IPL 2025 Final Match: ఎవరో కొత్త కింగ్..?
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:33 AM
ప్రపంచ క్రికెట్‌లో అతి భారీ టీ20 లీగ్ అయిన ఐపీఎల్ ఆఖరి అంకానికి చేరింది. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు (మంగళవారం) జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టైటిల్ కోసం...
తొలి టైటిల్ వేటలో
పంజాబ్X బెంగళూరు
నేడు ఐపీఎల్ -18 ఫైనల్
రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఒకటా.. రెండా గత 17 ఏళ్లుగా ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్‌ను అందుకోవాలని ఆ రెండు జట్లు ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ కెరీర్‌లోనైతే అదో పెద్ద వెలితి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును తన నాయకత్వంలో చాన్నాళ్లు నడిపించినా చాంపియన్‌ను చేయలేకపోయాడు. కానీ 18వ సీజన్‌లో ఆ అద్భుతాన్ని సాధించేందుకు ఆర్‌సీబీ మరో విజయం దూరంలోనే ఉంది. ఇక గతంలో పంజాబ్ కింగ్స్‌పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేకపోయినా.. ప్రస్తుతం సీన్ మారింది. శ్రేయాస్ అయ్యర్ ఆ జట్టును కదం తొక్కిస్తున్నాడు. టేబుల్ టాపర్‌గా నిలపడమే కాకుండా తుది పోరుకు కూడా చేర్చాడు. ఇక ఈ రెండు టాప్-2 జట్ల మధ్య ఆసక్తికరపోరులో ఎవరు గెలిచినా తొలి టైటిల్‌తో పండుగ చేసుకుంటారు.
అహ్మదాబాద్: ప్రపంచ క్రికెట్‌లో అతి భారీ టీ20 లీగ్ అయిన ఐపీఎల్ ఆఖరి అంకానికి చేరింది. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు (మంగళవారం) జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే లీగ్ ముగియాల్సి ఉన్నా.. భారత్-పాక్ యుద్ధం కారణంగా వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఆర్‌సీబీ తుది పోరులో తలపడడం ఇది నాలుగోసారి. 2009, 2011, 2016ల్లో టైటిల్‌పై ఆశలు పెట్టుకున్నా రన్నర్‌పగానే నిలిచింది. ‘ఈ సాల కప్ నమ్దే’ అంటూ బెంగళూరు జట్టు అభిమానులు ప్రతీసారి హోరెత్తిస్తుంటారు. వీరి నమ్మకాన్ని నిలబెడుతూ ఈసారి అదిరే ప్రదర్శనతో జట్టు తుదిపోరుకు చేరి అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా విరాట్ అభిమానులు నెంబర్ 18 జెర్సీలతో స్టేడియంలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అటు బెంగళూరులో హడావిడి మామూలుగా లేదు. రెస్టో బార్స్, పబ్స్‌లతో పాటు భారీ జెయింట్స్ స్ర్కీన్లపై ఫైనల్‌ను తిలకించేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. మరోవైపు క్వాలిఫయర్-1లో ఆర్‌సీబీ చేతిలోనే చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్ తిరిగి తుది పోరులోనూ అదే జట్టును ఢీకొనాల్సి వచ్చింది. ఆదివారం ఇదే మైదానంలో ముంబైని చిత్తు చేసిన అనుభవంతో ఈసారి బెంగళూరుకు గట్టి పంచ్ ఇవ్వాలనుకుంటోంది. 2014లో ఒక్కసారి మాత్రమే పంజాబ్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ప్రతీకారంతో పంజాబ్
టేబుల్ టాపర్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్-1లో ఎదురైన పరాభవంతో ఒక్కసారిగా డీలా పడింది. ఆర్‌సీబీ ధాటికి కేవలం 101 పరుగులకే పరిమితం కావడంతో షాక్‌కు గురైంది. కానీ అలాంటి స్థితి నుంచి వెంటనే తేరుకుని, ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను క్వాలిఫయర్-2లో మట్టి కరిపించిన విధానం అదుర్స్. కెప్టెన్ శ్రేయాస్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించగా, 11 ఏళ్ల తర్వాత జట్టు ఫైనల్‌కు చేరింది. గతేడాది కేకేఆర్ కెప్టెన్‌గా ఆ జట్టుకు టైటిల్ అందించిన శ్రేయా్‌సపై.. ఇప్పుడు పంజాబ్‌ను గెలిపించే బాధ్యత ఉంది. తన రూ.26.75 కోట్ల ధరకు 603 పరుగులతో న్యాయం చేస్తున్నాడు. అతడితో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్, ఇన్‌గ్లి్‌స, శశాంక్ సింగ్, స్టొయినిస్ ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నారు. అయితే పేసర్ జాన్సెన్ లేకపోవడంతో వీరి బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అయినప్పటికీ బ్యాటింగ్ పిచ్‌పై ముంబైని మరీ భారీ స్కోరు చేయనీయకుండా కట్టడి చేయగలిగారు. అయితే పేసర్ అర్ష్‌దీప్ మాత్రం ఎలాంటి ప్రభావమూ చూపలేదు. అలాగే గాయం తర్వాత ఆడిన స్పిన్నర్ చాహల్ సైతం ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. ఏదేమైనా ఈ ఆఖరి పోరులో తమ లోపాలను సరిచేసుకుంటూ ఆర్‌సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో పంజాబ్ ఉంది.
