Share News

పంత్‌ ఫటాఫట్‌

ABN , Publish Date - Jun 22 , 2025 | 05:19 AM

బ్యాటర్ల ఆధిపత్యం సాగుతున్న టెస్ట్‌లో ఓలీ పోప్‌ (100 బ్యాటింగ్‌) సెంచరీతో అదరగొట్టడంతో.. ఇంగ్లండ్‌ కూడా దీటుగా బదులిస్తోంది. రిషభ్‌ పంత్‌ (178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134) మెరిసినా...

పంత్‌ ఫటాఫట్‌

భారత్‌ 471 ఆలౌట్‌

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 209/3

బుమ్రాకు 3 వికెట్లు

  • శతక్కొట్టిన రిషభ్‌

  • స్టోక్స్‌కు 4 వికెట్లు

  • పోప్‌ అజేయ శతకం

లీడ్స్‌: బ్యాటర్ల ఆధిపత్యం సాగుతున్న టెస్ట్‌లో ఓలీ పోప్‌ (100 బ్యాటింగ్‌) సెంచరీతో అదరగొట్టడంతో.. ఇంగ్లండ్‌ కూడా దీటుగా బదులిస్తోంది. రిషభ్‌ పంత్‌ (178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134) మెరిసినా.. బంతితో, బ్యాట్‌తో రాణించిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆటలో పైచేయి కనబర్చింది. ఓవర్‌నైట్‌ స్కోరు 359/3తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 471 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్‌ గిల్‌ (227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147) నిన్నటి స్కోరుకు 20 పరుగుల మాత్రమే జోడించాడు. జోష్‌ టంగ్‌, బెన్‌ స్టోక్స్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 209/3 స్కోరు చేసింది. శనివారం ఆట చివరకు పోప్‌తో పాటు హ్యారీ బ్రూక్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. బెన్‌ డకెట్‌ (62) అర్ధ శతకం సాధించాడు. బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లండ్‌ 262 పరుగుల దూరంలో ఉంది.


దెబ్బకొట్టిన స్టోక్స్‌..: పంత్‌ శతకంతో మెరిసినా.. పుంజుకొన్న ఇంగ్లండ్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో ఓవర్‌నైట్‌ స్కోరుకు 112 పరుగులు జోడించి భారత్‌ మిగతా ఏడు వికెట్లు చేజార్చుకొంది. రెండో రోజు ఆటలో స్కోరు బోర్డును నడిపించే బాధ్యతను పంత్‌ తీసుకోగా.. గిల్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ చక్కని సహకారం అందించాడు. కార్స్‌ బౌలింగ్‌లో గిల్‌ కవర్‌డ్రైవ్‌తో బౌండ్రీ సాధించగా.. పంత్‌ చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. క్రమంగా 90ల్లోకి అడుగుపెట్టిన రిషభ్‌ కొంత నెమ్మదించినా.. 100వ ఓవర్‌లో బషీర్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో శతకం పూర్తి చేసుకొన్నాడు. సోమర్‌సాల్ట్‌ ఫీట్‌తో తన ఏడో శతక సంబరాలు చేసుకొన్న పంత్‌.. ఆ తర్వాత మరో సిక్స్‌తో స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేశాడు. అయితే, 150 పరుగుల మార్క్‌కు చేరువవుతున్న గిల్‌ను అవుట్‌ చేసిన బషీర్‌.. నాలుగో వికెట్‌కు 209 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టులు ఆడే అవకాశం దక్కించుకొన్న కరుణ్‌ నాయర్‌ (0) నిరాశపర్చాడు. మరోవైపు స్టంపౌట్‌ను తప్పించుకొన్న పంత్‌.. టంగ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగిన అనంతరం భారత బ్యాటింగ్‌ కుప్పకూలింది. శార్దూల్‌ (1)ను కూడా స్టోక్స్‌ పెవిలియన్‌ చేర్చడంతో.. లంచ్‌ సమయానికి భారత్‌ 454/7తో నిలిచింది. ఆ తర్వాత కేవలం 14 పరుగులు జోడించిన టీమిండియా మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా (0), జడేజా (11), ప్రసిద్ధ్‌ కృష్ణ (1)ను అవుట్‌ చేసిన టంగ్‌.. భారత స్కోరును 500 మార్క్‌ చేరకుండా అడ్డుకొన్నాడు.


00-Sports.jpg

ఆదుకొన్న డకెట్‌, పోప్‌: వర్షం కారణంగా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కొంత ఆలస్యంగా ఆరంభమైంది. అయితే, తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ జాక్‌ క్రాలే (4)ను బుమ్రా క్యాచవుట్‌ చేసి షాకిచ్చినా.. పోప్‌ శతకంతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. ఒకవైపు ఇంగ్లిష్‌ బ్యాటర్లను బుమ్రా పరీక్షిస్తున్నా.. సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ అదే తరహా ఒత్తిడిని కొనసాగించలేక పోయారు. దీంతో మరో ఓపెనర్‌ డకెట్‌, పోప్‌ క్రీజులో నిలదొక్కుకొన్నారు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్‌లో జడేజా క్యాచ్‌ను చేజార్చడంతో బతికి పోయిన డకెట్‌.. ఆ తర్వాత దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పోప్‌ కూడా వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడాడు. జడేజా బౌలింగ్‌లో బౌండ్రీతో డకెట్‌ అర్థ శతకం పూర్తి చేసుకోగా.. టీ విరామానికి ఇంగ్లండ్‌ 107/1 స్కోరు చేసింది. మూడో సెషన్‌లో తొలి బంతినే బౌండ్రీకి తరలించిన పోప్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. కానీ, డకెట్‌ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో.. రెండో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో జతకలసిన పోప్‌, రూట్‌ (28).. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. 47వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో సింగిల్‌తో పోప్‌ సెంచరీ చేసుకొన్నా.. ఆ తర్వాతి బంతికి రూట్‌ క్యాచవుటయ్యాడు.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌:

జైస్వాల్‌ (బి) స్టోక్స్‌ 101, రాహుల్‌ (సి) రూట్‌ (బి) కార్స్‌ 42, సుదర్శన్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 0, గిల్‌ (సి) టంగ్‌ (బి) బషీర్‌ 147, పంత్‌ (ఎల్బీ) టంగ్‌ 134, నాయర్‌ (సి) పోప్‌ (బి) స్టోక్స్‌ 0, జడేజా (బి) టంగ్‌ 11, శార్దూల్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 1, బుమ్రా (సి) బ్రూక్‌ (బి) టంగ్‌ 0, సిరాజ్‌ (నాటౌట్‌) 3, ప్రసిద్ద్‌ (బి) టంగ్‌ 1; ఎక్స్‌ట్రాలు: 31; మొత్తం: 113 ఓవర్లలో 471 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-91, 2-92, 3-221, 4-430, 5-447, 6-453, 7-454, 8-458, 9-469, 10-471; బౌలింగ్‌: వోక్స్‌ 24-4-103-0, కార్స్‌ 22-5-96-1, టంగ్‌ 20-0-86-4, స్టోక్స్‌ 20-2-66-4, బషీర్‌ 27-6-100-1.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (సి) నాయర్‌ (బి) బుమ్రా 4, డకెట్‌ (బి) బుమ్రా 62, పోప్‌ (బ్యాటింగ్‌) 100, రూట్‌ (సి) నాయర్‌ (బి) బుమ్రా 28, బ్రూక్‌ (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 49 ఓవర్లలో 209/3; వికెట్ల పతనం: 1-4, 2-126, 3-206; బౌలింగ్‌: బుమ్రా 13-2-48-3, సిరాజ్‌ 14-0-50-0, ప్రసిద్ధ్‌ కృష్ణ 10-0-56-0, జడేజా 9-2-25-0, శార్దూల్‌ ఠాకూర్‌ 3-0-23-0.


ధోనీని దాటేశాడు

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఏడో శతకం బాదిన రిషభ్‌.. మాజీ కీపర్‌ ధోనీ ఆరు సెంచరీల రికార్డును అధిగమించాడు.

1

ఇంగ్లండ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు (6) బాదిన విదేశీ ఆటగాడిగా పంత్‌. కాగా, ఓవరాల్‌గా విదేశాల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా హార్దిక్‌ పాండ్యా (7 సిక్సర్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు.

2

కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా గిల్‌ (147). 1951లో ఇంగ్లండ్‌పైనే సారథిగా తన తొలి టెస్ట్‌లో విజయ్‌ హజారే (164 నాటౌట్‌) భారీ సెంచరీ సాధించాడు.

ఇవీ చదవండి:

8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు

సెంచరీ తర్వాత గాల్లో పల్టీలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 05:19 AM