India Women Cricket: ఏమని వర్ణించగలం
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:37 AM
అద్భుతం..అమోఘం..అపూర్వం..అనన్య సామాన్యం..వన్డే ప్రపంచ కప్ నాకౌట్ నుంచి భారత జట్టు కనబరచిన ప్రదర్శనకు ఈ ఉపమానాలన్నీ సరిపోవేమో!
అద్భుతం..అమోఘం..అపూర్వం..అనన్య సామాన్యం..వన్డే ప్రపంచ కప్ నాకౌట్ నుంచి భారత జట్టు కనబరచిన ప్రదర్శనకు ఈ ఉపమానాలన్నీ సరిపోవేమో! ఆతిథ్య జట్టే అయినా మెగా టోర్నమెంట్ ప్రారంభంలో హర్మన్ సేనపై పెద్దగా అంచనాల్లేవు. పైగా ప్రపంచ కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌నూ టీమిండియా కోల్పోయింది. దాంతో సొంతగడ్డపై జరుగుతున్నా..వరల్డ్ కప్‌లో మన అమ్మాయిలను టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా క్రికెట్ పండితులు అంచనా వేయలేదు. అంతేకాదు మెగా టోర్నమెంట్‌లో భారత్ ప్రస్థానమూ సాఫీగా సాగలేదు. శ్రీలంక, పాకిస్థాన్‌లాంటి జట్లపై గెలుపొందినా..బలమైన టీమ్‌లకు ఎదురొడ్డలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లపై పరాజయాలు చవిచూసింది. ఈనేపథ్యంలో అసలు సెమీఫైనల్‌కు చేరగలమా అనే అనుమానాలు ఉదయించాయి. కానీ తరువాతి మ్యాచ్‌ల్లో పుంజుకుని సెమీ్‌సఫైనల్లోకి అడుగుపెట్టి.. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది. టోర్నమెంట్‌లో సెమీస్ ముందుకు వరకు టీమిండియా ఆట ఒక ఎత్తయితే నాకౌట్ నుంచి సాగిన భారత ఆట నిస్సందేహంగా మరో ఎత్తు ! కప్పు కల నెరవెరేందుకు కేవలం రెండడుగుల దూరంలో నిలిచిన మనోళ్లు ఆస్ట్రేలియాపై ఆకాశమే హద్దుగా విజృంభించారు. మహిళల క్రికెట్ చరిత్రలో నభూతో..అనే మ్యాచ్‌ను ఆవిష్కరించారు. ఆల్‌రౌండ్ షోతో ఏడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను పడగొట్టిన ఉత్సాహంతో ఫైనల్లోనూ ఉమెన్ ఇన్ బ్లూ అదరగొట్టారు. దక్షిణాఫ్రికా ఎదుట దాదాపు 300 పరుగుల లక్ష్యాన్ని ఉంచి మానసికంగా దెబ్బ కొట్టారు. కీలక బ్యాటర్లను త్వరగా పెవిలియన్ చేర్చి బౌలర్లు తమ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించారు. అయితే కెప్టెన్ వోల్వార్ట్ సెంచరీ ఇన్నింగ్స్‌తో గుబులు రేపినా అమన్‌జోత్ సూపర్ క్యాచ్‌తో ఆమె అవుట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో తిరుగులేని ప్రదర్శన కనబరచి విశ్వ విజేతలుగా నిలిచిన మన అమ్మాయిలకు హాట్సాఫ్..
భళా..శ్రీచరణి
ఆడిన తొలి ప్రపంచ కప్‌లోనే తెలుగమ్మాయి శ్రీచరణి సత్తా చాటింది. 21 ఏళ్ల ఈ లెఫ్టామ్ స్పిన్నర్ టోర్నీలో అన్ని మ్యాచ్‌ల్లో ఆడడం ఆమె ప్రతిభపై జట్టు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని సూచించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయని శ్రీచరణి మొత్తం 12 వికెట్లు తీసి భళా అనిపించింది. ముఖ్యంగా బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లతో మ్యాచ్‌ల్లో ఆమె విశేషంగా రాణించింది.

ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం