Lionel Messi: మెస్సీ మెరిసె.. ముంబై మురిసె
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:15 AM
అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఫీవర్ కలల నగరాన్ని కుదిపేసింది. మెస్సీ.. మెస్సీ నామస్మరణతో సిటీ మొత్తం సందడి వాతావరణం నెలకొంది....
ప్రత్యేక ఆకర్షణగా సచిన్
పోటెత్తిన అభిమానులు
ముంబై: అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఫీవర్ కలల నగరాన్ని కుదిపేసింది. మెస్సీ.. మెస్సీ నామస్మరణతో సిటీ మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ‘గోట్’ ఇండియా టూర్‌లో భాగంగా మూడో అంచె అయిన ముంబైలో మెస్సీ ఆదివారం పర్యటించాడు. అయితే, దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మెస్సీ వాంఖడేలో కలవడం ఈ పర్యటనకే హైలైట్. అతడి రాక కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నం మెస్సీ ఇక్కడకు చేరుకొన్నాడు. ప్రముఖ ఫుట్‌బాలర్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా అతడి వెంటే వచ్చారు. గంటపాటు వాంఖడేలో మెస్సీ అండ్ కో సందడి చేశారు. భారత మాజీ ఫుట్‌బాలర్ సునీల్ చెత్రి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ ఫుట్‌బాలర్లలోని ప్రతిభను వెలికితీయడానికి ‘ప్రాజెక్ట్ మహాదేవ’ను ప్రారంభిస్తున్నట్టు ఫడణవీస్ ప్రకటించారు. మెస్సీని మెమెంటోతో సత్కరించారు. లియోకు చెత్రి జెర్సీని బహూకరించగా.. అతడు కూడా సునీల్‌కు అదే గిఫ్ట్‌ను ఇచ్చాడు. సోమవారం ఢిల్లీ లెగ్‌తో లియోనెల్ భారత పర్యటన ముగియనుంది.
కూల్‌గా హుషారుగా..
మెస్సీ ఎంతో కూల్‌గా కనిపించాడు. రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వస్తూనే ఫ్యాన్స్‌కు చేతులు ఊపుతూ పలకరించాడు. ఫడణవీస్, సచిన్‌తోపాటు బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ తదితరులు కూడా మెస్సీతో కలిశారు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడే ప్లేయర్లను పలకరించిన అనంతరం.. హైదరాబాద్ తరహాలో ఫుట్‌బాల్‌ను స్టాండ్స్‌లోకి కొట్టిన లియోనెల్, సువారెజ్, డి పాల్ ఆ తర్వాత మైదానం అంతా కలియదిరిగారు. ఆ తర్వాత 7-7 ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. యువ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేయించారు. వాంఖడే కంటే ముందు పడేల్ కప్ ఈవెంట్ కోసం బ్రబౌర్న్ స్టేడియాన్ని మెస్సీ సందర్శించాడు.
అందుకే ఇక్కడ మ్యాచ్‌లు ఆడలేదు
కోల్‌కతా: సాకర్ లెజెండ్ మెస్సీ భారత పర్యటనలో ఒక్క క్లబ్ మ్యాచ్ కానీ, అంతర్జాతీయ స్థాయి పోటీలో కానీ పాల్గొనక పోవడం కోట్లాదిమంది భారత అభిమానులను నిరాశ పరుస్తోంది. ఇంత వ్యయప్రయాసలతో ఏర్పాటు చేసిన మూడు రోజుల టూర్‌లో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడక పోవడమేమిటనే సందేహం కలుగుతోంది. 38 ఏళ్ల లియోనెల్ ప్రపంచంలో అత్యంత అధిక మొత్తం బీమా కలిగిన ఆటగాడు. అతడి ఎడమ పాదం బీమా విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అది ఎంత మొత్తమంటే.. 8,153 కోట్లు! పోటీల సందర్భంగా కెరీర్‌కు ముప్పు తెచ్చే గాయాల వల్ల ఏర్పడే ఆర్థిక నష్టం నుంచి ఈ బీమా మెస్సీకి రక్షణ కల్పిస్తుంది. అందువల్ల..క్లబ్ లేదా దేశానికి చెందని మ్యాచుల్లో ఆ ప్లేయర్ పాల్గొనడు. అర్జెంటీనా జాతీయ జట్టుకు ఆడే లియోనెల్ క్లబ్ స్థాయిలో ఇంటర్ మియామీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంకా..ఎగ్జిబిషన్ మ్యాచ్‌లకు బీమా పాలసీ వర్తించదు. ఒకవేళ ఈ మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాడు గాయపడితే అతడు వేల కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని కోల్పోవాల్సి ఉంది. ఇదీ.. భారత్‌లో మెస్సీ మ్యాచ్‌లు ఆడకపోవడం వెనకున్న సీక్రెట్. అయితే దిగ్గజ బాస్కెట్‌బాలర్ మైకేల్ జోర్డాన్‌కు చికాగో బుల్స్‌తో ఉన్న ఒప్పందంలో ‘లవ్ ఆఫ్ ది గేమ్’ అనే క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ప్రకారం అతడు తన జట్టు అనుమతిలేకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఆడొచ్చు. ఈ మ్యాచ్‌ల సమయంలో జోర్డాన్‌కు గాయం అయినా చికాగో బుల్స్ జట్టు అతడికి పరిహారం చెల్తిస్తుంది. కానీ మెస్సీ బీమా పాలసీలో అటువంటి క్లాజ్ లేదట!