Share News

బెంగళూరు.. ప్రతీకారం

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:13 AM

విరాట్‌ కోహ్లీ (54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 73 నాటౌట్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) అదరగొట్టడంతో.. పంజాబ్‌ కింగ్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రతీకారం తీర్చుకొంది...

బెంగళూరు.. ప్రతీకారం

కోహ్లీ, పడిక్కల్‌ అర్ధ శతకాలు

7 వికెట్లతో పంజాబ్‌ చిత్తు

ముల్లన్‌పూర్‌: విరాట్‌ కోహ్లీ (54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 73 నాటౌట్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) అదరగొట్టడంతో.. పంజాబ్‌ కింగ్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రతీకారం తీర్చుకొంది. శుక్రవారం సొంతగడ్డపై అయ్యర్‌ సేన చేతిలో చిత్తయిన బెంగళూరు.. 48 గంటలు తిరక్కుండానే లెక్కసరి చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్లతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత పంజాబ్‌ 20 ఓవర్లలో 157/6 స్కోరు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (33), శశాంక్‌ సింగ్‌ (31 నాటౌట్‌), జోష్‌ ఇంగ్లిస్‌ (29), మార్కో జెన్సన్‌ (25 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. క్రునాల్‌ పాండ్యా, సుయాష్‌ శర్మ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 159 రన్స్‌ చేసి గెలిచింది. కోహ్లీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

కష్టపడకుండా కొట్టేశారు: బెంగళూరు ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ సాల్ట్‌ (1)ను అవుట్‌ చేసిన అర్ష్‌దీప్‌ షాకిచ్చాడు. కానీ, మరో ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ సహకారంతో దేవ్‌దత్‌ పడిక్కల్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 69 బంతుల్లో 103 రన్స్‌ జోడించడంతో.. మ్యాచ్‌ బెంగళూరువైపు మొగ్గింది. బౌండ్రీతో ఖాతా తెరిచిన పడిక్కల్‌.. ఆ తర్వాత చెలరేగాడు. మరోవైపు వీలుచిక్కినప్పుడల్లా కోహ్లీ షాట్లు ఆడడంతో 6 ఓవర్లకు బెంగళూరు 54/1తో నిలిచింది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల వేగం మందగించింది. కానీ, సింగిల్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొన్న పడిక్కల్‌.. 12వ ఓవర్‌లో స్టొయినిస్‌ బౌలింగ్‌లో 6,4తో బ్యాట్‌ ఝుళిపించడంతో జట్టు స్కోరు సెంచరీ దాటింది. అయితే, ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్న పడిక్కల్‌ను హర్‌ప్రీత్‌ క్యాచవుట్‌ చేశాడు. అనంతరం విరాట్‌, కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ (12) మూడో వికెట్‌కు 34 రన్స్‌ చేర్చడంతో.. ఆర్‌సీబీ గెలుపునకు మరింత చేరువైంది. పటీదార్‌ను చాహల్‌ పెవిలియన్‌ చేర్చినా.. కోహ్లీ, జితేశ్‌ (11 నాటౌట్‌) 7 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు.


