Share News

Thrilling Third Test: సమంగా నిలిచారు

ABN , Publish Date - Jul 13 , 2025 | 02:56 AM

ఐదు టెస్టుల సిరీ్‌సలో లార్డ్స్‌ మ్యాచ్‌ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. మూడో టెస్టులో శనివారం కేఎల్‌ రాహుల్‌ (100) శతకంతో సత్తా చాటగా.. రిషభ్‌ పంత్‌ (74), జడేజా (72) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు...

Thrilling Third Test: సమంగా నిలిచారు

ఎవరికీ దక్కని ఆధిక్యం

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 387

  • రాహుల్‌ శతకం

  • రాణించిన పంత్‌, జడేజా

  • ఇంగ్లండ్‌తో మూడో టెస్టు

లండన్‌: ఐదు టెస్టుల సిరీ్‌సలో లార్డ్స్‌ మ్యాచ్‌ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. మూడో టెస్టులో శనివారం కేఎల్‌ రాహుల్‌ (100) శతకంతో సత్తా చాటగా.. రిషభ్‌ పంత్‌ (74), జడేజా (72) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. అయితే ఆఖర్లో ఇంగ్లండ్‌ పేసర్లు దెబ్బతీయడంతో గిల్‌ సేన పైచేయి సాధించే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులే చేయగలిగింది. ఇంగ్లండ్‌ కూడా తమ ఇన్నింగ్స్‌లో ఇంతే స్కోరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు జట్లలో ఎవరికీ ఆధిక్యం లభించలేదు. పేసర్లు వోక్స్‌కు మూడు.. స్టోక్స్‌, ఆర్చర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఇక రెండో సెషన్‌లో కేవలం ఒకే ఓవర్‌ ఆడిన ఇంగ్లండ్‌ మూడో రోజును వికెట్‌ నష్టపోకుండా 2 పరుగులతో ముగించింది. అయితే మరో ఓవర్‌కు వెళ్లకూడదనే ఉద్దేశంతో ఓపెనర్లు క్రాలే (2 బ్యాటింగ్‌), డకెట్‌ (0 బ్యాటింగ్‌) సమయాన్ని వృధా చేయడంతో భారత్‌ ఆటగాళ్లు వారిని గేలి చేయడం కనిపించింది.


2-sports.jpg

నొప్పిని భరిస్తూనే..: 145/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించగా, రాహుల్‌-పంత్‌ జోడీ ఇంగ్లండ్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. సెషన్‌ తొలి ఓవర్‌లోనే పంత్‌ రెండు ఫోర్లు సాధించాడు. కానీ ఆ తర్వాత అర్ధగంట సేపు ఇద్దరూ ఆచితూచి ఆడడంతో మరో బౌండరీ రాలేదు. ఓ దశలో వరుసగా ఐదు ఓవర్లలో సింగిల్‌ రన్‌ కూడా తీయలేదు. చివరకు పేసర్‌ కార్స్‌ ఓవర్‌లో రాహుల్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో ఆకట్టుకున్నాడు. ఇక డ్రింక్స్‌ తర్వాత స్టోక్స్‌ వేసిన ఓవర్‌లో బంతి పంత్‌ చేతి వేలికి తాకడంతో ఫిజియోతో చికిత్స తీసుకున్నాడు. నొప్పిని భరిస్తూనే అదే ఓవర్‌లో పంత్‌ సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. స్టోక్స్‌ తర్వాతి ఓవర్‌లోనూ పంత్‌ గ్లోవ్స్‌కు బంతి తాకడంతో మరోసారి ఫిజియో రావాల్సి వచ్చింది. అయినా బషీర్‌ ఓవర్‌లోనూ తను సిక్సర్‌ బాదాడు. ఇక సెషన్‌ ఆఖరి ఓవర్‌లో పంత్‌ అనవసర రన్‌ కోసం వెళ్లగా, షార్ట్‌ కవర్స్‌ నుంచి స్టోక్స్‌ సూపర్‌ త్రో కారణంగా రనౌటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.


