India Eyes Victory: ఎవరో లార్డ్స్ కింగ్
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:22 AM
తొలి టెస్ట్‌లో ఓటమితో తీవ్ర ఒత్తిడి.. మ్యాచ్‌ను మలుపుతిప్పగల బుమ్రాకు విశ్రాంతి.. ఈ పరిస్థితుల్లో భారత జట్టు పుంజుకోవడం కష్టమేనన్న విమర్శలు..! అయితే, శుభ్‌మన్ గిల్ సేన రెండో టెస్ట్‌లో...
నేటి నుంచి మూడో టెస్ట్
మ. 3.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
ఫుల్‌జో్‌షలో భారత్
బుమ్రా ఎంట్రీ ఖరారు
పుంజుకోవాలని ఇంగ్లండ్
తుదిజట్టులోకి ఆర్చర్
లండన్: తొలి టెస్ట్‌లో ఓటమితో తీవ్ర ఒత్తిడి.. మ్యాచ్‌ను మలుపుతిప్పగల బుమ్రాకు విశ్రాంతి.. ఈ పరిస్థితుల్లో భారత జట్టు పుంజుకోవడం కష్టమేనన్న విమర్శలు..! అయితే, శుభ్‌మన్ గిల్ సేన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయాన్ని దక్కించుకొంది. గిల్ సూపర్ బ్యాటింగ్.. పేసర్ ఆకాశ్‌దీ్‌ప అద్భుత బౌలింగ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సను 1-1తో సమం చేసి ప్రత్యర్థితో ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరింది. ఇదే జోష్‌లో గురువారం నుంచి ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగే మూడో టెస్ట్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. బుమ్రా రీఎంట్రీతో.. తడబడుతున్న ఇంగ్లండ్‌కు కఠిన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. నయా కెప్టెన్ గిల్ సారథ్యంలోని యువ భారత్.. లీడ్స్‌లోనూ పైచేయి సాధించినా కీలక సమయంలో క్యాచ్‌లు చేజార్చడం జట్టుకు శాపంగా మారింది. కానీ, దీని నుంచి వేగంగా పాఠాలు నేర్చిన భారత్.. రెండో టెస్ట్‌లో ప్రతి సెషన్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బ్యాట్‌తో చెలరేగిన గిల్ అండ్ కో కొండంత స్కోర్లు చేయడంతో.. ప్రత్యర్థి కెప్టెన్ బెన్ స్టోక్స్ జీవమున్న పిచ్ కోసం డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో లార్డ్స్‌లో సీమ్ బౌలర్లకు అనుకూలించే పిచ్‌ను రూపొందించే విధంగా ఒత్తిడి చేశారని సమాచారం. మరోవైపు బుమ్రా రాకతో ఇంగ్లండ్ బ్యాటర్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కరుణ్ నాయర్ వైఫల్యం మినహా భారత బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ఆందోళనకర పరిస్థితులు లేవు. గిల్ సూపర్ ఫామ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. జైస్వాల్, రాహుల్, పంత్, జడేజా రాణిస్తుండడం శుభపరిణామం. గత మ్యాచ్‌లో పేసర్లు ఆకాశ్‌దీ్‌ప, సిరాజ్ రాణించగా.. ధారాళంగా పరుగులిచ్చిన ప్రసిద్ధ్ కృష్ణను బుమ్రా కోసం పక్కనపెట్టే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్లుగా జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్‌ను కొనసాగించే చాన్సులున్నాయి.
ఆర్చర్ రాక..:
మరోవైపు రెండో టెస్టులో భారీ ఓటమితో ఇంగ్లండ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓపెనర్లు క్రాలే, డకెట్ వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రూట్ కూడా ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేక పోతున్నాడు. ఆల్‌రౌండర్ స్టోక్స్ బంతితో ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాట్‌తో తేలిపోతున్నాడు. అయితే, బ్రూక్, జేమీ స్మిత్ టచ్‌తో ఉండడం కొంత ఊరటనిచ్చే అంశం. నాలుగేళ్ల తర్వాత జోఫ్రా ఆర్చర్ టీమ్‌లోకి రావడంతో బౌలింగ్ కొంత మెరుగుపడే అవకాశం ఉంది.

జట్లు
ఇంగ్లండ్ (తుది జట్టు): బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.
భారత్ (అంచనా): యశస్వీ జైస్వాల్, రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, జడేజా, నితీశ్, సుందర్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీ్‌ప.
పిచ్/వాతావరణం
వికెట్‌పై పచ్చిక ఉండడంతో పేసర్లకు కొంత అనుకూలించనుంది. ఇటీవలే జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో బౌలర్ల ఆధిపత్యమే కనిపించింది. ఈ మ్యాచ్‌లో కూడా అలాగే జరిగే పరిస్థితులున్నాయి. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే చాన్సులున్నాయి. వాతావరణం సాధారణంగా పొడిగా ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకొనే అవకాశం ఉంది.
3
లార్డ్స్‌లో ఇరుజట్లు 19 సార్లు తలపడితే.. భారత్ 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఇంగ్లండ్ 12 టెస్ట్‌లు నెగ్గగా.. 4 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
18
ఇంగ్లండ్‌పై ఓ సిరీ్‌సలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ (602) రికార్డును అధిగమించడానికి గిల్ (585)కు కావాల్సిన పరుగులు.
మా వ్యూహాలు మాకున్నాయి: స్టోక్స్
అద్భుతంగా ఆడుతున్న గిల్ తోపాటు భారత బ్యాటర్లను కట్టడి చేయగల వ్యూహాలు మాకున్నాయి. ఆర్చర్ రాకతో బౌలింగ్ మెరుగుపడనుంది. ప్రత్యర్థులను అతడు ఇబ్బందులకు గురి చేయగలడు.
నేటినుంచి సోనీ స్పోర్ట్స్ తెలుగు చానెల్ అందుబాటులోకి రానుంది. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ఈ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.