బ్యాటర్ల తడబాటు: మందకొడి పిచ్‌పై క్రునాల్‌, సుయాష్‌ తిప్పేయడంతో.. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన పంజాబ్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాన్షు ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్‌ 4.2 ఓవర్లలో 42 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యంతో దూకుడైన ఆరంభాన్నిచ్చారు. యశ్‌ వేసిన రెండో ఓవర్‌లో ఆర్య 6,4 బాదగా.. ఆ తర్వాతి ఓవర్‌లో భువీ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌ 3 ఫోర్లు కొట్టాడు. అయితే, ఐదో ఓవర్‌లో వ్యూహాత్మకంగా క్రునాల్‌కు బంతిని ఇవ్వడం బెంగళూరుకు లాభించింది. భారీ షాట్లు ఆడే జోరు మీదున్న ప్రియాన్షును క్రునాల్‌ బోల్తా కొట్టించాడు. కానీ, కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (6)తో కలసి ప్రభ్‌సిమ్రన్‌ స్కోరు బోర్డును నడిపించాడు. హాజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సిక్స్‌ బాదగా.. అయ్యర్‌ బౌండ్రీ కొట్టాడు. దీంతో పవర్‌ప్లేను పంజాబ్‌ 62/1తో మెరుగ్గానే ముగించింది. కానీ, తర్వాతి ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ను కూడా క్రునాల్‌ పెవిలియన్‌ చేర్చా డు. దీంతో.. పంజాబ్‌ 68/3తో ఒక్కసారిగా తడబడింది. ఇంగ్లిస్‌తో సమన్వయ లోపం కారణంగా నేహల్‌ వధేరా (5) రనౌటయ్యాడు. ఆ దశలో ఇంగ్లిస్‌, శశాంక్‌ ఐదో వికెట్‌కు 36 రన్స్‌ భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, 14వ ఓవర్‌లో ఇంగ్లిస్‌, స్టొయినిస్‌ (1)ను సుయాష్‌ బౌల్డ్‌ చేశాడు. ఇక, డెత్‌ ఓవర్లలో భువీ, హాజెల్‌వుడ్‌ కట్టుదిట్టంగా బంతులేయడంతో.. శశాంక్‌, జెన్సన్‌ భారీ షాట్టు ఆడలేకపోయారు. వీరిద్దరూ స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ ఏడో వికెట్‌కు అజేయంగా 43 రన్స్‌ జోడించడంతో.. స్కోరు కష్టంగా 150 దాటింది. ఆఖరి బంతికి జెన్సన్‌ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించగా.. చివరి 5 ఓవర్లలో పంజాబ్‌ 38 పరుగులే చేయగలిగింది.


స్కోరుబోర్డు

పంజాబ్‌: ప్రియాన్ష్‌ ఆర్య (సి) డేవిడ్‌ (బి) క్రునాల్‌ 22, ప్రభ్‌సిమ్రన్‌ (సి) డేవిడ్‌ (బి) క్రునాల్‌ 33, శ్రేయాస్‌ (సి) క్రునాల్‌ (బి) షెపర్డ్‌ 6, ఇంగ్లిస్‌ (సి) సుయాష్‌ 29, నేహల్‌ (రనౌట్‌) 5, శశాంక్‌ (నాటౌట్‌) 31, స్టొయినిస్‌ (బి) సుయాష్‌ 1, జెన్సన్‌ (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 157/6; వికెట్ల పతనం: 1-42, 2-62, 3-68, 4-76, 5-112, 6-114; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-26-0, యశ్‌ దయాళ్‌ 2-0-22-0, హాజెల్‌వుడ్‌ 4-0-39-0, క్రునాల్‌ 4-0-25-2, షెపర్డ్‌ 2-0-18-1, సుయాష్‌ 4-0-26-2.

బెంగళూరు: సాల్ట్‌ (సి) ఇంగ్లిస్‌ (బి) అర్ష్‌దీప్‌ 1, కోహ్లీ (నాటౌట్‌) 73, పడిక్కల్‌ (సి) వధేరా (బి) హర్‌ప్రీత్‌ 61, రజత్‌ (సి) జెన్సన్‌ (బి) చాహల్‌ 12, జితేశ్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 18.5 ఓవర్లలో 159/3; వికెట్ల పతనం: 1-6, 2-109, 3-143; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 3-0-26-1, బ్రాట్‌లెట్‌ 3-0-28-0, హర్‌ప్రీత్‌ 4-0-27-1, జెన్సన్‌ 3-0-20-0, చాహల్‌ 4-0-36-1, స్టొయినిస్‌ 1-0-13-0, నేహల్‌ వధేరా 0.5-0-9-0.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2025 | 03:13 AM