పులు చెరగగా.. సచిన్, గంగూలీ, లక్షణ్ బ్యాట్‌తో చెలరేగడంతో భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. లార్డ్స్, ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లను టీమిండియా డ్రాగా ముగించింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, కోహ్లీ, అశ్విన్, బుమ్రాలతో భారత్ మేటి జట్టుగా ఎదిగినా.. ఇంగ్లండ్‌లో మాత్రం మరో సిరీ్‌సను సొంతం చేసుకోలేక పోయింది. 2021 పర్యటనలో భారత్ 2-1తో ఆధిక్యం సాధించినా.. కరోనా కారణంగా సిరీ్‌సలో నాలుగో, ఆఖరి టెస్టును 2022కు వాయిదా వేశారు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఓడడంతో సిరీస్ 2-2తో సమమైంది.
సంధి దశలోనే..
ఈసారి పర్యటనలో యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగుతోంది. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌తో జట్టులో అనుభవలేమి కనిపిస్తోంది. అయితే, అరంగేట్రం బ్యాటర్ సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, జడేజాతో బ్యాటింగ్ బలంగానే ఉంది. పేస్ విభాగానికి బుమ్రా, సిరాజ్ ప్రధానం కాగా.. అశ్విన్ లేకపోవడంతో స్పిన్ భారం జడేజాపైనే పడనుంది. మరోవైపు ఇంగ్లండ్ పరిస్థితి కూడా టీమిండియాలాగే సంధి దశలో ఉంది. అండర్సన్, బ్రాడ్ రిటైర్మెంట్ తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ ఇది. ఓవర్టన్, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్‌తో బౌలింగ్ విభాగం కొత్తగా కనిపిస్తోంది.
ఇరు జట్ల ముఖాముఖి
మొత్తం ఆడిన టెస్టులు: 36
భారత్ గెలిచినవి: 11
ఇంగ్లండ్ నెగ్గినవి: 17
డ్రాగా ముగిసినవి: 8
బ్యాటింగ్ వికెట్ సిద్ధమా!
లీడ్స్: వేడి వాతావరణం, ఇంగ్లండ్ బజ్‌బాల్ నేపథ్యంలో శుక్రవారం నుంచి జరిగే తొలి టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది. అయితే, లీడ్స్ గ్రౌండ్ హెడ్ రిచర్డ్ రాబిన్సన్ మాత్రం మొదటి టెస్ట్‌కు చక్కని బ్యాటింగ్ వికెట్ లభించే అవకాశం ఉందని చెప్పాడు. సాధారణంగా ఈ గ్రౌండ్‌లో సిరీస్ మధ్యలో మ్యాచ్‌ను నిర్వహిస్తుంటారు. కానీ, ఈసారి తొలి మ్యాచ్‌నే ఇక్కడ షెడ్యూల్ చేయడం ఎక్కువమంది దృష్టిని ఆకర్షిస్తోంది. ‘చక్కని వికెట్ కావాలని ఇంగ్లండ్ కోరుతోంది. బంతి బ్యాట్‌మీదకు రావాలని చెప్పార’ని రాబిన్సన్ చెప్పాడు. తొలి రోజు పేసర్లకు అనుకూలించినా.. వేడి వాతావరణం కారణంగా పిచ్ ఫ్లాట్‌గా మారే అవకాశాలున్నాయన్నాడు. అంతగా అనుభవంలేని భారత బ్యాటర్లకు కూడా ఇది అనుకూలమన్నాడు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకొనే చాన్సుందన్నాడు.
ఆ ఆల్‌రౌండర్ ఎవరు?
టీమిండియా తుది జట్టు కూర్పు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్థానం కోసం నితీశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ పోటీపడుతుండడంతో..ఎవరు తుది జట్టులో ఉంటారోనన్న ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా టూర్‌కు శార్దూల్‌ను పక్కనబెట్టి నితీశ్‌కు అవకాశం ఇచ్చారు. మెల్‌బోర్న్ టెస్టులో శతకం బాదిన నితీశ్ బ్యాట్‌తో ఆకట్టుకొన్నా, బంతితో రాణించలేక పోయాడు. పరుగులను నియంత్రించ గలుగుతున్నా.. వికెట్ల విషయంలో నితీశ్ వెనకబడ్డాడు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ స్థానానికి అతడు న్యాయం చేస్తాడా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పైగా గాయం నుంచి కోలుకొన్న నితీశ్ ఫిట్‌నె్‌సపై సందేహాలున్నాయి. ఇక.. 2023 డిసెంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టు తర్వాత ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బందిపడిన శార్దూల్ ఠాకూర్ క్రమంగా కోలుకొన్నాడు. దేశవాళీల్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. పైగా ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవంతోపాటు పార్ట్‌నర్‌షిప్ బ్రేకర్‌గా ఠాకూర్‌కు పేరుంది. బ్యాట్‌తోనూ ఆకట్టుకొంటున్న అతడు ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు.

నేనైతే అతడే అంటాను: రవిశాస్త్రి
పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్థానం కోసం నితీశ్, శార్దూల్‌లలో ఎవర్ని ఎంపిక చేయాలన్న అంశంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. తానైతే ఠాకూర్‌వైపే మొగ్గుచూపుతానని శాస్త్రి అన్నాడు. ‘నేనైతే ముగ్గురు పేసర్లు, శార్దూల్‌తో ఆడతా. నితీశ్, ఠాకూర్ మధ్య ఒకరిని ఎంపిక చేయడం కష్టమే. కానీ, ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఎవరికి ఉందనేది ముఖ్యం. నితీశ్ 12-14 ఓవర్లు వేయగలిగితే అతడికే నా మద్దతు. ఎందుకంటే అతడు కూడా బ్యాటింగ్ చేయగలడ’ని రవి చెప్పాడు. బుమ్రా, సిరాజ్‌తోపాటు ప్రసిద్ధ్ కృష్ణను మూడో పేసర్‌గా ఎంపిక చేయాలన్నాడు.
ఇవీ చదవండి:
నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..
18 నంబర్ జెర్సీ.. సిరీస్‌లో ఇదే హైలైట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి