పరాగ్ భయపెట్టినా.. గట్టెక్కిన కోల్‌కతా
ABN , Publish Date - May 05 , 2025 | 04:50 AM
ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ గట్టెక్కింది. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో...
రస్సెల్ మెరుపులు
పోరాడి ఓడిన రాజస్థాన్
కోల్‌కతా: ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ గట్టెక్కింది. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రీ రస్సెల్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 57 నాటౌట్), రఘువంశీ (44), రహ్మనుల్లా గుర్బాజ్ (35), కెప్టెన్ అజింక్యా రహానె (30) రాణించారు. ఛేదనలో ఓవర్లన్నీ ఆడి 205/8 స్కోరు చేసిన రాజస్థాన్ విజయానికి పరుగు దూరంలో నిలిచిపోయింది. సారథి రియాన్ పరాగ్ (45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95), యశస్వీ జైస్వాల్ (34), హెట్‌మయర్ (29) పోరాటం సరిపోలేదు. హర్షిత్, వరుణ్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఆశలు రేపి..: ఛేదనలో రాజస్థాన్ 71/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో పరాగ్, హెట్‌మయర్ ఆరో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేకెత్తించారు. ముఖ్యంగా పరాగ్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 13వ ఓవర్‌లో అలీ బౌలింగ్‌లో పరాగ్ ఏకంగా ఐదు సిక్స్‌లతో 32 పరుగులు పిండుకోవడంతో.. రాజస్థాన్ ఒక్కసారిగా మ్యాచ్‌లోకి వచ్చింది. అయితే, హెట్‌మయర్‌ను అవుట్ చేసిన హర్షిత్ జట్టుకు కావాల్సిన బ్రేక్‌ను అందించాడు. చివరి 3 ఓవర్లలో 38 పరుగులు కావాల్సి ఉండగా.. పరాగ్‌ను కూడా హర్షిత్ వెనక్కిపంపాడు. ఆఖరి 6 బంతుల్లో రాజస్థాన్ విజయానికి 22 పరుగులు అవసరమవగా.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో శుభం దూబె (14 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 25 నాటౌట్) 6,4,6 బాదడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా.. దూబే సింగిల్ మాత్రమే తీశాడు. రెండో పరుగు కోసం వచ్చిన ఆర్చర్ (12) రనౌటయ్యాడు. అంతకుముందు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (4) నిరాశపర్చగా.. కునాల్ సింగ్ (0), జైస్వాల్‌ను అలీ పెవిలియన్ చేర్చాడు. ధ్రువ్ జురెల్ (0), హసరంగ (0)ను వరుణ్ అవుట్ చేశాడు.
దంచేసిన రస్సెల్..: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. ఓపెనర్ నరైన్ (11) వికెట్‌ను వేగంగా కోల్పోయింది. కానీ, గుర్బాజ్, రహానె రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. గుర్బాజ్‌ను తీక్షణ అవుట్ చేసినా.. రఘువంశీతో కలసి రహానె స్కోరు బోర్డును నడిపించాడు. దీంతో జట్టు స్కోరు 12వ ఓవర్‌లో సెంచరీ మార్క్ దాటింది. కానీ, కీలక సమయంలో రహానెను పరాగ్ అవుట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రస్సెల్.. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రఘువంశీ జతగా నాలుగో వికెట్‌కు 33 బంతుల్లోనే 61 పరుగులు జోడించాడు. రఘువంశీని ఆర్చర్ వెనక్కిపంపగా.. ఆ స్థానంలో వచ్చిన రింకూ సింగ్ (6 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 19 నాటౌట్) 4,6,6తో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో కోల్‌కతా స్కోరు డబుల్ సెంచరీ దాటింది.
స్కోరుబోర్డు
కోల్‌కతా: గుర్బాజ్ (సి) హెట్‌మయర్ (బి) తీక్షణ 35, నరైన్ (బి) యుధ్‌వీర్ 11, రహానె (సి) జురెల్ (బి) పరాగ్ 30, రఘువంశీ (సి/సబ్) అశోక్ (బి) ఆర్చర్ 44, రస్సెల్ (నాటౌట్) 57, రింకూ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 206/4; వికెట్ల పతనం: 1-13, 2-69, 3-111, 4-172; బౌలింగ్: ఆర్చర్ 4-0-30-1, యుధ్‌వీర్ 2-0-26-1, తీక్షణ 4-0-41-1, ఆకాశ్ 3-0-50-0, హసరంగ 4-0-35-0, పరాగ్ 3-0-21-1.
రాజస్థాన్: జైస్వాల్ (సి) రింకూ (బి) అలీ 34, వైభవ్ సూర్యవంశీ (సి) రహానె (బి) అరోరా 4, కునాల్ (సి) రస్సెల్ (బి) అలీ 0, పరాగ్ (సి) అరోరా (బి) హర్షిత్ 95, జురెల్ (బి) వరుణ్ 0, హసరంగ (బి) వరుణ్ 0, హెట్‌మయర్ (సి) నరైన్ (బి) హర్షిత్ 29, శుభమ్ దూబె (నాటౌట్) 25, ఆర్చర్ (రనౌట్) 12; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 205/8; వికెట్ల పతనం: 1-5, 2-8, 3-66, 4-71, 5-71, 6-163, 7-173, 8-205; బౌలింగ్: వైభవ్ అరోరా 4-0-50-1, మొయిన్ అలీ 3-0-43-2, హర్షిత్ 4-0-41-2, వరుణ్ 4-0-32-2, నరైన్ 4-0-27-0, రస్సెల్ 1-0-11-0.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..