Share News

National Sports Governance Bill: జాతీయ క్రీడా పాలన బిల్లు.. క్రీడా రంగంలో మేలి మలుపు

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:36 AM

దేశ క్రీడా రంగాన్ని సమూలంగా మార్చే దిశగా కీలక ముందడుగు పడింది. ‘జాతీయ క్రీడా పాలన బిల్లు’ను కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్య బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

National Sports Governance Bill: జాతీయ క్రీడా పాలన బిల్లు.. క్రీడా రంగంలో మేలి మలుపు

  • విస్తృత అధికారాలతో ఎన్‌ఎ్‌సబీ

  • వివాదాల పరిష్కారానికి జాతీయ స్పోర్ట్స్‌ ట్రైబ్యునల్‌

  • లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశ క్రీడా రంగాన్ని సమూలంగా మార్చే దిశగా కీలక ముందడుగు పడింది. ‘జాతీయ క్రీడా పాలన బిల్లు’ను కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్య బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు దేశ క్రీడా రంగంలో మరింత జవాబుదారీతనం ఉండేలా నేషనల్‌ స్పోర్ట్స్‌ బోర్డు (ఎన్‌ఎ్‌సబీ) ఏర్పాటు కానుంది. జాతీయ క్రీడా పాలన బిల్లు చట్టంగా మారాక..అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎ్‌సఎ్‌ఫ)లు ఎన్‌ఎస్‌బీ నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుంది.


నేషనల్‌ స్పోర్ట్స్‌ ట్రైబ్యునల్‌..

నేషనల్‌ స్పోర్ట్స్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌ఎ్‌సటీ) ఏర్పాటుకు కూడా ప్రతిపాదన చేశారు. ఈ ట్రైబ్యునల్‌కు సివిల్‌ కోర్టు అధికారాలుంటాయి. సమాఖ్యల ఎన్నికలు, అథ్లెట్ల ఎంపికల్లో వివాదాలను ఈ బోర్డు పరిష్కరిస్తుంది. ట్రైబ్యునల్‌ నిర్ణయాలను సుప్రీంకోర్టులోనే సవాలు చేయాల్సి ఉంటుంది.

70 ఏళ్లు దాటినా కొనసాగొచ్చు..

క్రీడా సమాఖ్యల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయస్సు పరిమితిలో సడలింపులకు కొత్త బిల్లు వీలు కల్పించింది. ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి వయసు 70 దాటకూడదు. అయితే, ఆయా సమాఖ్యల అంతర్జాతీయ కమిటీల నిబంధనలు అనుమతిస్తే 70 నుంచి 75 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు పదవిలో కొనసాగొచ్చు.

ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ..

భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ)తోపాటు గుర్తింపు పొందిన అన్ని క్రీడా సమాఖ్యలు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రానున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోనందున తమకు ఆర్టీఐ వర్తించదని బీసీసీఐ ఎంతో కాలంగా వాదిస్తూ వస్తోంది. 2028 లాస్‌ఎంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఒలింపిక్‌ ఉద్యమంలోకి బీసీసీఐ వచ్చినట్టేనని, అందువల్ల కొత్త బిల్లు నిబంధనలను పాటించాల్సిందేనని క్రీడా శాఖ స్పష్టంజేసింది. నేషనల్‌ స్పోర్ట్స్‌ ఎలక్షన్‌ ప్యానెల్‌ ఏర్పాటుకూ బిల్లులో ప్రతిపాదించారు. జాతీయ లేదా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మాజీ సభ్యులు, లేదా రాష్ట్రాల మాజీ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారులు, మాజీ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లను ప్యానెల్‌లో నియమిస్తారు.


నాడా చట్టానికి సవరణ..

జాతీయ డోపింగ్‌ నిరోధక (నాడా) చట్టం సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ సూచనల మేరకు నాడా చట్టానికి సవరణలు చేశారు.

ఎన్నికల్లేకుంటే గుర్తింపు రద్దే..

ఎన్నికలు నిర్వహించని క్రీడా సమాఖ్యల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్‌ఎ్‌సబీ కలిగి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగినా గుర్తింపును రద్దు చేస్తారు. వార్షిక లెక్కలు సమర్పించకపోయినా, నిధుల దుర్వినియోగం చేసినా ఎన్‌ఎస్‌బీ చర్యలు తీసుకుంటుంది.

Updated Date - Jul 24 , 2025 | 04:36 AM