Share News

Dhiraj Bommadevara: ధీరజ్‌ పసిడి పట్టాడు..

ABN , Publish Date - Nov 15 , 2025 | 03:56 AM

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత రికర్వ్‌ ఆర్చర్లు అదరహో అనిపించారు. శుక్రవారం ముగిసిన ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు సహా ఓ రజతం...

Dhiraj Bommadevara: ధీరజ్‌ పసిడి పట్టాడు..

ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత రికర్వ్‌ ఆర్చర్లు అదరహో అనిపించారు. శుక్రవారం ముగిసిన ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు సహా ఓ రజతం, కాంస్యం సాధించారు. ఇక, స్వర్ణం నెగ్గిన వాళ్లలో ధీరజ్‌ బొమ్మదేవర కూడా ఉండడం విశేషం. పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ ఈవెంట్‌ ఫైనల్లో విజయవాడ ఆర్చర్‌ ధీరజ్‌ 6-2తో భారత్‌కే చెందిన రాహుల్‌ను ఓడించి పసిడి పట్టేశాడు. దీంతో ఈ విభాగంలో స్వర్ణం, రజతం భారత్‌ ఖాతాలోకే చేరాయి. ఇక, మహిళల వ్యక్తిగత రికర్వ్‌ తుదిపోరులో భారత ఆర్చర్‌ అంకితా భకత్‌ 7-3తో సుహేన్‌ (కొరియా)ను చిత్తుచేసి స్వర్ణం దక్కించుకుంది. ఇదే విభాగం కాంస్యం పోరులో భారత అమ్మాయి సంగీత షూటా్‌ఫలో 6-5తో సహచర ఆర్చర్‌, దీపికా కుమారిపై నెగ్గి పతకం అందుకుంది. ఇక, పురుషుల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో యశ్‌దీప్‌, అతాను దాస్‌, రాహుల్‌లతో కూడిన భారత త్రయం 5-4తో కొరియాను ఓడించి 18 ఏళ్ల తర్వాత తొలిసారి పసిడి పతకం సొంతం చేసుకుంది. రికర్వ్‌ టీమ్‌లో భారత పురుషుల జట్టు చివరిసారిగా 2007లో విజేతగా నిలిచింది. ఇక, ఈసారి భారత్‌ 6 స్వర్ణాలు, 3 రజతాలు, ఓ కాంస్యంతో కలిపి మొత్తం 10 పతకాలతో అగ్రస్థానం అందుకొంది.

Updated Date - Nov 15 , 2025 | 03:56 AM