India women cricket: అమ్మాయిలు 5/5
ABN , Publish Date - Dec 31 , 2025 | 03:53 AM
హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 68) అర్ధ శతకంతోపాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీ్‌సను భారత మహిళల ....
ఐదో టీ20లోనూ లంక ఓటమి
హర్మన్ అర్ధ శతకం
తిరువనంతపురం: హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 68) అర్ధ శతకంతోపాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీ్‌సను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. మంగళవారం జరిగిన ఐదో, ఆఖరి టీ20లో భారత్ 15 పరుగుల తేడాతో లంకపై గెలిచింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది. అరుంధతి (11 బంతుల్లో 27 నాటౌట్), అమన్‌జోత్ కౌర్ (21) దూకుడుగా ఆడారు. కవిష, రష్మిక, చమరి తలో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 160/7 స్కోరు మాత్రమే చేసింది. హాసిని పెరీరా (65), ఇమేషా దులానీ (50) హాఫ్ సెంచరీలు వృథా అయ్యాయి. అమన్‌జోత్, శ్రీచరణి, దీప్తి శర్మ, అరుంధతి తలో వికెట్ దక్కించుకొన్నారు. ఓపెనర్ చమరి ఆటపట్టు (2)ను అరుంధతి రెండో ఓవర్‌లోనే అవుట్ చేసింది. కానీ, మరో ఓపెనర్ హాసిని, దులానీ రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యంతో లంకను గెలుపు బాటలో నిలిపారు. అయితే, 12వ ఓవర్‌లో దూకుడుగా ఆడుతున్న ఇమేషాను అమన్‌జోత్ పెవిలియన్ చేర్చడంతో.. భారత్ మ్యాచ్‌లోకి వచ్చింది. హాసినిని శ్రీచరణి వెనక్కి పంపడంతో లంక ఆశలు ఆవిరయ్యాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా హర్మన్, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీ్‌స’గా షఫాలీ నిలిచారు.
తడబడి.. నిలబడి..: టాపార్డర్ విఫలమైనా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అర్ధ శతకంతోపాటు డెత్ ఓవర్లలో అరుంధతి మెరుపులు మెరిపించడంతో భారత్ గ్రాండ్‌గా ముగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టిదెబ్బ తగిలింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (5), స్మృతి స్థానంలో అరంగేట్రం చేసిన కమలిని (12), హర్లీన్ డియోల్ (13) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. రిచా, దీప్తీ శర్మ (7)ను ఆటపట్టు అవుట్ చేయడంతో భారత్ 77/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అమన్‌జోత్ సహకారంతో హర్మన్ స్కోరు బోర్డును నడిపించింది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 38 బంతుల్లో 61 పరుగులు జోడించారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన హర్మన్.. ఆ తర్వాత బ్యాట్‌కు పని చెప్పింది. 15వ ఓవర్‌లో చమరి బౌలింగ్‌లో రెండు బౌండ్రీలు బాదిన హర్మన్.. ఫిఫ్టీ పూర్తి చేసుకొంది. ఆ తర్వాతి ఓవర్‌లో 6,4తో బ్యాట్ ఝుళిపించడంతో.. స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, అమన్‌జోత్‌ను రష్మిక.. హర్మన్‌ను కవిష అవుట్ చేశారు. కానీ, డెత్ ఓవర్లలో విరుచుకుపడిన స్నేహ్ రాణా (8 నాటౌట్), అరుంధతి.. ఎనిమిదో వికెట్‌కు కేవలం 14 బంతుల్లోనే 33 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్‌లో అరుంధతి మూడు ఫోర్లు, సిక్స్‌తో 20 పరుగులు రాబట్టడంతో.. టీమ్ స్కోరు 175 మార్క్‌ను అందుకొంది.