Share News

Series Decider: సిరీస్‌ నీదా..నాదా?

ABN , Publish Date - Dec 06 , 2025 | 03:57 AM

భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆసక్తికర మూడు వన్డేల సిరీ్‌సకు విశాఖ సాగర తీరం ముగింపు ఇవ్వబోతోంది. తొలి రెండు మ్యాచ్‌లు భారీ స్కోర్లతో అభిమానులను ఉర్రూతలూగించగా...

Series Decider: సిరీస్‌ నీదా..నాదా?

  • టీమిండియాపైనే ఒత్తిడి

  • ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికా

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆసక్తికర మూడు వన్డేల సిరీ్‌సకు విశాఖ సాగర తీరం ముగింపు ఇవ్వబోతోంది. తొలి రెండు మ్యాచ్‌లు భారీ స్కోర్లతో అభిమానులను ఉర్రూతలూగించగా, ఇరు జట్లు చెరొక విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో శనివారం జరిగే సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌కు స్థానిక ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే టెస్టు సిరీ్‌సను 0-2తో వైట్‌వాష్‌ అయిన భారత్‌పైనే మరోసారి ఒత్తిడి నెలకొంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌ను గెలిచి వన్డే సిరీ్‌సతో అభిమానులకు కాస్త ఉపశమనం ఇవ్వాలనుకుంటోంది. అటు దక్షిణాఫ్రికా రాయ్‌పూర్‌లో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి జోష్‌లో ఉంది. అందుకే మరొక్క విజయంతో పరిమిత ఓవర్ల సిరీ్‌సను కూడా ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే 1986-87 తర్వాత స్వదేశంలో భారత్‌ టెస్టు, వన్డే సిరీ్‌సలను కలిపి ఒక్కసారి కూడా కోల్పోలేదు. దీంతో ఆఖరి పోరులో ఎవరిది పైచేయో తేల్చుకునేందుకు ఇరు జట్లూ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.

రోహిత్‌, విరాట్‌పై భారం: సిరీ్‌సను వశం చేసుకునేందుకు భారత జట్టు మరోసారి వెటరన్లు రోహిత్‌, విరాట్‌లపైనే ఆధారపడింది. ముఖ్యంగా విరాట్‌ తన చివరి మూడు వన్డేల్లో ఓ ఫిఫ్టీ, రెండు సెంచరీలతో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో పాటు విశాఖలో సైతం తనకు అదిరే రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ఏడు వన్డేల్లో మూడు శతకాలు సాధించగా.. సగటు 97.83గా ఉండడం విశేషం. దీంతో తనకు అచ్చొచ్చిన గ్రౌండ్‌లో మరో సెంచరీతో హ్యాట్రిక్‌ను పూర్తి చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అటు రోహిత్‌ తన చివరి నాలుగు వన్డేల్లో ఓ సెంచరీ, రెండు ఫిఫ్టీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఓపెనర్‌ జైస్వాల్‌ అటు బ్యాటింగ్‌, ఇటు ఫీల్డింగ్‌లో నిరాశపరుస్తున్నాడు. లెఫ్టామ్‌ పేసర్లను సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నాడు. రుతురాజ్‌ శతకంతో ఫామ్‌ను చాటుకోవడం సానుకూలాంశం. మిడిలార్డర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ ఫామ్‌లేమిపై జట్టు ఆందోళనగా ఉంది. అతడి స్థానంలో తిలక్‌ వర్మను ఆడిస్తే బ్యాటింగ్‌ బలోపేతం కావడంతో పాటు అదనపు స్పిన్నర్‌గా, అద్భుత ఫీల్డర్‌గానూ ఉపయోగపడగలని కోచ్‌ గంభీర్‌ భావిస్తున్నాడు. పంత్‌ కూడా పోటీలో ఉన్నాడు. ఇక పేస్‌లో అర్ష్‌దీప్‌ మినహా ప్రసిద్ధ్‌, హర్షిత్‌ ధారాళంగా పరుగులిచ్చుకుంటున్నారు. నేటి మ్యాచ్‌లో పేసర్లు విశేషంగా రాణిస్తేనే ఫలితం ఉంటుంది.


తుది జట్లు (అంచనా)

భారత్‌: యశస్వీ జైస్వాల్‌, రోహిత్‌, కోహ్లీ, రుతురాజ్‌, రాహుల్‌ (కెప్టెన్‌), సుందర్‌/తిలక్‌, జడేజా, హర్షిత్‌, కుల్దీప్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌. దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌, డికాక్‌, బవుమా (కెప్టెన్‌), బ్రీట్‌స్కే, రికెల్టన్‌, బ్రెవిస్‌, యాన్సెన్‌, బాష్‌, కేశవ్‌, ఎన్‌గిడి, బార్ట్‌మన్‌.

పిచ్‌, వాతావరణం

మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో ఇక్కడ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్‌ టీమ్‌ గెలిచింది. పిచ్‌ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేల మాదిరే ఇక్కడ కూడా మంచు కీలక ప్రభావం చూపనుంది. దీంతో టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ వైపు మొగ్గు చూపవచ్చు. మ్యాచ్‌కు వర్షం సూచన లేదు.

సుందర్‌ను బౌలర్‌గానే పరిగణించాలి: అశ్విన్‌

చెన్నై: భారత జట్టులో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను ప్రధాన బౌలర్‌గానే చూడాలని మాజీ స్పిన్నర్‌ అశ్విన్‌ సూచించాడు. ఈ సిరీ్‌సలో ఏడు ఓవర్లు మాత్రమే వేసిన వాషింగ్టన్‌.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే ప్రస్తుతం జట్టులో అతడిని బ్యాటర్‌గా పరిగణిస్తూ, కొద్ది ఓవర్లు మాత్రమే వేయిస్తున్నారని అశ్విన్‌ చెప్పాడు. దీంతో జట్టులో తన పాత్రేమిటో సుందర్‌కు అర్థం కాకుండా పోతున్నదన్నాడు.

గాయాల బెడద

తొలి వన్డేలో విజయం దరిదాపుల్లోకి వచ్చి, రెండో వన్డేలో భారీ ఛేదనను విజయవంతంగా ముగించిన పర్యాటక దక్షిణాఫ్రికా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే పేసర్‌ బర్గర్‌, బ్యాటర్‌ డి జోర్జి తొడ కండరాలు పట్టేయడంతో రెండో వన్డేలో మైదానం వీడారు. వారి ఫిట్‌నె్‌సపై స్పష్టత లేకపోయినా.. ఈ కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. జోర్జి స్థానంలో రికెల్టన్‌ ఆడే చాన్సుంది. మార్‌క్రమ్‌ అదరగొడుతున్నా, మరో ఓపెనర్‌ డికాక్‌ సిరీ్‌సలో ఏమాత్రం రాణించలేకపోయాడు. చివరి మ్యాచ్‌లోనైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు. బ్రీట్‌స్కే, బ్రెవిస్‌ మిడిలార్డర్‌లో కీలకంగా మారారు. పేసర్‌ యాన్సెన్‌ ఆల్‌రౌండ్‌షో చూపుతున్నాడు. పేసర్‌ బర్గర్‌ స్థానంలో బార్ట్‌మన్‌కు అవకాశం దక్కవచ్చు.

Updated Date - Dec 06 , 2025 | 03:57 AM