గిల్.. జిగేల్
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:44 AM
క్లాస్ ఆటతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (216 బంతుల్లో 12 ఫోర్లతో 114 బ్యాటింగ్) వరుసగా రెండో శతకంతో మెరవగా.. యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్లతో 87) శుభారంభం అందించడంతో...
వరుసగా రెండో శతకం
రాణించిన జైస్వాల్
భారత్ తొలి ఇన్నింగ్స్ 310/5
ఫ ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్
బర్మింగ్‌హామ్: క్లాస్ ఆటతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (216 బంతుల్లో 12 ఫోర్లతో 114 బ్యాటింగ్) వరుసగా రెండో శతకంతో మెరవగా.. యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్లతో 87) శుభారంభం అందించడంతో.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ తొలి రోజును భారత్ మెరుగ్గా ముగించింది. బుధవారం ఆరంభమైన టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 310/5 స్కోరు చేసింది. మొదటి రోజు ఆట చివరకు గిల్‌తోపాటు జడేజా (41 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నాడు. కరుణ్ నాయర్ (31) మరోసారి విఫలమయ్యాడు. క్రిస్ వోక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులు చేసింది. బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్‌పై వేటు వేశారు. వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్‌తోపాటు పేసర్ ఆకాశ్‌దీ్‌పకు తుది జట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు వేన్ లార్కిన్స్ మృతికి సంతాపంగా నల్లరిబ్బన్లు ధరించారు.
చెలరేగిన జైస్వాల్..: ఇంగ్లండ్ బౌలర్లు జైస్వాల్‌ను తీవ్రంగా పరీక్షించినా.. అతడు మాత్రం ఓపిగ్గా క్రీజులో నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జైస్వాల్‌ను దాదాపుగా వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. కానీ, రివ్యూలో అంపైర్ కాల్ కావడంతో జైస్వాల్ ఊపిరిపీల్చుకొన్నాడు. కానీ, మరో ఓపెనర్ రాహుల్ (2) దారుణంగా విఫలమయ్యాడు. 26 బంతులాడిన రాహుల్.. వోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన కరుణ్ నాయర్.. జైస్వాల్‌కు సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. క్రమంగా గేరు మార్చిన జైస్వాల్ బౌండ్రీతో ఫిఫ్టీ మార్క్‌కు చేరుకొన్నాడు. కానీ, లంచ్‌కు ముందు నాయర్‌ను షార్ట్‌పిచ్ బాల్‌తో అవుట్ చేసిన కార్స్.. జట్టుకు కావల్సిన బ్రేక్‌ను అందించాడు. దీంతో తొలి సెషన్‌లో భారత్ 98/2తో నిలిచింది.
దెబ్బకొట్టిన స్టోక్స్..: రెండో సెషన్‌లో కీలక జైస్వాల్‌ను అవుట్ చేసిన ఇంగ్లండ్ దెబ్బకొట్టినా.. గిల్, పంత్ మరిన్ని వికెట్లు చేజార్చకుండా కాచుకొన్నారు. ఆరంభంలో జైస్వాల్, కెప్టెన్ గిల్.. ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఎక్కువగా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించారు. 34వ ఓవర్‌లో ఎల్బీ అప్పీలు నుంచి గిల్ తప్పించుకొన్నాడు. అయితే, మరోసారి బౌలింగ్‌కు దిగిన స్టోక్స్ జట్టుకు కావల్సిన బ్రేక్‌ను అందించాడు. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వేసిన షార్ట్‌బాల్‌ను గట్టిగా బాదే ప్రయత్నంలో జైస్వాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొంది. దీంతో మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (25).. బషీర్‌పై విరుచుపడే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ తర్వాత కొంత నిగ్రహం చూపించిన పంత్.. గిల్‌తో కలసి ఆచితూచి ఆడుతూ వికెట్లు చేజారకుండా చూడడంతో.. భారత్ 182/3తో టీకి వెళ్లింది.
ఒక్క సెషన్‌లోనే 128/2..: పంత్, నితీశ్ కుమార్ (1)ను వెంట వెంటనే కోల్పోయినా.. గిల్, జడేజా జోరుతో ఒక్క మూడో సెషన్‌లోనే భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ ఒక్క సెషన్‌లోనే ఏకంగా 128 పరుగులు జోడించడం విశేషం. తిరిగి వచ్చిన తర్వాత రెండు బౌండ్రీలు బాదిన గిల్ తనదైన శైలిలో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా.. పంత్ ఫోర్‌తో జట్టు స్కోరును 200 మార్క్ దాటించాడు. కానీ, బషీర్‌పై ఎదురుదాడి చేసే ప్రయత్నంలో పంత్ క్యాచవుట్ కావడంతో.. నాలుగో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్‌ను వోక్స్ బౌల్డ్ చేయడంతో 211/5తో భారత్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా జాగ్రత్తగా ఆడుతూ గిల్‌కు అండగా నిలిచాడు. ఈ క్రమంలో గిల్ బౌండ్రీతో సెంచరీ మార్క్‌ను అందుకొన్నాడు. అనంతరం బ్యాట్‌కు పనిచెప్పడంతో భారత్ స్కోరు 300 దాటింది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87, రాహుల్ (బి) వోక్స్ 2, కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31, గిల్ (బ్యాటింగ్) 114, పంత్ (సి) క్రాలే (బి) బషీర్ 25, నితీశ్ (బి) వోక్స్ 1, జడేజా (బ్యాటింగ్) 41; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 85 ఓవర్లలో 310/5; వికెట్ల పతనం: 1-15, 2-95, 3-161, 4-208, 5-211; బౌలింగ్: వోక్స్ 21-6-59-2, కార్స్ 16-2-49-1, టంగ్ 13-0-66-0, స్టోక్స్ 15-0-58-1, బషీర్ 19-0-65-1, రూట్ 1-0-8-0.
1
ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఓపెనర్‌గా జైస్వాల్ (87). 1974లో సుధీర్ నాయక్ (77) చేసిన స్కోరును జైస్వాల్ అధిగమించాడు. సునీల్ గవాస్కర్ (68), చటేశ్వర్ పుజార (66) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
4
కెప్టెన్‌గా ఆడిన తొలి రెండు టెస్టుల్లోనే వరుసగా శతకాలు బాదిన నాలుగో భారత సారథిగా గిల్. విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ ముందున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి