Asia Cup Super-4: పాక్.. రేసులోనే శ్రీలంకపై విజయం
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:37 AM
ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్ కీలక విజయం అందుకుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకపై కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో...
అబుధాబి: ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్ కీలక విజయం అందుకుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకపై కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు ఆఖరి వరకు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే మహ్మద్ నవాజ్ (38 నాటౌట్), హుస్సేన్ తలత్ (32 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఓటమితో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక దాదాపుగా నిష్క్రమించినట్టే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. కమిందు మెండిస్ (50), అసలంక (20) మాత్రమే రాణించారు. షహీన్‌కు మూడు.. తలత్, రౌఫ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. పాక్ పేసర్ల జోరుకు పవర్‌ప్లేలోనే టాప్-3 బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. అయితే కమిందు ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపిగ్గా క్రీజులో నిలిచి అర్ధసెంచరీ సాధించాడు. ఏడో వికెట్‌కు కరుణరత్నె (17 నాటౌట్)తో కలిసి 43 పరుగులు జత చేశాడు. ఆ తర్వాత ఛేదనలో పాక్ 18 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. తీక్షణ, హసరంగలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హుస్సేన్ తలత్ నిలిచాడు.
మధ్యలో తడబడినా..: ఓపెనర్లు ఫర్హాన్ (24), ఫఖర్ (17) ఇన్నింగ్స్‌ను దీటుగా ఆరంభించి తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్ల ధాటికి ఆరో ఓవర్ నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన పాక్ 80/5 స్కోరుతో ఒత్తిడిలో పడింది. ఈ దశలో మ్యాచ్ ఇరువైపులా మొగ్గు చూపినట్టయ్యింది. అయితే తలత్, నవాజ్ జోడీ పాక్‌ను ఆదుకుంది. దాదాపు సగం ఓవర్లు ఆడిన వీరు రిస్కీ షాట్లకు వెళ్లకుండా కేవలం సింగిల్స్‌పై దృష్టి సారించారు. ఇక 18 బంతుల్లో 14 రన్స్ కావాల్సిన వేళ నవాజ్ మూడు సిక్సర్లతో చెలరేగి మ్యాచ్‌ను ముగించాడు. ఈ జోడీ ఆరో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 133/8 (మెండిస్ 50, అసలంక 20; షహీన్ 3/28, హుస్సేన్ తలత్ 2/18, రౌఫ్ 2/37).
పాకిస్థాన్: 18 ఓవర్లలో 138/5. (నవాజ్ 38 నాటౌట్, తలత్ 32 నాటౌట్; తీక్షణ 2/24, హసరంగ 2/27).