ఆ శిక్షణతో మరింత ఎత్తుకు
ABN , Publish Date - May 14 , 2025 | 04:34 AM
విరాట్ కోహ్లీ కెరీర్‌లో 2014 ఇంగ్లండ్ పర్యటన అత్యంత చేదు అనుభవాన్ని మిగిల్చింది. దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ అతడి ప్రాభవాన్ని దారుణంగా దెబ్బతీశాడు. దీంతో ఆ టూర్‌లో...
బెంగళూరు: విరాట్ కోహ్లీ కెరీర్‌లో 2014 ఇంగ్లండ్ పర్యటన అత్యంత చేదు అనుభవాన్ని మిగిల్చింది. దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ అతడి ప్రాభవాన్ని దారుణంగా దెబ్బతీశాడు. దీంతో ఆ టూర్‌లో ఆడిన ఐదు టెస్టుల్లో 134 పరుగులే చేయగా, 4 వన్డేల్లో 54 రన్స్‌కు పరిమితమయ్యాడు. దీంతో సీమ్ పిచ్‌లపై అతడి వైఫల్యంపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఇలాంటి గడ్డు స్థితి నుంచి విరాట్ త్వరగానే పుంజుకోవడమే కాకుండా కెరీర్‌లో అత్యున్నత స్థితికి చేరుకోగలిగాడు. దీనికి కారణం.. అతడి అండర్-19 కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ దగ్గర రెండు వారాలు తీసుకున్న శిక్షణేనట. ‘విరాట్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అండర్- 19కు ఆడినప్పటి నుంచే అతని ఆటపై నాకు పూర్తి అవగాహన ఉంది. 2014 టూర్ తర్వాత వెంటనే నాకు ఫోన్ చేశాడు. ముంబైలో రెండు వారాలపాటు ఏర్పాటు చేసిన శిబిరంలో విరాట్ బ్యాటింగ్ లోపాలపై దృష్టి పెట్టా. క్రీజులో అతడి తల కాస్త వాలిపోతున్నట్టు ఉండడమే కాక పాదాల కదలిక అనిశ్చితిగా ఉంది. దీంతో ఆ విషయంలో మార్పులు చేశా. వెంటనే విరాట్ ఈ విషయంలో కఠిన ప్రాక్టీస్ చేశాడు’ అని రాజ్‌పుత్ వివరించాడు. ఈ శిక్షణ విరాట్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయింది. ఎందుకంటే ఆ తర్వాత 2014 నవంబరులోనే ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లగా అడిలైడ్‌లో డబుల్ సెంచరీ, మెల్‌బోర్న్.. సిడ్నీలలో శతకాలతో చెలరేగాడు. ఈ ధాటితో 4 టెస్టుల్లో 692 రన్స్‌తో విరాట్ విమర్శకులకు దీటైన బదులిచ్చాడు. ఆ తర్వాత తన కెరీర్ దూసుకెళ్లడంతో ఇతర బ్యాటర్లకు అందనంత ఎత్తుకు ఎదిగాడు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లంటే ఇష్టం ఉండదు: భరత్ అరుణ్
ప్రాక్టీస్ మ్యాచ్‌లకన్నా నెట్ సెషన్స్ అంటేనే విరాట్ కోహ్లీ ఇష్టపడేవాడని భారత జట్టు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. 16 గజాల దూరం నుంచే పేసర్లతో బంతులు వేయించుకునేవాడని చెప్పాడు. విరాట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అరుణ్ జట్టుతోపాటే ఉన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో తీవ్రత ఉండదని కోహ్లీ చెప్పేవాడని అరుణ్ అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..