OU Students Protest: రమేష్ పై చర్య తీసుకోవాలి
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:25 AM
డోపింగ్ వ్యవహారంలో నాడా సస్పెండ్ చేసిన కోచ్ నాగపురి రమేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఓయూ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది
ఓయూ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్
హైదరాబాద్: డోపింగ్ వ్యవహారంలో ‘నాడా’ సస్పెండ్ చేసిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఫెడరేషన్ నాయకులు ఆందోళన చేశారు. ఈ విషయంపై ఫెడరేషన్ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ గతంలోనే రమేష్ శిక్షణ ఇస్తున్న అథ్లెట్లు నిషేధిత ఉత్ర్పేరకాలతో దొరకగా, తనకేమి తెలియదని మభ్యపెట్టి తప్పించుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. సాయ్ కేంద్రంలో కేవలం 20 మంది అథ్లెట్లకు మాత్రమే శిక్షణ ఇవ్వమని రమేష్‌ను కోచ్‌గా నియమిస్తే, ఆయన అనధికారికంగా చాలా మందికి అక్కడ కోచింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. రమేష్ చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షుడు రాజేష్, ఓయూ విద్యార్థి నాయకులు జంపన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.