Share News

India cricket: మరో కప్‌నకు రో కో సై

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:13 AM

రాబోయే వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆడతారా..లేదా అనే విషయమై కొనసాగుతున్న సందిగ్ధానికి దాదాపు తెరపడినట్టే. ఇప్పటికే టీ20లు...

India cricket: మరో కప్‌నకు రో కో సై

రాబోయే వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆడతారా..లేదా అనే విషయమై కొనసాగుతున్న సందిగ్ధానికి దాదాపు తెరపడినట్టే. ఇప్పటికే టీ20లు, టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన రో-కో 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో ఆడే విషయమై ఎంతో కాలంగా పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. పైగా గౌతమ్‌ గంభీర్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తదుపరి వన్డే వరల్డ్‌ కప్‌నకు యువ జట్టును రూపొందించే ప్రయత్నంలో ఉన్నారని, ఈ క్రమంలో రో-కో ద్వయం కెరీర్‌ ఇక ముగిసినట్టేనని విస్తృతంగా చర్చలు జరిగాయి. కానీ దక్షిణాఫ్రికాతో వైట్‌వాష్‌ దెబ్బకు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడు గౌతీ, అగార్కర్‌ల పదవులకే ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో రోహిత్‌, విరాట్‌ స్థానాలపై కఠిన నిర్ణయం తీసుకొనే అవకాశాల్లేవని అంటున్నారు. పైగా..ఆస్ట్రేలియాలో జరిగిన గత వన్డే సిరీస్‌లో రో-కో ద్వయం సత్తా చాటింది. దక్షిణాఫ్రికాతో ఆడే వన్డే సిరీ్‌సతోపాటు.. వన్డే వరల్డ్‌ కప్‌ వరకూ జరగబోయే సిరీ్‌సల వరకూ ఫిట్‌నెస్‌ కాపాడుకోవడంతోపాటు మంచి స్కోర్లు చేయగలిగితే మెగా టోర్నమెంట్‌లో రోహిత్‌, కోహ్లీలను తప్పక చూడగలుగుతాం.

అగార్కర్‌పైనా అసంతృప్తి?

గంభీర్‌, అగార్కర్‌ల హయాంలో టెస్ట్‌ల్లో భారత జట్టు నిలకడ ప్రశ్నార్థకమైంది. జట్టు ఎంపికలో వీరిద్దరు అనుసరిస్తున్న విధానాలను మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఇంకా.. రంజీట్రోఫీ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించకపోవడంపై అగార్కర్‌ను తప్పుబడుతున్నారు. భారత జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లను చూడడంతో బిజీగా ఉండే అగార్కర్‌కు దేశవాళీ పోటీలకు హాజరయ్యే తీరిక లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అలాంటి అగార్కర్‌..అంతర్జాతీయ పోటీలు లేనప్పుడు రంజీట్రోఫీలో ఆడాలని జాతీయ జట్టు క్రికెటర్లను ఆదేశించే హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సఫారీల చేతిలో ఘోర పరాభవం తర్వాత విమర్శల దాడి పెరగడంతో..సెలెక్టర్లతో మాట్లాడాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారని సమాచారం.


బీసీసీఐ గరం..గరం

దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్ట్‌ పిచ్‌పై గంభీర్‌ ప్రశంసల వర్షం కురిపించడం బీసీసీఐ పెద్దలను ఆగ్రహానికి గురిచేసిందని సమాచారం. ఈడెన్‌గార్డెన్స్‌ నల్లమట్టి వికెట్‌పై క్రికెట్‌ పండితులు కూడా పెదవి విరిచారు. ఈ తరుణంలో పిచ్‌పై గంభీర్‌ వ్యాఖ్యలు బీసీసీఐకి కూడా రుచించలేదట. విపరీతంగా టర్న్‌ అయిన వికెట్‌పై భారత జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే కుప్పకూలింది.

టీ20 ప్రపంచ కప్‌ తర్వాత..?

పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న కోచ్‌ గంభీర్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అయితే వారిద్దరి పదవులకు ప్రస్తుతానికి ఢోకా లేదని తెలిసింది. వచ్చే ఫిబ్రవరి-మార్చి నెలల్లో టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. అందులో టీమిండియా కనబరచే ప్రదర్శనను బట్టి అగార్కర్‌, గంభీర్‌ల భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.

4.jpg

Updated Date - Nov 29 , 2025 | 03:13 AM