Share News

Mannepalli Tarun: నవతరం రాకెట్లు

ABN , Publish Date - Aug 16 , 2025 | 04:44 AM

మన్నేపల్లి తరుణ్‌ చౌదరి.. ఖమ్మం జిల్లాకు చెందిన 23 ఏళ్ల ఈ కుర్రాడు ఇటీవల మకావు ఓపెన్‌లో టాప్‌సీడ్‌, ప్రపంచ 13వ ర్యాంకర్‌ లీ చెయుక్‌ యియు (హాంకాంగ్‌)ను ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

Mannepalli Tarun: నవతరం రాకెట్లు

పారుపల్లి కశ్యప్‌, కిడాంబి శ్రీకాంత్‌, పీవీ సింధు తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌ యవనికపై తెలుగు షట్లర్ల జోరు కొంతమేర తగ్గింది. నవతరం ఆటగాళ్ల రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆకాంక్షల్ని నిజం చేస్తూ మన్నేపల్లి తరుణ్‌, కలగొట్ల వెన్నెల ఇప్పుడు తెరపైకొచ్చారు. వీరు జాతీయ పోటీల్లోనే కాకుండా

అంతర్జాతీయ టోర్నీల్లోనూ తమ ఉనికిని బలంగా చాటే దిశగా దూసుకెళ్తున్నారు.

మన్నేపల్లి తరుణ్‌ చౌదరి.. ఖమ్మం జిల్లాకు చెందిన 23 ఏళ్ల ఈ కుర్రాడు ఇటీవల మకావు ఓపెన్‌లో టాప్‌సీడ్‌, ప్రపంచ 13వ ర్యాంకర్‌ లీ చెయుక్‌ యియు (హాంకాంగ్‌)ను ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కబడ్డీ క్రీడాకారుడైన తాతయ్య రంగారావు ప్రోత్సాహంతో ఎనిమిదేళ్ల ప్రాయంలో తరుణ్‌ రాకెట్‌ పట్టుకున్నాడు. సుధాకర్‌ రెడ్డి శిక్షణలో బ్యాడ్మింటన్‌ ఓనమాలు నేర్చుకున్న తరుణ్‌ రెండేళ్లు తిరిగేసరికి జిల్లా స్థాయిలో సింగిల్స్‌లో రన్నరప్‌, డబుల్స్‌లో విజేతగా నిలిచాడు. అక్కడ నుంచి అతను వెనుదిరిగి చూడలేదు. మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌కు మకాం మార్చిన తరుణ్‌ కొద్ది రోజులు శాట్‌ కోచ్‌ ఫణి కిశోర్‌ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో చేరి మరింత రాటు దేలాడు.


ఆర్థిక అండ అవసరం..

మూడేళ్ల క్రితం వరకు స్పాన్సరర్లు లేకపోవడంతో తరుణ్‌ ఎక్కువ అంతర్జాతీయ టోర్నీలు ఆడలేకపోయాడు. ఇది అతడి అంతర్జాతీయ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. నాన్న సతీష్‌ కష్టంపైనే ఆధారపడాల్సి వచ్చిందని తరుణ్‌ తెలిపాడు. ప్రస్తుతం గోపీసార్‌, పలు సంస్థల సహకారంతో కొన్ని స్పాన్సర్‌షి్‌పలు దక్కాయన్నాడు. కానీ, తనలాంటి వర్ధమాన ఆటగాళ్లకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే కచ్చితంగా ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానని తరుణ్‌ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.

ఇక్కడ చేరాక..: గోపీచంద్‌ అకాడమీలోని అధునాతన సదుపాయాలు, క్రమశిక్షణతో కూడిన శిక్షణ.. అన్నింటికీ మించి కోచ్‌లు గోపీ, గురుసాయిదత్‌, పారుపల్లి కశ్య్‌పల ప్రోత్సాహంతో తరుణ్‌ కెరీర్‌ మలుపు తిరిగింది. 2020 నుంచి గోపీచంద్‌ అకాడమీలో సాధన చేస్తున్న తరుణ్‌ ఈ నాలుగేళ్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టు తనను తాను మల్చుకున్నాడు. గత ఏడాది పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నెంబర్‌ వన్‌గా ఎదిగిన తరుణ్‌ ప్రస్తుతం వరల్డ్‌ టాప్‌-40లో స్థానం సంపాదించాడు.


రైజింగ్‌ స్టార్‌

31.jpg

కలగొట్ల వెన్నెల.. సికింద్రాబాద్‌కు చెందిన ఈ రైజింగ్‌ స్టార్‌ఇటీవలే ఇండోనేసియా వేదికగా జరిగిన ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యం సాధించింది. దీంతో 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో భారత్‌కు పతకం అందించి రికార్డు సృష్టించింది. అంతేకాదు, పీవీ సింధు తర్వాత ఈ పతకం కైవసం చేసుకున్న భారత మహిళా షట్లర్‌గానూ ఘనత వహించింది. 5 అడుగుల 8 అంగుళాలున్న వెన్నెల గత మూడేళ్లుగా జాతీయ స్థాయిలో అదరగొడుతోంది. వచ్చే నెలలో జరిగే వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షి్‌పనకు కూడా అర్హత సాధించింది. బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడైన నాన్న శ్రీనివా్‌సరెడ్డి ప్రేరణతో బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా మలుచుకున్న 17 ఏళ్ల వెన్నెల.. క్రీడల్లో తండ్రి చేరలేకపోయిన ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అడుగులు వేస్తోంది. ఎనిమిదేళ్ల ప్రాయంలో కోచ్‌ గోవర్దన్‌ వద్ద బ్యాడ్మింటన్‌లో ఓనమాలు నేర్చుకున్న వెన్నెల.. 2019 నుంచి గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. కెరీర్‌ ప్రారంభంలో డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడిన వెన్నెల ఇప్పుడు సింగిల్స్‌పైనే పూర్తిగా దృష్టి సారించింది. పటిష్టమైన డిఫెన్స్‌, బలమైన స్మాష్‌లు, బ్యాక్‌హ్యాండ్‌ షాట్స్‌తో కోర్టులో వెన్నెల చిరుతలా కదలాడుతుంది. గత నెలలో జరిగిన ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నీ సింగిల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన వెన్నెల, జూనియర్‌ విభాగం సింగిల్స్‌లో రన్నరప్‌, డబుల్స్‌లో టైటిల్‌ కైవసం చేసుకుంది. ప్రస్తుతం జూనియర్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 33వ స్థానంలో ఉన్న ఈ యువ షట్లర్‌.. భవిష్యత్‌లో పెద్ద టోర్నమెంట్లలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

Updated Date - Aug 16 , 2025 | 04:44 AM