Captain Indias Test Team: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. జట్టు సారథిపై కొనసాగుతున్న ఉత్కంఠ
ABN , Publish Date - May 10 , 2025 | 10:36 PM
ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ ఎవరన్న అంశంపై ఆసక్తి కొనసాగుతోంది. గిల్, పంత్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలన్న తలంపుతో బీసీసీఐ ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో తదుపరి టీమిండియా టెస్టు సారథి ఎవరన్న చర్చ మొదలైంది. త్వరలో జరగనున్న ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించేది ఎవరని అభిమానులు చర్చించుకుంటున్నారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన టోర్నీలో టీమిండియా పగ్గాలను జస్‌ప్రీత్ బుమ్రా చేపట్టాడు. అయితే, ఈసారి బుమ్రాకు బదులు గిల్, పంత్ ద్వయం జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ వీరికి అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ ఎంపికయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బుమ్రా స్థాయి దృష్ట్యా అతడికి వైస్‌కెప్టెన్ తగదని భావించడంతో రిషభ్ పంత్ వైపు బీసీసీఐ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇక బుమ్రాను ఫిట్‌నెస్ కష్టాలు కూడా వేధిస్తున్నాయి. దీంతో, పూర్తిస్థాయిలో అతడు సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఇక ఓవర్సీస్‌లో పంత్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో అతడి యావరేజ్ 42 పరుగులుగా ఉంది. దీంతో, ఈ ఫార్మాట్‌కు అతడు తగిన వాడన్న భావన ఉంది.
ఇక అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నప్పటికీ అతడికి ఇప్పటికే 33 ఏళ్ల దాటాయి. అతడి ఫార్మ్ కూడా నిలకడగా ఉండడట్లేదు. ఇక టెస్టు క్రికెట్ నుంచి తప్పుకునేందుకు విరాట్ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ బీసీసీఐ ఈ విషయంలో మౌనంగానే ఉంటుంది. ఇంగ్లండ్ కెప్టెన్‌గా కోహ్లీని ఎంపిక చేయాలని చూస్తోంది. తద్వారా శుభమన్‌కు అనుభవం గడిచేందుకు తగిన సమయం లభిస్తుంది. అయితే, ఈ విషయాలపై బీసీసీఐ ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకపోవడంతో తదుపరి ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి.