Share News

Ind Wins Asia Cup: పాక్‌తో ఉత్కంఠ పోరు.. ఆసియా కప్ భారత్ సొంతం

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:28 AM

ఆసియా కప్‌‌ భారత్ సొంతమైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్స్‌లో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఐదు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.

Ind Wins Asia Cup: పాక్‌తో ఉత్కంఠ పోరు.. ఆసియా కప్ భారత్ సొంతం
India wins Asia Cup 2025

ఇంటర్నెట్ డెస్క్: ఉత్కంఠ భరింతగా సాగిన ఆసియా కప్‌ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దుబాయ్ స్టేడియం వేదికగా పాక్‌తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచింది. పాక్ నిర్దేశించిన 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని (19.1 ఓవర్లకు ఆలౌట్) ఐదు వికెట్‌ల తేడాతో భారత్ దిగ్విజయంగా ఛేదించింది. మొదట్లోనే అభిషేక్ శర్మ, సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్‌ను కోల్పోయి చిక్కుల్లో పడిన భారత్‌ను విజయ తీరాలకు చేర్చడంలో తిలక్ వర్మ కీలకంగా వ్యవహరించాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి మర్చిపోలేని విజయాన్ని అందించాడు. తిలక్‌‌తో కలిసి సంజూ శాంసన్ (24), దూబే (33) కీలక భాగస్వామ్యాల్ని నెలకొల్పారు. సరైన సమయంలో దూబే బౌండరీలు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ బౌలర్‌లలో ఫహీమ్ అష్రాఫ్ మూడు వికెట్లు, అబ్రార్ అహ్మద్, షహీన్ అఫ్రీదీ చెరో వికెట్ తీశారు (India Wins Asia Cup).


మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్ 146 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా (57), ఫకార్ జమాన్(46) రాణించారు. మొదట్లో పటిష్ఠ స్థితిలో కనిపించిన పాక్ మిడిల్ ఓవర్స్‌లో భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 146 పరుగులకే చతికిల పడింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ ఏకంగా 4 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. పాక్ జట్టులో ఫర్హాన్, ఫకార్, సైమ్ (14) మాత్రమే రెండంకెల పరుగులు చేయగలిగారు.

Updated Date - Sep 29 , 2025 | 12:33 AM