Junior Mens Hockey World Cup: కుర్రాళ్ల ఘన బోణీ
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:10 AM
ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో ఆతిథ్య భారత్ తనదైన స్టయిల్లో బోణీ చేసింది. శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో ఫేవరెట్ భారత్...
చిలీపై భారత్ గెలుపు
హాకీ ప్రపంచ కప్
మధురై: ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో ఆతిథ్య భారత్ తనదైన స్టయిల్లో బోణీ చేసింది. శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో ఫేవరెట్ భారత్ 7-0 తేడాతో చిలీని చిత్తుచేసింది. గ్రూప్-బిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ ఆరంభం నుంచే అద్భుత జోరు చూపిన భారత ఆటగాళ్లు.. ఆద్యంతం ప్రత్యర్థిని దీటుగా కట్టడి చేశారు. చిలీకి ఒక్క గోల్‌కు కూడా అవకాశమివ్వకుండా చెలరేగారు. రోషన్ కుజుర్ (16వ, 21వ నిమిషాల్లో), దిల్‌రాజ్ సింగ్ (25వ, 34వ) చెరో రెండు గోల్స్‌తో విజృంభించగా.. అజీత్ యాదవ్ (35వ), అన్మోల్ ఎక్కా (48వ), కెప్టెన్ రోహిత్ (60వ) తలో గోల్ చేశారు. భారత్ తన రెండో మ్యాచ్‌ను శనివారం ఒమన్‌తో ఆడనుంది. ఇక, మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ 4-0తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్ పూల్-ఎలో ఐర్లాండ్ 4-3తో కెనడాపై విజయం సాధించింది. ఓ దశలో 1-4తో వెనుకంజలో నిలిచినా, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొన్న కెనడా.. రెండు గోల్స్ చేసి ప్రత్యర్థి ఆధిక్యాన్ని కొంతైనా తగ్గించింది. పూల్-డిలో స్పెయిన్ 8-0తో ఈజిప్టుపై, బెల్జియం 12-1తో నమీబియాపై గెలుపొందాయి.