Share News

Tennis Championship: సబలెంక కేక

ABN , Publish Date - Sep 08 , 2025 | 05:26 AM

డిఫెండింగ్‌ చాంప్‌ అరియానా సబలెంక యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను నిలబెట్టుకొంది. ఈ క్రమంలో సెరెనా విలియమ్స్‌ (2012-14) తర్వాత ఇక్కడ వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

Tennis Championship: సబలెంక కేక

  • వరుసగా రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ కైవసం

  • ఫైనల్లో అమందాకు మరోసారి నిరాశ

ఈ ఏడాది రెండు గాండ్‌స్లామ్స్‌ ఫైనల్స్‌లో రన్నరప్‌కే పరిమితమైనా, పట్టు వదలని అరియానా సబలెంక.. మూడో ప్రయత్నంలో ఫలితాన్ని రాబట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నిలబెట్టుకొని రికార్డు సృష్టించింది. తుదిపోరులో అమెరికా స్టార్‌, ఎనిమిదో సీడ్‌ అమందా అనిసిమోవాను చిత్తు చేసిన సబలెంక.. కెరీర్‌లో రెండో యూఎస్‌ ఓపెన్‌, ఓవరాల్‌గా నాలుగో గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకొంది.

న్యూయార్క్‌: డిఫెండింగ్‌ చాంప్‌ అరియానా సబలెంక యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను నిలబెట్టుకొంది. ఈ క్రమంలో సెరెనా విలియమ్స్‌ (2012-14) తర్వాత ఇక్కడ వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సబలెంక (బెలారస్‌) 6-3, 7-6(3)తో స్థానిక స్టార్‌ అమందా అనిసిమోవాపై వరుస సెట్లలో నెగ్గింది. గంటా 34 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అనిసిమోవా 22 విన్నర్లు కొడితే.. సబలెంక 13 మాత్రమే సంధించింది. అమందా 4 ఏస్‌లతో బెంబేలెత్తించగా, సబలెంక ఒక్క ఏస్‌కే పరిమితమైంది. అయితే, 22 అనవసర తప్పిదాలు చేసి అమందా మూల్యం చెల్లించుకొంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో ఓడిన సబలెంక.. యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌తో సీజన్‌ను గ్రాండ్‌గా ముగించింది. 27 ఏళ్ల సబలెంకకు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 2023, 24లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచింది. కాగా, గ్రాండ్‌స్లామ్‌ తుదిపోరులో ఓడడం అమందాకు ఇది వరుసగా రెండోసారి. యూఎస్‌ ఓపెన్‌కు ముందు వింబుల్డన్‌ ఫైనల్లో స్వియటెక్‌ చేతిలో అమందా పరాజయం పాలైంది.


తడబడినా.. పుంజుకొని:

ఫైనల్‌ పోరు ఒత్తిడో.. ఏమో? మ్యాచ్‌ ఆరంభంలో ఇద్దరూ తప్పిదాల మీద తప్పిదాలు చేశారు. ఎక్కువగా అవుట్‌లు కొట్టడంతోపాటు ఒకరి సర్వీస్‌ను ఒకరు బ్రేక్‌ చేసే అవకాశం ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో సబలెంక పలుసార్లు అసహనానికి గురైనా క్రమంగా గాడిలో పడింది. తొలి సెట్‌ మొదటి గేమ్‌లోనే అరియానా డబుల్‌ ఫాల్ట్‌ చేసింది. కానీ, అనిసిమోవా దాన్ని అందిపుచ్చుకోలేక పోయింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సబలెంక 2-0తో ముందంజ వేసింది. కానీ, పుంజుకొన్న అనిసిమోవా వరుసగా రెండు గేమ్‌లు గెలిచి 2-2తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకొంటూ సాగినా.. ఎనిమిదో గేమ్‌లో అమందా సర్వీస్‌ను మరోసారి బ్రేక్‌ చేసిన సబలెంక సెట్‌ను తన ఖాతాలో వేసుకొంది. ఇక, రెండో సెట్‌లో ఒక దశలో సబలెంక 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ, పట్టువీడని అనిసిమోవా 3-3తో సమం చేసింది. ఏడో గేమ్‌లో మరోసారి బ్రేక్‌ పాయింట్‌ సాధించిన అరియానా 5-3తో మ్యాచ్‌ను సులువుగా సొంతం చేసుకొనేలా కనిపించింది. అయితే, పోరాడిన అనిసిమోవా ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేస్తూ 5-5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో 6-6తో సెట్‌ ఫలితం టైబ్రేక్‌కు మళ్లింది. ఇందులో సబలెంక అనుభవం ముందు అనిసిమోవా తలవంచక తప్పలేదు. 6-3తో మ్యాచ్‌పాయింట్‌పై నిలిచిన అరియానా.. అమందా బ్యాక్‌ హ్యాండ్‌ తప్పిదంతో సంబరాలు చేసుకొంది. పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను మార్సెలో గ్రానోల్లర్స్‌ (స్పెయిన్‌)/హొరాకియో జెబల్లోస్‌ (అర్జెంటీనా) జోడీ గెలుచుకుంది. ఫైనల్లో ఐదో సీడ్‌ మార్సెలో ద్వయం 3-6, 7-6 (4), 7-5తో బ్రిటన్‌కు చెందిన ఆరో సీడ్‌ జంట నీల్‌ స్కుప్‌స్కీ/జో సాలిస్‌బరీపై గెలిచింది.

Updated Date - Sep 08 , 2025 | 05:29 AM