India at Lords: విజయం అటా ఇటా
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:24 AM
లార్డ్స్ మైదానంలో బ్యాటింగ్ అంత సులువు కాదని నాలుగో రోజూ నిరూపితమైంది. ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడిన మాదిరే.. టీమిండియా కూడా అదే బాటన నడుస్తోంది. పరుగులు సాధించడం...
భారత్ లక్ష్యం 193
ప్రస్తుతం 58/4
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 192
స్పిన్నర్ సుందర్‌కు నాలుగు వికెట్లు
లార్డ్స్ మైదానంలో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ఒక్కో బంతికి ఏం జరుగుతుందోనని ఊపిరి బిగపట్టి చూడాల్సిన పరిస్థితి.. భారత బౌలర్ల ప్రతాపానికి ఆతిథ్య ఇంగ్లండ్‌ను 200ల్లోపే కట్టడి చేశామనే ఆనందం క్రమేపీ ఆవిరవుతోంది. ఎందుకంటే.. ఛేదనలో గిల్ సేన కనీసం 60 పరుగులైనా చేయకముందే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక చివరి రోజు సాధించాల్సిన 135 పరుగులే ఇప్పుడు కొండంత లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక భారమంతా రాహుల్, పంత్‌లపైనే..
లండన్: లార్డ్స్ మైదానంలో బ్యాటింగ్ అంత సులువు కాదని నాలుగో రోజూ నిరూపితమైంది. ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడిన మాదిరే.. టీమిండియా కూడా అదే బాటన నడుస్తోంది. పరుగులు సాధించడం కష్టంగా మారిన ఈ పిచ్‌పై భారత్ 193 పరుగుల ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. కానీ పేసర్ కార్స్ (2/11) ధాటికి ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ 17.4 ఓవర్లలో 4 వికెట్లకు 58 పరుగులు చేసింది. రాహుల్ (33 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. జట్టు ఇంకా 135 పరుగులు వెనుకంజలో ఉంది. దీంతో చివరి రోజు పంత్, నితీశ్, జడేజాల ఆటపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. స్టోక్స్, ఆర్చర్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. రూట్ (40), స్టోక్స్ (33) రాణించారు. స్పిన్నర్ సుందర్‌కు నాలుగు.. బుమ్రా, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
పేసర్ల తడాఖా: 2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు భారత పేసర్లు పరీక్ష పెట్టారు. పిచ్‌పై అనూహ్య బౌన్స్‌ను ఉపయోగించుకుంటూ కట్టడి చేశారు. దీంతో తొలి గంటలోనే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా నర్సరీ ఎండ్ నుంచి పేసర్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి డకెట్ (12), పోప్ (4)ల పనిబట్టాడు. సెషన్ ఐదో ఓవర్‌లోనే తను డకెట్‌ను అవుట్ చేయగా.. కాసేపటికి పోప్‌ను ఎల్బీగా వెనక్కిపంపాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా.. సిరాజ్ ఒత్తిడి మేరకు గిల్ రివ్యూ కోరాడు. రీప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రటించాడు. ఇక చక్కగా కుదురుకున్న ఓపెనర్ క్రాలే (22)ను నితీశ్ వెనక్కిపంపాడు. అయితే 50/3 స్కోరుతో కష్టాల్లో పడిన వేళ రూట్‌కు జత కలిసిన బ్రూక్ ఎదురుదాడికి దిగాడు. ఆకాశ్ ఓవర్‌లో తను 4,4,6తో 15 రన్స్ రాబట్టాడు. అయితే ఆకాశ్ ఫుల్ లెంగ్త్ డెలివరీని స్వీప్ షాట్ ఆడి బ్రూక్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత మూడు ఓవర్లకే జట్టు 98/4 స్కోరుతో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
సుందర్ మ్యాజిక్: రెండో సెషన్‌లో రూట్-స్టోక్స్ జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. పేసర్లు ఒత్తిడి పెంచినా వికెట్ తీయలేకపోయారు. దీంతో ఇద్దరూ క్రీజులో కుదురుకున్నారు. కెప్టెన్ గిల్ ఎట్టకేలకు 37వ ఓవర్ నుంచి స్పిన్నర్లను బరిలోకి దించాడు. సుందర్ పాత బంతితో మ్యాజిక్ చేస్తూ అత్యంత కీలకంగా మారిన ఈ జోడీకి బ్రేక్ వేశాడు. రూట్ స్వీప్ షాట్ ప్రయత్నంలో బౌల్డ్ కావడంతో ఐదో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యానికి చెక్ పడింది. కాసేపటికే స్మిత్ (8)ను సైతం సుందర్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఈ సెషన్‌లో 77 పరుగులు చేయగలిగింది. ఇక ఆఖరి సెషన్‌లో ఇంగ్లండ్ ఒక్కసారిగా తడబడింది. సుందర్ ఓవర్‌లో స్వీప్‌కు వెళ్లి స్టోక్స్ వెనుదిరిగాడు. ఇక బుమ్రా తన వరుస ఓవర్లలో కార్స్ (1), వోక్స్ (10)లను బౌల్డ్ చేయగా.. సుందర్ ఆఖరి వికెట్‌ను తీసి ప్రత్యర్థిని 200లోపే కట్టడి చేశాడు.
