Share News

Indian Cricket Team: సంజూకు చోటు లేనట్టేనా

ABN , Publish Date - Sep 08 , 2025 | 05:16 AM

ఆసియా కప్‌ టోర్నీకి టీమిండియా సన్నాహకాలు ఊపందుకున్నాయి. మంగళవారం నుంచి ఈ టీ20 టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. బుధవారంనాడు గ్రూప్‌ ఎ లో తొలి మ్యాచ్‌ను యూఏఈతో ఆడడం ద్వారా భారత జట్టు...

Indian Cricket Team: సంజూకు చోటు లేనట్టేనా

  • బ్యాటింగ్‌ ఆర్డర్‌’లో టీమిండియా ప్రాక్టీస్‌

దుబాయ్‌: ఆసియా కప్‌ టోర్నీకి టీమిండియా సన్నాహకాలు ఊపందుకున్నాయి. మంగళవారం నుంచి ఈ టీ20 టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. బుధవారంనాడు గ్రూప్‌ ‘ఎ’లో తొలి మ్యాచ్‌ను యూఏఈతో ఆడడం ద్వారా భారత జట్టు టోర్నీని మొదలుపెడుతుంది. ఇక..టోర్నమెంట్‌ బ్లాక్‌బస్టర్‌ పోరులో పాకిస్థాన్‌తో ఈనెల 14న భారత్‌ తలపడనుంది. అయితే టీమిండియా తుది కూర్పునకు సంబంధించి ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సంజూ శాంసన్‌కు జట్టులో చోటు ఉంటుందా..ఉండదా..అనే విషయమై ఉత్కంఠ ఏర్పడింది. భారత జట్టు ఇప్పటికే రెండు సెషన్ల ప్రాక్టీస్‌ పూర్తి చేసింది. ఈ రెండు సెషన్లు జరిగిన తీరునుబట్టి చూస్తే సంజూకి తుది 11 మందిలో స్థానం కష్టమేనని తెలుస్తోంది. సాధనలో భాగంగా సూర్యకుమార్‌ సేన మొదట ఫీల్డింగ్‌ డ్రిల్స్‌లో పాల్గొంది. అనంతరం బ్యాటర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇక..నెట్స్‌లో జితేశ్‌ శర్మకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం కనిపించింది. ప్రధాన బ్యాటర్లతో కలిసి అతడు ప్రాక్టీస్‌ చేశాడు. మరోవైపు శాంసన్‌ బ్యాటింగ్‌ నెట్స్‌కు ఆఖర్లో వచ్చాడు. సంజూకంటే ముందు అభిషేక్‌ శర్మ, గిల్‌, తిలక్‌ వర్మ సాధనలో పాల్గొన్నారు. ఈ ముగ్గురి తర్వాత సూర్యకుమార్‌, రింకూ సింగ్‌, జితేశ్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. బుమ్రా, అర్ష్‌దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌, శివమ్‌ దూబే, హార్దిక్‌ల బౌలింగ్‌లో బ్యాటర్లంతా ముమ్మర సాధన చేశారు. ఈ ఆర్డర్‌లో బ్యాటర్లు ప్రాక్టీస్‌ చేయడాన్ని చూస్తే సంజూకు తుది 11 మంది స్థానం లేనట్టేననేది విశ్లేషకుల అంచనా. అసలు గిల్‌కు ఆసియా కప్‌ జట్టులో చోటు కల్పించడంతోనే సంజూకు దారులు మూసుకుపోయాయనే వ్యాఖ్యలు వినిపించాయి. మరోవైపు స్థానిక బౌలర్ల బౌలింగ్‌లో సంజూ నెట్‌ ప్రాక్టీస్‌ చేయడం గమనార్హం.

Updated Date - Sep 08 , 2025 | 05:17 AM