Share News

India Women Face Crucial Battle: కఠిన సవాల్‌

ABN , Publish Date - Oct 23 , 2025 | 04:40 AM

ప్రపంచ కప్‌లో ఇప్పటికే హ్యాట్రిక్‌ పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం...

India Women Face Crucial Battle: కఠిన సవాల్‌

నవీ ముంబై: ప్రపంచ కప్‌లో ఇప్పటికే హ్యాట్రిక్‌ పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో హర్మన్‌ప్రీత్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది. .ఈ మ్యాచ్‌ గెలిస్తే మన మహిళలకు సెమీఫైనల్‌ అవకాశాలు సులువు అవుతాయి. ఒక వేళ ఓడితే సమీకరణాలపై ఆధారపడాల్సివుంటుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ టాప్‌-3లో నిలిచి ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. మిగిలిన ఏకైక స్థానం కోసం భారత్‌, న్యూజిలాండ్‌ పోటీపడుతున్నాయి. ఇప్పుడు ఇరుజట్లకు చెరి రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకదాంట్లో ఇద్దరూ ముఖాముఖికి సిద్ధమవడంతో తాజా పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే, భారత్‌ తన తర్వాతి, ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించినా సెమీస్‌ చేరుతుంది. మరోవైపు సోఫీ డివైన్‌ సారథ్యంలోని కివీస్‌ జట్టు తమ చివరి పోరులో ఇంగ్లండ్‌ను ఓడించాల్సి ఉంటుంది. సోఫీతో పాటు సుజీ బేట్స్‌లాంటి స్టార్‌ బ్యాటర్లున్న ఆ జట్టు ఇప్పుడు భారత్‌ పోరుతో తమ అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకుంటోంది.

సమష్టిగా సత్తా చాటితేనే..

గత మూడు మ్యాచుల్లోనూ హర్మన్‌ సేన గెలుపు ముంగిట బోల్తా పడడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆఖర్లో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక చేజేతులా ఓటమిపాలైంది. అయితే స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. రిచా ఘోష్‌, దీప్తి శర్మ, అమన్‌జోత్‌ మెరుగ్గానే రాణిస్తున్నారు. కానీ.. ప్రతీకా రావల్‌, హర్లీన్‌ రాణించాలి. బౌలర్లలో క్రాంతి గౌడ, శ్రీచరణి, దీప్తి, స్నేహ్‌ రాణా ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే, గతమ్యాచ్‌లో అదనపు బౌలర్‌ కోసమని బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌పై వేటు వేసి రేణుకా సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ, రేణుక అంతగా ప్రభావం చూపలేకపోయింది. మరి, కివీస్‌తో పోరుకు ఇదే కాంబినేషన్‌ను కొనసాగిస్తారా? లేదంటే ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా జెమీమాకు అవకాశమిస్తారో.. చూడాలి.

Updated Date - Oct 23 , 2025 | 04:40 AM