Share News

India Dominate: త్రిశతక మోత

ABN , Publish Date - Oct 04 , 2025 | 02:53 AM

వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌ రెండో రోజే భారత్‌ పూర్తిగా పట్టు బిగించింది. ప్రత్యర్థిని మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కూల్చిన ఆతిథ్య జట్టు..ముగ్గురు బ్యాటర్లు జురెల్‌....

India Dominate: త్రిశతక మోత

అహ్మదాబాద్‌: వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌ రెండో రోజే భారత్‌ పూర్తిగా పట్టు బిగించింది. ప్రత్యర్థిని మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కూల్చిన ఆతిథ్య జట్టు..ముగ్గురు బ్యాటర్లు జురెల్‌ (125), జడేజా (104 బ్యాటింగ్‌), కేఎల్‌ రాహుల్‌ (100) శతక మోత మోగించడంతో భారీ స్కోరు చేసింది. శుక్రవారం ఆట ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 448 పరుగులు సాధించింది. 286 పరుగుల ఆధిక్యం కూడగట్టుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 121/2తో భారత్‌ రెండోరోజు మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించగా, కిందటిరోజు బ్యాటర్లు గిల్‌, రాహుల్‌ విండీస్‌ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్నారు. అర్ధ శతకం సాధించిన వెంటనే కెప్టెన్‌ గిల్‌ (50) స్పిన్నర్‌ చేజ్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ కొట్టబోయి నిష్క్రమించాడు. గిల్‌, రాహుల్‌ రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. మరోవైపు 57 పరుగుల వద్ద లైఫ్‌ దక్కించుకున్న రాహుల్‌ ఆపై జాగ్రత్తగా ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు. ఒక చేతితో బ్యాటు పైకెత్తి, మరో చేతి రెండు వేళ్లను నోటిలో ఉంచుకోవడం ద్వారా ఇటీవల పుట్టిన కుమార్తెకు ఈ సెంచరీని రాహుల్‌ అంకితమిచ్చాడు. కానీ వెంటనే స్పిన్నర్‌ వారికన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు.


6.jpg

జడేజా, జురెల్‌ ద్విశతక భాగస్వామ్యం: రక్షణాత్మక ధోరణిలో బ్యాటింగ్‌ చేసిన జురెల్‌ తొలుత మూడంకెల మార్క్‌ చేరుకున్నాడు. అయితే జురెల్‌ను అవుట్‌ చేయడం ద్వారా 206 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యానికి లెఫ్టామ్‌ స్పిన్నర్‌ పియరీ ముగింపు పలికాడు. మరోవైపు వికెట్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నా జడేజా పరుగులు రాబట్టాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు బయటకు వచ్చి భారీ షాట్లతో అలరించాడు. ఈక్రమంలో అతడు శతకం పూర్తి చేశాడు. రెండోరోజు ఆట ఆఖరికి జడేజాతోపాటు సుందర్‌ (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.

3 ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు భారత బ్యాటర్లు శతకాలు చేయడం ఈ ఏడాది ఇది మూడోసారి. గత పర్యటనలో ఇంగ్లండ్‌పై లీడ్స్‌, మాంచెస్టర్‌లో ఈ ఘనత సాధించారు.

10 ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌కి పదో శతకం. ఈక్రమంలో తొమ్మిది సెంచరీలు చేసిన రోహిత్‌ను దాటాడు.

80 టెస్ట్‌లలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌ జడేజా. ఈక్రమంలో ధోనీని (79)ని అధిగమించాడు. పంత్‌ (90) టాప్‌లో ఉన్నాడు.

12 సెంచరీ చేసిన 12వ భారత కీపర్‌ జురెల్‌.

Updated Date - Oct 04 , 2025 | 02:53 AM