Jim Laker 19 Wickets: 69 ఏళ్లుగా చెక్కుచెదరని ఆ 'బాహుబలి' రికార్డ్..
ABN , Publish Date - Nov 21 , 2025 | 08:28 PM
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో కొత్త రికార్డులు నమోదవుతుంటాయ్. పాతవి బద్ధలవుతూ ఉంటాయ్. కానీ కొన్ని ఘనతలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఆ కోవకే చెందినది ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జిమ్ లేకర్ నెలకొల్పిన ఈ రికార్డ్. దాదాపు 7 దశాబ్దాలు కావస్తున్నా.. ఇప్పటికీ ఆ 'బాహుబలి' ప్రపంచ రికార్డ్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇంతకీ ఆ రికార్డ్ ఏమిటంటే...
ఇంటర్నెట్ డెస్క్: 90 పరుగులకు 19 వికెట్లు. క్రికెట్ చరిత్రలో ఇదో 'బాహుబలి' రికార్డ్. 1956లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్(England Bowler Jim Laker) సాధించిన ఈ ప్రపంచ రికార్డ్ ఇప్పటికీ అలాగే ఉంది. 69 ఏళ్లుగా చెక్కు చెదరని ఈ రికార్డ్.. నాడు ఎలా సాధ్యమైందంటే...
ఓ టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో 20 వికెట్లలో ఒకే ఆటగాడు 19 వికెట్లు పడగొట్టడమంటే మాటలా. కనీసం ఊహకైనా అందదు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడో బౌలర్. యాషెస్ సిరీస్(Ashes Series)లో భాగంగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England) బౌలర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియా(Australia)పై ఈ ఘనతను సాధించాడు. నాడు ఒంటిచేత్తో రెండు ఇన్నింగ్స్‌లలో ప్రత్యర్థి పతనాన్ని శాసించి సంచలనం సృష్టించిన జిమ్ లేకర్ రికార్డ్.. 69 ఏళ్లయినా నేటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. శుక్రవారం తాజాగా యాషెస్ సిరీస్ ప్రారంభమైన నేపథ్యంలో 1956 నాటి మ్యాచ్ మధుర స్మృతులను ఓసారి తెలుసుకుందాం.
ఒక్క వికెట్ దూరంలో..
యాషెస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జిమ్ లేకర్ తన స్పిన్ మాయాజాలంతో 9 వికెట్లు నేలకూల్చాడు. అదే గొప్ప ఘనత అనుకునేలోపే.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమే చేశాడు. పదికి పది వికెట్లూ తన ఖాతాలో వేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇలా ఒక మ్యాచ్‌లో 19 వికెట్లు(90 పరుగులకు) తీసి 'పర్ఫెక్ట్ 20'కి ఒక్క వికెట్ దూరంలో నిలిచిపోయాడీ స్పిన్నర్. ఈ మ్యాచ్‌లో జిమ్ లేకర్ ధాటికి ఆసీస్ బెంబేలెత్తింది. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆ ముగ్గురే..
ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జిమ్ లేకర్ రికార్డులకెక్కాడు. అతడి తర్వాత భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(Anil Kumble), న్యూజిలాండ్‌కు చెందిన అజాజ్ పటేల్(Ajaz Patel) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. కానీ ఒకే ఇన్నింగ్స్‌లో 19 వికెట్లు తీసిన బౌలర్‌గా జిమ్ లేకర్ అగ్రస్థానంలో ఉన్నాడు. మరే ఇతర బౌలర్ కూడా ఇప్పటివరకూ ఆ మార్కును చేరుకోలేదు.