Asia Cup India Vs Pak Toss: మొదలైన ఉత్కంఠ పోరు.. టాస్ గెలిచిన భారత్
ABN , Publish Date - Sep 28 , 2025 | 07:38 PM
ఆసియా కప్ ఫైనల్స్ పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభమైంది. తొలిసారిగా ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్, పాక్ తలపడనున్నాయి. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్, హ్యాండ్ షేక్ వివాదం నడుమ రెండు జట్లు తుదిపోరుకు సిద్ధమయ్యాయి. అయితే, టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది (India Won the Toss Chose to Bowl). ఈసారి హార్దిక్ పాండ్య, అర్షదీప్ సింగ్, హర్షిత్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. వారి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే, రింకూ సింగ్ బరిలోకి దిగారు.
టీమిండియా తుది జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబె, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి,
పాక్ టీం: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫకార్ జమాన్, సయిమ్ అయూబ్, హుస్సెయిన్ తలాత్, మొహమ్మద్ హ్యారిస్, మొహమ్మద్ నవాజ్, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రీదీ
టీమిండియా ఎప్పటిలాగే తన సైలెంట్ బాయ్‌కాట్‌ను కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. మ్యాచ్‌కు ముందు కప్‌తో కలిసి ఇరు జట్ల కెప్టెన్లు ఫొటో దిగాల్సి ఉండగా సూర్యకుమార్ మాత్రం హాజరు కాలేదు. కేవలం పాక్ కెప్టెన్ కప్ పక్కన నిలబడి ఫొటోకు ఫోజులిచ్చాడు. టాస్ సమయంలో ఎప్పటిలాగే ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు.
ఈ మ్యాచ్‌కు రిచీ రిచర్డ్‌సన్ మ్యాచ్ రిఫరీగా ఉండనున్నారు. దుబాయ్ పిచ్ మందకొడిగా ఉండటంతో ఛేదనకు అనుకూలమని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో భారత్. పాక్‌లు 15 సార్లు తలపడగా భారత్ 11 సార్లు విజయం సాధించింది. అయితే, ఫైనల్స్ మ్యాచ్‌ల్లో పాక్ పలు మార్లు దూకుడు పెంచి ఫలితాలును తారుమారు చేసింది. ఇక మ్యాచ్లో పలు రికార్డులు బద్దలుకానున్నాయి. అభిషేక్ శర్మ 11 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డును అధిగమిస్తాడు. మల్టీ నేషన్ టీ20 టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డును బద్దలుకొట్టే ఛాన్సుంది.
ఇదిలా ఉంటే భారత్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు పాక్ క్రీడాకారులకు పీసీబీ చైర్మన్ మోహసీన్ నఖ్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మైదానంలోనూ, బయటా ఎక్కడా తగ్గకుండా దూకుడు ప్రదర్శించాలని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పినట్టు సమాచారం. ఇక దయాది దేశాల తుది పోరు వీక్షించేందుకు స్టేడియంకు జనాలు పోటెత్తారు. అభిమానులతో స్టేడియం నిండిపోయి వాతావరణం కోలాహలంగా ఉంది. విజయం ఎవరిదో అన్న ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది.