Match Abandoned: వరుణుడి ఖాతాలో 5
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:35 AM
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ కప్‌లో వరుణుడు మరో మ్యాచ్‌ను అడ్డుకున్నాడు. శ్రీ లంక-పాకిస్థాన్ మధ్య శుక్రవారం ఇక్కడ జరగాల్సిన ఆ జట్ల ఆఖరి లీగ్...
కొలంబో: ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ కప్‌లో వరుణుడు మరో మ్యాచ్‌ను అడ్డుకున్నాడు. శ్రీ లంక-పాకిస్థాన్ మధ్య శుక్రవారం ఇక్కడ జరగాల్సిన ఆ జట్ల ఆఖరి లీగ్ మ్యాచ్ భారీ వర్షంతో అర్ధంతరంగా రద్దయింది. తొలుత మ్యాచ్ మూడు గంటలకుపైగా ఆలస్యంగా మొదలైంది. దాంతో 34 ఓవర్లకు కుదించారు. టాస్ కోల్పోయి పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేపట్టగా..4.2 ఓవర్ల ఆట సాగిందో లేదో వరుణుడు మరోసారి విజృంభించాడు. ఈసారి ఏమాత్రం తెరిపినివ్వకపోవడంతో పోటీని రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. ఒమైమా సొహైల్ (9 బ్యాటింగ్), మునీబా అలీ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఈ మెగా టోర్నీలో 11 మ్యాచ్‌లు జరగగా..ఐదు వర్షంతో రద్దు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్‌లను ఖరారు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీలంకకు ఖేదం..: శ్రీలంక ఆడిన మ్యాచ్‌ల్లో మూడింటిలో వర్షంతో ఫలితం తేలలేదు. దీంతో సెమీఫైనల్ చేరాలన్న శ్రీలంక జట్టు ఆశలకు బ్రేక్ పడింది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో మరో మూడింటిలో ఓడిన లంక ఒక మ్యాచ్ నెగ్గింది. ఎనిమిది జట్ల టోర్నమెంట్‌లో ప్రస్తుతం ఐదు పాయింట్లతో శ్రీలంక ఐదో స్థానంలో ఉంది. మరోవైపు ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలు, మూడు ఫలితం తేలని మ్యాచ్‌లతో ఒక్క విజయమూ లేకుండానే పాకిస్థాన్ మహిళలు వెనుదిరిగారు. ఇక శుక్రవారంనాటి మ్యాచ్‌లో అందరి దృష్టి శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టుపై నిలిచింది. 35 ఏళ్ల చమరి అధికారికంగా ప్రకటించకపోయినా ఆమెకిదే ఆఖరి వరల్డ్ కప్‌గా భావిస్తున్నారు.