Asia Ind Vs Pak: క్లిష్ట పరిస్థితుల్లో భారత్.. 4 వికెట్లు డౌన్
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:19 PM
ఛేదనకు దిగిన భారత్ తొలి దశలోనే కీలక ఓపెనర్లను కోల్పోయి చిక్కుల్లో పడింది. 12 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 78 పరుగులే చేయగలిగింది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి ఆత్మవిశ్వాసంతో ఛేదనకు దిగిన భారత్ ఆదిలోనే తడబడింది. కీలక వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడిపోయింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ (5) ఔటయ్యాడు. ఫహీమ్ అష్రఫ్ వేసిన బంతిలో (1.1) రవూఫ్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే సూర్యకుమార్ కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే వెను దిగడంతో భారత్ డిఫెన్స్‌లో పడిపోయింది. షహీన్ వేసిన ఓవర్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి ఆఘాకు దొరికిపోయాడు. శుభ్‌మన్ గిల్‌ను కూడా ఫహీమ్ (3.6 ఓవర్‌లో) పెవిలియన్ బాట పట్టించడంతో భారత్ క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది. కీలకమైన ముగ్గురు బ్యాటర్లను మొదట్లోనే కోల్పోయి చిక్కుల్లో పడింది. తరువాత క్రీజ్‌లోకొచ్చిన తిలక్, శాంసన్ ఇన్నింగ్స్‌ను చక్క దిద్దేందుకు నడుం బిగించారు. ఆచితూచి ఆడుతూ మెల్లగా పరుగులు రాబడుతూ భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించారు.
అయితే, శాంసన్ దూకుడు పెంచుతున్న తరుణంలో వికెట్ పోగొట్టుకోవడంతో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అబ్రార్ అహ్మద్ వేసిన బంతికి (12.2) షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఫర్హాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా సడెన్‌గా భారత్ రక్షణాత్మక ధోరణిలో పడిపోవడంతో పరుగుల వరదకు బ్రేకులు పడ్డాయి. ఫలితంగా 13 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 78 పరుగులే చేయగలిగింది. విజయం కోసం భారత్ తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది.