Share News

Women Cricket World Cup: ప్రపంచం అందింది మనమ్మాయ్ నవ్వింది

ABN , Publish Date - Nov 03 , 2025 | 04:48 AM

భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది క్రీడాభిమానుల కోరిక ఫలించిన వేళ.. వన్డే వరల్డ్‌క్‌పలో భారత జట్టు నయా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో...

Women Cricket World Cup:  ప్రపంచం అందింది మనమ్మాయ్ నవ్వింది

  • భారత్‌దే వన్డే ప్రపంచ కప్‌

  • ఫైనల్లో దక్షిణాఫ్రికా చిత్తు

  • డబ్బే డబ్బు..

  • భారత్‌కు - రూ. 39.50 కోట్లు

  • దక్షిణాఫ్రికాకు - రూ. 19.78 కోట్లు

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు (4 ఇన్నింగ్స్‌లో 331) చేసిన బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్‌. బెలిండా క్లార్క్‌ (6 ఇన్నింగ్స్‌లో 330)ను అధిగమించింది.

పురుషుల, మహిళల క్రికెటర్లలో వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఫిఫ్టీ సాధించిన యంగెస్ట్‌ ప్లేయర్‌ (21 ఏళ్లు) గా షఫాలీ వర్మ.

మహిళల వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున ఎక్కువ పరుగులు (434) సాధించిన బ్యాటర్‌గా స్మృతి మంధాన. 2017 వరల్డ్‌కప్‌లో మిథాలీ 409 పరుగులు సాధించింది. అలాగే ఒకే ఎడిషన్‌లో 200+ రన్స్‌, 20+ వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్‌గా దీప్తి శర్మ నిలిచింది. మహిళల వరల్డ్‌కప్‌ ఫైనల్లో 50+ రన్స్‌, 5 వికెట్లు తీసిన ప్లేయర్‌గా దీప్తి.

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో అత్యధిక స్కోరు (314/9) సాధించిన రెండో జట్టుగా భారత్‌. 2022 ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆసీస్‌ 356/5 స్కోరుతో టాప్‌లో ఉంది.

ఒకే వరల్డ్‌కప్‌ (పురుషుల, మహిళల) సెమీస్‌, ఫైనల్లో శతకాలు బాదిన రెండో ప్లేయర్‌గా వోల్వార్ట్‌. 2022లో అలీసా హీలీ మొదట ఈ ఫీట్‌ సాధించింది. అలాగే మహిళల వన్డేల్లో ఎక్కువ శతకాలు (8) బాదిన రెండో కెప్టెన్‌గా నిలిచింది. మెగ్‌ లానింగ్‌ (11) టాప్‌లో ఉంది.

  • దీప్తి, షఫాలీ ఆల్‌రౌండ్‌ షో

  • కెప్టెన్‌ వోల్వార్ట్‌ సెంచరీ వృధా

ఆహా.. ఎంత మధురమో కదా ఈ విజయం. దాదాపు ఐదు దశాబ్దాల కల నెరవేరిన వేళ.. భారతావని యావత్తూ పులకరించిపోతోంది. గతంలో రెండు పర్యాయాలు ఫైనల్‌కు వచ్చి ఉసూరుమనిపించినా.. ఈసారి వన్డే విశ్వకప్‌లో ఆఖరి పంచ్‌ మనమ్మాయిలదే! టోర్నీ నాకౌట్‌ ముందు వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనమ్మాయిలు అసలు సిసలైన మ్యాచ్‌ల్లో మాత్రం సివంగుల్లా విజృంభించారు.


సెమీస్‌లో ప్రపంచ రికార్డు ఛేదనను తిరగరాసి సమరోత్సాహంతో ఫైనల్లోకి అడుగుపెట్టగా.. టైటిల్‌ ఫైట్‌లోనూ పట్టు చేజారనీయలేదు. ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బ్యాట్‌తో.. బంతితో సఫారీలపై పిడుగల్లే పడింది. ఇక అనూహ్య రీతిలో జట్టులోకి వచ్చిన యువ సంచలనం షఫాలీ వర్మ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లోనూ అదరగొట్టింది.

ఫలితంగా భారత మహిళల క్రికెట్‌ చరిత్రలోనే చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. మన మహిళల క్రికెట్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో వన్డే విశ్వకప్‌ను హర్మన్‌ బృందం సగర్వంగా ముద్దాడి.. కోట్లాది అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఎన్నో అవమానాలను తట్టుకుంటూ భారత మహిళల క్రికెట్‌ జట్టు సాధించిన పురోగతికి నిదర్శనం ఈ అద్భుతం.ఇక అమ్మాయిలూ.. ఈ విజయస్ఫూర్తితో ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లండి.. విజయోస్తు.


నవీ ముంబై: భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది క్రీడాభిమానుల కోరిక ఫలించిన వేళ.. వన్డే వరల్డ్‌క్‌పలో భారత జట్టు నయా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో నెగ్గిన హర్మన్‌ప్రీత్‌ సేన మొట్టమొదటిసారిగా విశ్వక్‌పను అందుకుంది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87; 2/36), దీప్తి శర్మ (58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 58; 5/39) ఆల్‌రౌండ్‌షోతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించారు. అటు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ వోల్వార్ట్‌ (98 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 101) శతక పోరాటానికి సహకారం కరువైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. మంధాన (58 బంతుల్లో 8 ఫోర్లతో 45) రాణించింది. ఖాకాకు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. డెర్క్‌సెన్‌ (35) ఫర్వాలేదనిపించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షఫాలీ, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా దీప్తి శర్మ నిలిచారు. అంతకుముందు మ్యాచ్‌ సమయానికి భారీ వర్షం కురవడంతో టాస్‌ కూడా వీలు పడలేదు. అనంతరం రెండు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు మ్యాచ్‌ను ఆరంభించారు.


వోల్వార్ట్‌ సెంచరీ బాదినా..: భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ వోల్వార్ట్‌ ఒంటరి పోరాటం సాగించింది. కానీ కీలక సమయంలో వికెట్లు తీసిన స్పిన్నర్లు షఫాలీ, దీప్తి శర్మ ప్రత్యర్థికి చెక్‌ పెట్టారు. తొలి 5 ఓవర్లలో 18 పరుగులే చేయగా.. ఆ తర్వాత వోల్వార్ట్‌ బౌండరీల జోరుకు పవర్‌ప్లేలో 52 పరుగులు సాధించగలిగింది. అయితే లేని పరుగు కోసం వెళ్లి ఓపెనర్‌ బ్రిట్స్‌ (23) అమన్‌త్రోతో రనౌటైంది. ఇక శ్రీచరణి తన తొలి ఓవర్‌లోనే బాష్‌ (0) వికెట్‌ తీసి మరింత జోష్‌ నింపింది. ఈ దశలో లూస్‌తో కలిసి మూడో వికెట్‌కు వోల్వార్ట్‌ 52 పరుగులు జోడించింది. మరోవైపు పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ షఫాలీకి బంతినిచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ ఫలితం సాధించింది. చక్కగా కుదురుకున్న లూస్‌ (25)తో పాటు కీలక కాప్‌ (4)ను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చడంతో భారత శిబిరంలో సంబరాలు నెలకొన్నాయి. ఆ తర్వాత జాఫ్టా (16) స్పిన్నర్‌ దీప్తికి చిక్కింది. ఇక వోల్వార్ట్‌ను 42వ ఓవర్‌లో దీప్తి అవుట్‌ చేయడంతో స్టేడియం హోరెత్తింది. అమన్‌ ఈ క్యాచ్‌ను రెండో ప్రయత్నంలో అద్భుతంగా పట్టేసింది. అదే ఓవర్‌లో ట్రియాన్‌ (9) ఎల్బీగా వెనుదిరిగింది. దీంతో 221 రన్స్‌కే 8 వికెట్లు పడగా.. మ్యాచ్‌ భారత్‌ వైపు మొగ్గు చూపింది. చివరి రెండు వికెట్లు సైతం నాలుగు పరుగుల వ్యవధిలోనే నేలకూలడంతో భారత్‌కు అద్భుత విజయం దక్కింది.


శతక భాగస్వామ్యంతో ఆరంభం: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఓపెనర్‌ షషాలీ మెరుపులు.. మధ్య ఓవర్లలో దీప్తి శర్మ సంయమన ఆటతీరు.. చివర్లో రిచా ఘోష్‌ ఎదురుదాడితో 300 స్కోరు దరిదాపుల్లోకి రాగలిగింది. మంధాన దూకుడుగా ఆడకుండా షఫాలీకి సహకరించింది. ఇద్దరి ఆటతీరుతో తొలి వికెట్‌కు 104 పరుగుల శతక భాగస్వామ్యం జత చేరింది. ప్రతీకా గాయంతో ఏకంగా జట్టులో చోటు దక్కించుకున్న షఫాలీ కీలక ఫైనల్లో దుమ్ము రేపింది. దీంతో పవర్‌ప్లేలోనే భారత్‌ 64 పరుగులతో జోరు మీద కనిపించగా, ఈ స్థితిలో 320+ స్కోరు ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత పిచ్‌ నెమ్మదించడంతో స్పిన్నర్లు ప్రభావం చూపి పరుగులకు ముకుతాడు వేశారు. అటు 18వ ఓవర్‌లో మంధాన వెనుదిరిగింది. 56 పరుగుల వద్ద షఫాలీ క్యాచ్‌ను బాష్‌ వదిలేసింది. కానీ రెండో వికెట్‌కు 62 పరుగులు జత చేరాక షఫాలీ, జెమీమా (24)లను పేసర్‌ ఖాకా వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దీప్తి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. దీప్తితో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం అందించిన హర్మన్‌ (20)ను స్పిన్నర్‌ ఎంలబా దెబ్బతీసింది. అనంతరం అమన్‌జోత్‌ (12) అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన రిచా సిక్సర్‌తో ఖాతా తెరిచింది. ఖాకా ఓవర్‌లో సిక్సర్‌ బాదాక తన క్యాచ్‌ను డీప్‌స్క్వేర్‌లో బాష్‌ వదిలేసింది. అయితే ఎక్కువసేపు క్రీజులో నిలువకుండా తను 49వ ఓవర్‌లో ఖాకాకే చిక్కడంతో భారత్‌ ఆశించిన స్కోరుపై ప్రభావం పడింది. ఆరో వికెట్‌కు రిచా-దీప్తి 47 పరుగులు సమకూర్చారు. ఇక అర్ధసెంచరీ పూర్తి చేసిన దీప్తి ఇన్నింగ్స్‌ చివరి బంతికి రనౌటైంది.

Updated Date - Nov 03 , 2025 | 05:03 AM