ODI World Cup: బంగారు తల్లుల సువర్ణాధ్యాయం
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:24 AM
ఓ స్వప్నం సాకారమైందన్న కొండంత తృప్తి. అంతకుమించి గుండెల నిండుగా ఉప్పొంగే మాటలకందని ఆనందం! మన మహిళా క్రికెటర్లలో..
మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు
దక్షిణాఫ్రికాపై హర్మన్‌ప్రీత్ సేన అద్భుత విజయం
దీప్తి శర్మ, షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ షో.. కీలక వికెట్ తీసిన తెలుగమ్మాయి శ్రీ చరణి
ఓ స్వప్నం సాకారమైందన్న కొండంత తృప్తి. అంతకుమించి గుండెల నిండుగా ఉప్పొంగే మాటలకందని ఆనందం! మన మహిళా క్రికెటర్లలో.. మన దేశ కోటానుకోట్ల క్రికెట్ అభిమానుల్లోనూ! భారత మహిళల క్రికెట్ పరంగా మరో చరిత్ర. తొలిసారిగా కపిల్‌సేన కప్పు కొట్టిన ప్పుడు 1983కు ముందు, తర్వాత అని భారత క్రికెట్‌ను నిర్వచించినట్లుగానే భారత మహిళల జట్టుకు ఇప్పుడిక సరికొత్త అధ్యాయమే. ఆలస్యమైనా భారత అమ్మాయిలు అద్భుతమే చేశారు. ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. వన్డే క్రికెట్‌లో మొట్టమొదటిసారిగా విశ్వవిజేతగా ఆవిర్భవించారు. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తుదిపోరులో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. తన పాత్రకు తగ్గట్టే బ్యాటు, బంతితో అదరగొట్టడం.. చిచ్చరపిడుగు షెఫాలీ బ్యాటుతోనే కాకుండా బంతితోనూ మాయ చేయడం ఈ ఫైనల్లో హైలెట్! టాస్ ఓడినా గత రెండు ఫైనల్స్‌కు భిన్నంగా తొలుత బ్యాటింగ్ చేయడం అద్భుతంగా కలిసొచ్చింది. షెఫాలీ, స్మృతి శతక భాగస్వామ్యంతో విజయానికి ఆదిలోనే గట్టి పునాది పడింది. ఈ పునాదే జట్టు స్కోరును ఏడు వికెట్లకు 298 పరుగుల దాకా తీసుకెళ్లింది. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల ఎదుట ఈ స్కోరు ఎవరెస్టే అయింది. సఫారీ గాళ్ లారా వోల్వార్ట్ సెంచరీ చేసినా ఆ జట్టు పరుగుల వేట 246కే పరిమితమైంది.