Indian Hockey Team: ఆసియాను గెలిచి.. ప్రపంచ బెర్త్ పట్టేసి..
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:58 AM
ఆసియా కప్ ఆరంభం నుంచి తుది వరకు తిరుగులేని ఆటను ప్రదర్శించిన భారత హాకీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. దాంతో ఎనిమిదేళ్ల విరామం తర్వాత ట్రోఫీని ముద్దాడింది.
భారత్‌దే ఆసియా కప్ హాకీ
ఫైనల్లో కొరియా చిత్తు
ఒక దెబ్బకు రెండు పిట్టలు!అవును..ఆసియా కప్ ఫైనల్లో విజయ కేతనం ఎగురవేసి ట్రోఫీని అందుకున్న భారత హాకీ జట్టు.. ఈ గెలుపుతో ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ బెర్త్‌నూ దక్కించుకుంది. ప్రపంచ కప్ వచ్చే ఏడాది నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా జరగనుంది. ఆదివారం జరిగిన ఆసియా కప్‌తుదిపోరులో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను భారత్ చిత్తు చేసింది. తద్వారా అపజయమే ఎరుగకుండా టోర్నమెంట్‌ను ముగించిన ఘనతనూ సొంతం చేసుకుంది.
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా కప్ ఆరంభం నుంచి తుది వరకు తిరుగులేని ఆటను ప్రదర్శించిన భారత హాకీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. దాంతో ఎనిమిదేళ్ల విరామం తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో 4-1తో దక్షిణ కొరియాపై ఘన విజయం సాధించిన మనోళ్లు నాలుగోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దిల్‌ప్రీత్ సింగ్ (28వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో చెలరేగగా, సుఖ్‌జీత్ సింగ్ (ఒకటో నిమిషం), అమిత్ రోహిదాస్ (50వ) చెరో గోల్ కొట్టారు. డెయిన్ సన్ (51వ) కొరియా తరపున ఏకైక గోల్ సాధించాడు. ఈ విజయంతో టీమిండియా.. వచ్చే ఏడాద్టి ఆగస్టు 14 నుంచి నెదర్లాండ్స్, బెల్జియం దేశాల్లో జరిగే ఎఫ్‌ఐహెచ్ ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించింది.
ఆరంభం నుంచే ఆధిపత్యం: కిక్కిరిసిన స్టేడియంలో అభిమానులు ‘భారత్..భారత్’ అని ప్రోత్సహిస్తుండగా..టైటిల్ ఫైట్‌లో ఆరంభంనుంచే భారత్ ఆధిపత్యం చెలాయించింది. డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్లు, ఫార్వర్డ్‌లు చక్కటి సమన్వయంతో కొరియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆట మొదలైన 30వ సెకనులోనే హర్మన్‌ప్రీత్ నుంచి వచ్చిన పాస్‌ను సుఖ్‌జీత్ రివర్స్ హిట్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆపై మనోళ్లకు పెనాల్టీ స్ర్టోక్ లభించినా..జుగ్‌రాజ్ షాట్‌ను కొరియా గోల్‌కీపర్ కిమ్ అడ్డుకున్నాడు. ఇక..28వ నిమిషంలో సంజయ్ అందించిన పాస్‌ను ప్రత్యర్థి కీపర్ కాళ్ల కిందనుంచి దిల్‌ప్రీత్ కొట్టిన గోల్ అద్భుతమని చెప్పాలి. ప్రథమార్థాన్ని మనోళ్లు రెండు గోల్స్‌తో ముగించారు. మూడో క్వార్టర్‌లో కొరియాకు వెనువెంటనే రెండు పెనాల్టీ కార్నర్లు దక్కినా..భారత డిఫెండర్లు వాటిని వమ్ము చేశారు. ఇదే క్వార్టర్‌లో దిల్‌ప్రీత్ చేసిన గోల్‌తో భారత్ ఆధిక్యం 3-0కి పెరిగింది. చివరి క్వార్టర్ ఆరంభంలో కొరియా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ రోహిదాస్ మరో గోల్ అందించాడు. మ్యాచ్ చివరి నిమిషాల్లో లభించిన పెనాల్టీ కార్నర్ ద్వారా కొరియా ఓదార్పు గోల్ సాధించింది. కాగా..చైనాను 3-0తో ఓడించిన మలేసియా మూడో స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌పై 6-1తో నెగ్గిన జపాన్‌పై ఐదో స్థానం దక్కించుకుంది.