నిదానంగా..: టీ బ్రేక్‌ సమయానికి 98 రన్స్‌తో ఉన్న రాహుల్‌ ఈ సెషన్‌ రెండో ఓవర్‌లోనే టెస్టు కెరీర్‌లో పదో శతకం పూర్తి చేశాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే స్లిప్‌లో బ్రూక్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో తన నిలకడైన ఇన్నింగ్స్‌ ముగిసింది. స్పిన్నర్‌ బషీర్‌ ఈ వికెట్‌ తీశాడు. ఆ తర్వాత జడేజా -నితీశ్‌ (30) వికెట్‌ కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వడంలో పరుగులు నెమ్మదించాయి. దీనికి తోడు ఇద్దరి మధ్య సమన్వయలోపం కారణంగా మూడుసార్లు నితీశ్‌ రనౌటయ్యే ప్రమాదం నుంచి బయటపడడం గమనార్హం. ఆర్చర్‌ బౌన్స్‌తో ఈ జోడీని ఇబ్బందిపెట్టాడు. కొత్త బంతిని తీసుకున్నా బౌలర్లు వికెట్‌ను తీయలేకపోయారు. అయితే స్టోక్స్‌ ఓవర్‌లో బౌన్సర్‌ నితీశ్‌ హెల్మెట్‌కు బలంగా తాకడంతో ఫిజియో వచ్చి పరిశీలించాడు. ఈ సెషన్‌లో 68 పరుగులే సమకూరాయి.

వికెట్లు టపటపా: ఆఖరి సెషన్‌లో భారత్‌ 71 పరుగులు సాధించినా మిగిలిన ఐదు వికెట్లను కోల్పోయింది. దీంతో సరిగ్గా ప్రత్యర్థి స్కోరు దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. నితీశ్‌ను ఆరంభంలోనే స్టోక్స్‌ అవుట్‌ చేయగా ఆరో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత జడ్డూకు సుందర్‌ (23) జత కలవడంతో స్కోరులో కాస్త కదలిక వచ్చింది. కార్స్‌ ఓవర్‌లో జడేజా రెండు ఫోర్లు బాదగా, రూట్‌ ఓవర్‌లో సుందర్‌ 4,6తో ఆకట్టుకున్నాడు. అయితే సెంచరీ వైపు సాగుతున్న జడేజాను వోక్స్‌ అవుట్‌ చేయడంతో ఏడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే అదే ఓవర్‌లో ఆకాశ్‌ (7)ను ఎల్బీగా అంపైర్‌ రెండుసార్లు ప్రకటించినా రివ్యూ ద్వారా బతికిపోయాడు. కానీ, రెండు పరుగుల వ్యవధిలోనే ఆకాశ్‌, బుమ్రా (0), సుందర్‌ పెవిలియన్‌ చేరడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 387

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 13; రాహుల్‌ (సి) బ్రూక్‌ (బి) బషీర్‌ 100; కరుణ్‌ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 40; గిల్‌ (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 16; పంత్‌ (రనౌట్‌/స్టోక్స్‌) 74; జడేజా (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 72; నితీశ్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 30; సుందర్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 23; ఆకాశ్‌ (సి) బ్రూక్‌ (బి) కార్స్‌ 7; బుమ్రా (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 0; సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 119.2 ఓవర్లలో 387 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-13, 2-74, 3-107, 4-248, 5-254, 6-326, 7-376, 8-385, 9-387, 10-387. బౌలింగ్‌: వోక్స్‌ 27-5-84-3; ఆర్చర్‌ 23.2-6-52-2; కార్స్‌ 24-5-88-1; స్టోక్స్‌ 20-4-63-2; బషీర్‌ 14.5-2-59-1; రూట్‌ 10.1-0-35-0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలే (బ్యాటింగ్‌) 2; డకెట్‌ (బ్యాటింగ్‌) 0; మొత్తం: ఒక ఓవర్‌లో 2/0. బౌలింగ్‌: బుమ్రా 1-0-2-0.

1

ఇంగ్లండ్‌పై టెస్టుల్లో ఎక్కువ సిక్సర్లు (35) బాదిన ప్లేయర్‌గా వివ్‌ రిచర్డ్స్‌ (34)ను అధిగమించిన రిషభ్‌ పంత్‌. అలాగే ఇంగ్లండ్‌లో ఎక్కువ (8) 50+ స్కోర్లు సాధించిన పర్యాటక జట్టు వికెట్‌ కీపర్‌గా ధోనీతో సమంగా నిలిచిన పంత్‌.

1

విదేశాల్లో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎక్కువ సిక్సర్లు (36) బాదిన జట్టుగా భారత్‌.

2

లార్డ్స్‌లో ఎక్కువ శతకాలు (2) బాదిన రెండో భారత ఆటగాడిగా రాహుల్‌. దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ (3) ముందున్నాడు.

ఇవీ చదవండి:

టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!

ఈ ఒక్క మ్యాజిక్ జరగాల్సిందే!

చనిపోతాడని అనుకోలేదు: సిరాజ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 02:56 AM