తడబాటుతో ఆరంభం: లక్ష్య ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ సాఫీగా ఏమీ సాగలేదు. రెండో ఓవర్‌లోనే జైస్వాల్‌ను పేసర్ ఆర్చర్ డకౌట్ చేశాడు. ఈ దశలో రాహుల్‌కు జతగా కరుణ్ కాసేపు క్రీజులో నిలిచాడు. అటు రాహుల్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు పెంచాడు. కానీ మరో ఎండ్‌లో వికెట్ల పతనం సాగింది. పేసర్ కార్స్ తన వరుస ఓవర్లలో కరుణ్, గిల్ (6) వికెట్లను తీసి భారత్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. ఇక సెషన్ ఆఖరి ఓవర్‌లో ఆకాశ్ (1)ను బౌల్డ్ చేసిన స్టోక్స్ గట్టి ఝలకే ఇచ్చాడు.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387;
భారత్ తొలి ఇన్నింగ్స్: 387;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలే (సి) జైస్వాల్ (బి) నితీశ్ 22; డకెట్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 12; పోప్ (ఎల్బీ) సిరాజ్ 4; రూట్ (బి) సుందర్ 40; బ్రూక్ (బి) ఆకాశ్ 23; స్టోక్స్ (బి) సుందర్ 33; స్మిత్ (బి) సుందర్ 8; వోక్స్ (బి) బుమ్రా 10; కార్స్ (బి) బుమ్రా 1; ఆర్చర్ (నాటౌట్) 5; బషీర్ (బి) సుందర్ 2; ఎక్స్‌ట్రాలు: 32; మొత్తం: 62.1 ఓవర్లలో 192 ఆలౌట్; వికెట్ల పతనం: 1-22, 2-42, 3-50, 4-87, 5-154, 6-164, 7-181, 8-182, 9-185, 10-192; బౌలింగ్: బుమ్రా 16-3-38-2; సిరాజ్ 13-2-31-2; నితీశ్ 5-1-20-1; ఆకాశ్ 8-2-30-1; జడేజా 8-1-20-0; సుందర్ 12.1-2-22-4.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్మిత్ (బి) ఆర్చర్ 0; రాహుల్ (బ్యాటింగ్) 33; కరుణ్ (ఎల్బీ) కార్స్ 14; గిల్ (ఎల్బీ) కార్స్ 6; ఆకాశ్ (బి) స్టోక్స్ 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 17.4 ఓవర్లలో 58/4. వికెట్ల పతనం: 1-5, 2-41, 3-53, 4-58; బౌలింగ్: వోక్స్ 5-2-11-0; ఆర్చర్ 4-0-18-1; స్టోక్స్ 4.4-0-15-1; కార్స్ 4-1-11-2.
1
టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడుగురిని బౌల్డ్ చేయడం.. అలాగే ఓ టెస్టు మ్యాచ్‌లో ఎక్కువ మంది (12) బ్యాటర్లను బౌల్డ్ చేయడం కూడా భారత్‌కిదే తొలిసారి.
1
ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎక్కువ పరుగులు (607) సాధించిన బ్యాటర్‌గా గిల్. ద్రవిడ్ (2002లో 602 రన్స్)ను అధిగమించాడు.

సిరాజ్‌కు జరిమానా తప్పదా?
ఆదివారం తొలి సెషన్ ఆరంభంలో ఫుల్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్ వెనుదిరిగాడు. అయితే ఈ వికెట్ తీసిన ఆనందంలో పేసర్ సిరాజ్ దూకుడుగా వ్యవహరించాడు. గట్టిగా అరుచుకుంటూ డకెట్ మొహం దగ్గరి దాకా వచ్చి మరీ ఆగ్రహంగా చూస్తూ.. అతడి భుజాన్ని ఢీకొడుతూ వెళ్లాడు. అయితే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధన 2.5 ప్రకారం.. సిరాజ్ ప్రవర్తన రెచ్చగొట్టే విధంగా ఉండడంతో మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశం ఉంది.