అదే నా కర్తవ్యం
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:09 AM
జట్టులో ఆనందకరమైన, ఏ మాత్రం అభద్రతకు తావులేని వాతావరణాన్ని నెలకొల్పుతానని టీమిండియా కొత్త సారథి శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. అతడి ఆధ్వర్యంలో తొలిసారిగా ఇంగ్లండ్ పర్యటనకు...
జట్టును సమష్టిగా ఉంచుతా
టీమిండియా కెప్టెన్ గిల్
లండన్: జట్టులో ఆనందకరమైన, ఏ మాత్రం అభద్రతకు తావులేని వాతావరణాన్ని నెలకొల్పుతానని టీమిండియా కొత్త సారథి శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. అతడి ఆధ్వర్యంలో తొలిసారిగా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన భారత జట్టు ఈనెల 20 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఈ సందర్భంగా ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ పలు అంశాలపై మాట్లాడాడు. ‘జట్టుకు విజయాలు, ట్రోఫీలు అందించడమే కాకుండా ఆటగాళ్లంతా సౌకర్యవంతంగా, సంతోషంగా ఉండే సంస్కృతిని నెలకొల్పుతా. అలా అయితేనే ఒత్తిడికి లోనుకాకుండా ఆటగాడిలో నైపుణ్యం బయటపడుతుంది. నాయకుడిగా నా కర్తవ్యం కూడా అదేనని భావిస్తా. ఆరంభంలో ఇది కష్టమే కావచ్చు. కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదు. ఇక మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ... అతను మైదానంలో దూకుడుగా కనిపించకపోవచ్చు. కానీ అతని వ్యూహరచన మాత్రం దూకుడుగానే ఉంటుంది. ఆటగాళ్ల నుంచి తానేం ఆశిస్తున్నాడో సిరీ్‌సకు ముందే స్పష్టంగా చెప్పేవాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ చక్కటి వాతావరణాన్ని నెలకొల్పాడు. మైదానంలో అతడి చేత చీవాట్లు తిన్నా దాన్ని ఎవరూ వ్యక్తిగతంగా తీసుకునేవారు కాదు. జట్టు విజయం కోసమే అలా చేస్తున్నాడని అంతా భావించేవారు’ అని గిల్ తెలిపాడు. కాగా కోచ్ గౌతమ్ గంభీర్‌లో అంకితభావం ఎక్కువని, ఆటగాళ్లతో చాలా స్పష్టంగా ఉంటాడని అన్నాడు. ఇక స్టార్ పేసర్ బుమ్రాపై అధిక భారం పడకూడదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు గిల్ తెలిపాడు. సిరీ్‌సలో అన్ని మ్యాచ్‌లను తను ఆడే అవకాశం లేదని ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం తెలిపాడు. ‘ప్రతీ మ్యాచ్ తర్వాత అతడిపై పడే పని ఒత్తిడి భారాన్ని పరిశీలిస్తాం. అంతేకానీ ముందే ఫలానా మ్యాచ్ ఆడతాడనే నిర్ణయాన్ని తీసుకోలేం’ అని గిల్ తేల్చాడు. మరోవైపు ఇంగ్లండ్ బజ్‌బాల్ గేమ్‌ను ఎదుర్కొనేందుకు తాము ఎలాంటి ప్రణాళికలను రచించలేదని చెప్పాడు. ‘నేను ఎలా ఉండాలనుకుంటున్నానో ముందస్తుగా ఆలోచించడం ఇష్టముండదు. దూకుడుగా ఆడితే అంతే వేగంగా వికెట్లు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది’ అని కెప్టెన్ గిల్ తెలిపాడు.

గంభీర్ బాధ్యతలు లక్ష్మణ్‌కు!
బెకెన్‌హామ్ (కెంట్): ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు భారత జట్టు సన్నాహకం ఊపందుకుంది. ఈనెల 20 నుంచి జరిగే మొదటి టెస్ట్‌కు.. నాలుగు రోజుల ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌ను భారత్ ఆడుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆదివారం, మూడోరోజు కూడా జోరుగా సాగింది. మొదటి టెస్ట్‌కు ఆల్‌రౌండర్ స్థానానికి తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్‌తో పోటీపడుతున్న శార్దూల్ ఠాకూర్ మూడోరోజు ఆటలో శతకం బాదాడు. మొదటి రోజు బౌలింగ్‌లో ఆకట్టుకున్న శార్దూల్..బ్యాట్‌తోనూ సత్తా నిరూపించుకోవడం విశేషం. 2023లో చివరి టెస్ట్ ఆడిన ఠాకూర్ రెండోరోజు 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్‌ను కొనసాగించి అజేయ సెంచరీ(122 నాటౌట్)తో మెరిశాడు. తద్వారా తొలి టెస్ట్‌కు తుది జట్టు రేస్‌లో బలంగా నిలిచాడు. కాగా..శనివారం ఆటలో భారత్ ‘ఎ’ బ్యాటర్ సర్ఫ్‌రాజ్ శతకంతో చెలరేగాడు. ఇక..చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తల్లి అనారోగ్యం కారణంగా స్వదేశం వెళ్లిన గంభీర్ తిరిగొచ్చేవరకు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు తెలిసింది.
ఇవీ చదవండి:
వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి