Share News

Jemimah Rodrigues: జెమీమా జోరు

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:28 AM

వన్డే వరల్డ్‌కప్‌ గెలిచాక తొలిసారి బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సలో బౌలర్లు విశేషంగా రాణించ....

Jemimah Rodrigues: జెమీమా జోరు

  • భారత్‌ శుభారంభం

  • తొలి టీ20లో శ్రీలంకపై ఘనవిజయం

విశాఖపట్నం: వన్డే వరల్డ్‌కప్‌ గెలిచాక తొలిసారి బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సలో బౌలర్లు విశేషంగా రాణించగా, జెమీమా రోడ్రిగ్స్‌ (44 బంతుల్లో 10 ఫోర్లతో 69 నాటౌట్‌) తన ఫామ్‌ను కొనసాగించింది. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో నెగ్గి, సిరీ్‌సలో 1-0తో బోణీ చేసింది. రెండో టీ20 కూడా మంగళవారం విశాఖలోనే జరుగుతుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసింది. ఓపెనర్‌ విష్మి గుణరత్నె (39), హర్షిత (21), హాసిని (20) మాత్రమే రాణించారు. భారత బౌలర్లు ఆరంభం నుంచే లంక బ్యాటర్లను కట్టడి చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లను తీయగలిగారు. దీంతో అతికష్టమ్మీద లంక వంద పరుగులు దాటగలిగింది. అయితే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేసి నిరాశపర్చారు. మూడో వికెట్‌కు విష్మి-హర్షిత మధ్య అత్యధికంగా 38 పరుగులు జత చేరాయి. స్పిన్నర్లు దీప్తి, శ్రీచరణి పేసర్‌ క్రాంతిలకు ఒక్కో వికెట్‌ దక్కింది. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 14.4 ఓవర్లలో 122/2 స్కోరుతో ఘనవిజయం సాధించింది. స్మృతీ మంధాన (25), హర్మన్‌ప్రీత్‌ (15 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జెమీమా నిలువగా, భారత్‌కు చెందిన 20 ఏళ్ల ఆల్‌రౌండర్‌ వైష్ణవి శర్మ ఈ మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసింది.

సునాయాసంగా..

స్వల్ప ఛేదనలో భారత మహిళలు ఏ దశలోనూ ఇబ్బందిపడలేదు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ షఫాలీ (9) వెనుదిరిగినా.. మరో ఓపెనర్‌ స్మృతి మంధాన-జెమీమా జోడీ వేగం కనబర్చింది. ఆరో ఓవర్‌లో జెమీమా రెండు, మంధాన ఓ ఫోర్‌తో 16 రన్స్‌ రాగా పవర్‌ప్లేలో జట్టు 55/1 స్కోరుతో నిలిచింది. అయితే బంతికో పరుగు చొప్పున సాధించిన మంధాన తొమ్మిదో ఓవర్‌లో వెనుదిరగడం రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు రోడ్రిగ్స్‌ మాత్రం జోరును కొనసాగిస్తూ 12వ ఓవర్‌లో నాలుగు ఫోర్లతో 34 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ ధాటితో మూడో వికెట్‌కు హర్మన్‌తో కలిసి అజేయంగా 55 పరుగులు సమకూర్చి, మరో 32 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది.

  • 2 మహిళల టీ20ల్లో 4వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా స్మృతీ మంధాన. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సుజీ బేట్స్‌ (4716) టాప్‌లో ఉంది.

Updated Date - Dec 22 , 2025 | 04:28 AM