Rohit and Kohli Back in Focus: ఆ ఇద్దరిపైనే
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:25 AM
Rohit and Kohli Back in Focus as India Take on South Africa in Ranchi ODI Series
మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
రోహిత్, కోహ్లీపై దృష్టి
వరల్డ్‌కప్ బెర్త్ ఆశిస్తున్న ద్వయం
నేటి నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్
కోచ్ గంభీర్‌కూ కీలకమే
గెలుపే ధ్యేయంగా టీమిండియా
రాంచీ: దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ పరాభవం తర్వాత భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీ్‌సపై దృష్టి సారించింది. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరుగనున్నాయి. చాలా రోజుల తర్వాత వెటరన్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్వదేశంలో భారత్ తరఫున ఆడనుండడంతో ఈ సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే రానున్న రెండు నెలల్లో భారత జట్టు కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడనుంది. దీంతో 2027 వరల్డ్‌క్‌పలో చోటు దక్కించుకోవాలనుకుంటున్న ఈ ఇద్దరికీ ఇందులో రాణించడం కీలకంగా మారింది. ఒకవేళ అంచనాలను అందుకోలేకపోతే మెగా టోర్నీలో వారికి చోటు దక్కడం క్లిష్టంగా మారుతుంది. అయితే 2013లో రోహిత్ ఇదే రాంచీ మైదానంలో తొలిసారి ఓపెనర్‌గా అవతారమెత్తి జట్టు ఆటతీరునే మార్చేశాడు. ఆసీస్ పర్యటనలో ఫర్వాలేదనిపించిన రో-కో సొంతగడ్డపైనా అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అటు టెస్టు సిరీ్‌సను 0-2తో కోల్పోవడంతో కోచ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సిరీ్‌సను గెలవడం అతడికి కూడా అత్యంత ఆవశ్యకంగా మారింది. దీనికి తోడు ఆసీస్ పర్యటనలో 1-2తో భారత్ వన్డే సిరీస్ ఓడిన విషయం తెలిసిందే. పాతికేళ్ల తర్వాత ఇక్కడ టెస్టు సిరీ్‌సను గెలిచిన ఆనందంలో ఉన్న సఫారీలు ఆత్మవిశ్వాసంతో వన్డే బరిలోకి దిగనున్నారు.
కీలక ఆటగాళ్లు లేకుండానే..
గాయాలతో కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్... విశ్రాంతి పేరుతో పేసర్ బుమ్రా, సిరాజ్ ఈ సిరీ్‌సకు దూరమయ్యారు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తుండగా.. బౌలింగ్‌లోనూ ప్రధాన పేసర్లు లేకపోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు అనుకూలించే వీలుంది. అలాగే జట్టు కూర్పు కూడా సమస్యగా మారింది. ఓపెనర్‌గా గిల్ స్థానంలో రుతురాజ్, జైస్వాల్ మధ్య పోటీ నెలకొంది. ఇక శ్రేయాస్ స్థానంలో ఎవరు బరిలోకి దిగనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతడి స్థానంలో రుతురాజ్‌ను ఆడిస్తే పంత్ స్థానం చేజారినట్టే. అప్పుడు కెప్టెన్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాడు. తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ సైతం బెర్త్ ఆశిస్తున్నప్పటికీ వీళ్లు రిజర్వ్ బెంచీకే పరిమితం కావచ్చు. జడేజాకు తోడుగా స్పిన్‌లో కుల్దీ్‌పను కాకుండా మరో ఆల్‌రౌండర్ సుందర్ వైపు కోచ్ మొగ్గు చూపవచ్చు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నితీశ్‌ను కూడా బరిలోకి దింపే అవకాశం ఉంది. అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ పేస్ బాధ్యతలు తీసుకోనున్నారు.
ఆత్మవిశ్వాసంతో సఫారీలు
భారత్‌లో కీలక ఆటగాళ్లు లేకపోగా.. దక్షిణాఫ్రికా మాత్రం పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగబోతోంది. దీనికి తోడు సిరీస్ క్లీన్‌స్వీ్‌పతో బవుమా సేన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఓపెనర్‌గా మార్‌క్రమ్‌కు జతగా అనుభవజ్ఞుడు డికాక్ జట్టులో చేరాడు. మిడిలార్డర్‌లో హిట్టర్లు బ్రీట్‌స్కే, బ్రెవి్‌సతో పటిష్టంగా కనిపిస్తోంది. ప్రధాన పేసర్లు రబాడ, నోకియా దూరమైనా.. యాన్సెన్, కొట్జీ, బర్గర్, ఎన్‌గిడి భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
పిచ్ వాతావరణం
రాంచీలో మూడేళ్ల క్రితం జరిగిన చివరి వన్డేలోనూ భారత్-దక్షిణాఫ్రికాలే తలపడ్డాయి. ఓవరాల్‌గా ఇక్కడ ఆడిన ఆరు వన్డేల్లో ఒక్కసారి మాత్రమే 300+ స్కోరు నమోదు కాగా, పిచ్ స్పిన్‌కు అనుకూలించనుంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, జైస్వాల్, విరాట్, రుతురాజ్/పంత్, సుందర్, రాహుల్ (కెప్టెన్), జడేజా, నితీశ్, హర్షిత్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్, డికాక్, బవుమా (కెప్టెన్), బ్రీట్‌స్కే, బ్రెవిస్, హెర్మన్, యాన్సెన్, బాష్, కేశవ్, బర్గర్, ఎన్‌గిడి.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?