జోరు సాగాలని..
ఆర్‌సీబీ ప్రధాన ఆకర్షణ విరాట్ కోహ్లీ అనడంలో సందేహం లేదు. ఎప్పటి మాదిరే ఈ సీజన్‌లోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో రాణిస్తున్నాడు. 614 పరుగులతో టాప్-5లో కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్‌తో కలిసి ఓపెనర్‌గా మెరుపు ఆరంభాలతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పడకుండా చూసుకుంటున్నాడు. ఇక ఈ స్టేడియంలోనూ, పంజాబ్‌పై అతడికి మెరుగైన రికార్డు ఉండడం జట్టుకు లాభించేదే. అలాగే మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ రాణిస్తుండడం సానుకూలాంశం. అయితే కెప్టెన్ రజత్ పటీదార్ మాత్రం ఇటీవలి మ్యాచ్‌ల్లో నిరాశపర్చాడు. గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఫినిషర్ టిమ్ డేవిడ్ ఫిట్‌నె్‌సపై స్పష్టత రావాల్సి ఉంది. బౌలింగ్‌లో పేసర్ హాజె ల్‌వుడ్ ఇప్పటికే 21 వికెట్లతో జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు. ఇతర పేసర్లు యష్ దయాల్, తుషార, భువనేశ్వర్ సైతం ప్రభావం చూపుతున్నారు. అందుకే అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న ఆర్‌సీబీ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే చాంపియన్ కావడం సాధ్యమే.
తుది జట్లు (అంచనా)
బెంగళూరు: సాల్ట్, విరాట్, మయాంక్, రజత్ పటీదార్ (కెప్టెన్), లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, క్రునాల్, భువనేశ్వర్, యష్ దయాల్, హాజెల్‌వుడ్.
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్, ఇన్‌గ్లి్‌స, శ్రేయాస్ (కెప్టెన్), నేహల్, శశాంక్, స్టొయినిస్, ఒమర్జాయ్, జేమిసన్, అర్ష్‌దీప్, చాహల్.
పిచ్
అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. క్వాలిఫయర్-2లో ఇరు జట్లూ 200+ స్కోర్లు సాధించాయి. ఇక్కడ మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా.. చివరి మ్యాచ్‌లో పంజాబ్ అద్భుతంగా ఛేదించింది. దీంతో ఫైనల్లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు.
వర్షం పడి రద్దయితే..?
ఫైనల్‌కు కూడా వర్షంతో ముప్పు పొంచి ఉంది. మంగళవారం రోజంతా ఆకాశం మేఘావృతంగా ఉండనుందట. అహ్మదాబాద్, సమీప ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఆస్కారముందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయినా ఎలాంటి ఇబ్బందీ లేదు. ఫైనల్‌కు రిజర్వ్ డే ఉన్నందున బుధవారం జరుగుతుంది. అప్పుడు కూడా వర్షంతో వీలు కాకపోతే లీగ్ దశలో టేబుల్ టాపర్ (పంజాబ్) జట్టును విజేతగా ప్రకటిస్తారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి